- పాశ్చాత్య దేశాలకు భారతీయ “విలువలే” ఆధారం
కరోనా పుణ్యమా అని షేక్ హాండ్ లు ఇచ్చే వారు భయంతోనో భక్తితోనో నమస్కారం పెట్టే సంస్కారం నేర్చుకున్నారు… వెస్ట్రన్ కల్చర్ లో మనిషి కనబడితే చాలు ఆడ మొగ తేడా లేకుండా, చిన్న పెద్ద భేదం లేకుండా చెంపలను ఆనించి ఆలింగనం తో మర్యాద పాటించే ఆచారం కరోనా తో మటు మాయం అయింది…! ఆ జాడ్యం బాలీఉడ్ సినిమా తారలకు కూడా పట్టుకుంది…కరోనా తో “కుసంస్కారం” ప్రాణ భయం తెచ్చి పెట్టింది! మనిషి ఎదురైతే తలకు మహా కవచ్ లు ప్లాస్టిక్ సేఫ్ గార్డులు, మాస్క్ లు తో గౌరవం ఇనుమడింపే నమస్కారం సంస్కారం అయినపుడు భారతీయ సంస్కృతి కి ప్రపంచ దేశాలు నీరాజనం పట్టాయి! నిన్న మొన్న అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం లో కూడా ఇద్దరు కనబడితే ఆలింగనం మాట దేవుడెరుగు ముక్కు మూసుకొని యోగా పాటించారు!
ఇక నమస్కారం అనే పదం సంస్కృతం నుండి వచ్చింది. సంస్కృతంలో నమః అంటే విధేయత అని అర్థం! నమస్కారం వల్ల రెండు చేతుల్లో ఉన్న నాడీ మండలం కలవడం వల్ల శరీర అవయవాలు ఉత్తేజం పొంది ఆరోగ్య జీవనం బాగుంటుందని పెద్దలు నమస్కారానికి ఎన్నో ఆరోగ్య సూత్రాలు అల్లారు! నమస్కారం వల్ల వినయ విధేయతలే కాకుండా, సత్ప్రవర్తనకు తార్కాణంగా నిలిచే సంస్కృతి పూర్వీకులు మనకు ఇచ్చారు. ఇప్పుడు విదేశాల్లో సాష్టాంగ నమస్కారం కూడా ఒక పేషన్ గా మారనుంది..ఎనిమిది అంగాలను భూమికు ఆనించి చిత్త శుద్దితో బోర్లా పడుకొని సాష్టాంగ నమస్కారం చేయడం వల్ల ఆయుష్షు ప్రమాణం పెరుగుతుందట!
ఇతి హాసాల్లో, పురాణ శాస్త్రాలలో సాష్టాంగ నమస్కారం గురించి వివరంగా రాశారు! ఉరస్సు, శిరస్సు,దృష్టి , మనసు, వదనం,పద్భ్యాం కరభ్యం, జానుభ్యం ఇలా అష్టాంగాలు భూమికి తాకినప్పుడు మనిషి దేహంలో ప్రతి అవయవానికి చలనం వస్తుందట! అయితే ఆడవాళ్లు మాత్రం సాష్టాంగ నమస్కారం చేయకూడదు…గర్భకోశం భూమికి అనకుండా మోకాళ్ళ పై మహిళలు వంగి పాదాలు వెనుకకు ముని వెళ్ళపై ఉంచి నమస్కారం చేయాలని శాస్త్రాలు వివరించాయి! అమెరికా లోని ప్రతి రాష్ట్రంలో భారతీయ దేవాలయాల్లో సంస్కృతి సంప్రదాయాలకు అమెరికన్లు మోకరిల్లడం శుభ సూచకం! అలాగే ప్రతి పట్టణంలో యోగా నిత్య కృత్యం అయింది! బర్గర్లు, సమోసాలు, ఫ్రిజ్ నిలువలను ఇప్పుడు పాశ్చాత్య దేశాలు పక్కన పడేశాయి!
వేడి వేడి వెల్లుల్లి, ఉల్లిపాయ, మసాలా దినుసులు…పసుపు సుగంధ ద్రవ్యాలు నోట్లో వేసుకొని అంటు రోగాలు అంటకుండా జాగ్రత్త పడుతున్నారు…యాలకులు, లవంగాలు, కషాయలే కరోనా విరుగుడుకు మందు అని తెలుసుకుంటున్నాయి. ఇక న్యూ యార్క్, డాలస్ లతో పాటు తెలుగు వారు అధికంగా నివసించే ప్రాంతాల్లో హైద్రాబాద్ బిర్యాని కి డిమాండ్ పెరిగిందట! రాను రాను హైద్రాబాద్ వీధుల్లో గోధుమ, మొక్కజొన్న, సజ్జ రొట్టెలు చేస్తున్నట్టు అమెరికా వీధుల్లో కూడా భారతీయ రోటీ దుకాణాలు వేలుస్తాయేమో! కరచాలనం ఎందుకు వద్దు అంటే…రెండు చేతులు నిమిషం విరామం లేకుండా దుమ్మూ ధూళి, తిను బండారాలు ముట్టుకోవడం వల్ల కొన్ని లక్షల బ్యాక్టీరియా చేతులను అంటుకొని ఉంటుంది.
దానికి తోడు చెవిలో, ముక్కులో, కళ్ళల్లో మలినం అంతా చేతులతో ముట్టుకుంటాం కనుక చేతుల ద్వారా అంటూ వ్యాదులు వస్తున్నాయని డాక్టర్లు రోజూ చెబుతున్నారు..మల మూత్ర పనులు కూడా కరచాలనం వల్ల వచ్చే రోగాలకు కారణం అని… వాష్ రూమ్ లు బ్యాక్టీరియా కు పుట్టిల్లు కాబట్టి చేతులు,కాళ్ళు కడగంది అమ్మలు..అమ్మమ్మలు నానమ్మ లు ఇంట్లోకి రానిచ్చే వారు కాదు..ఇప్పుడు ప్రతి దేశంలో ఇంటి ముందు సానిటైజర్లు, కాళ్ళు చేతులు కడుక్కుని రావడానికి వాష్ బేసిన్లు పెట్టడం అక్షరాల భారతీయ సంస్కృతిని అద్దం పడుతున్నాయి. యూరప్ దేశాల నుండి వచ్చిన ఈ కరచాలనం స్పర్శ ఇప్పుడు అంటి ముట్టనట్టు ఆ దేశాలే వ్యవహరిస్తున్నాయి… చేతులు కలిపితే క్వారన్ టైన్ లో పడేసే చట్టాలు వారికి చుట్టాలు అవుతున్నాయి. ఇంత మార్పు రావడానికి భారత దేశ సంస్కృతికి కరోనా పాజిటివ్ కావడం వల్ల ప్రపంచం లోని మనిషి మన ఆరోగ్య సూత్రాలు పాటించడం నిజంగా మన పూర్వీకుల గొప్ప దనమే!