- స్వయం సమృద్ధి ఆత్మనిర్భర్ తోనే సాధ్యం
- ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం
- బహిష్కరించిని 18 పార్టీలు
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉభయ సభలనుద్దేశించి కీలక ప్రసంగం చేశారు. కరోనా మహమ్మారిపై భారత్ చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకమని ప్రశంసలతో ముంచెత్తారు.
స్వయం సమృద్ధి దిశగా భారత్:
ఆత్మనిర్భర్ భారత్ నినాదంతో స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తున్నట్లు రాష్ట్రపతి తెలపారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్ లో జరుగుతోంది. దేశంలో రెండు టీకాలను రూపొందించినట్లు కోవింద్ ప్రసంగంలో తెలిపారు. కొవిడ్ సంక్షోభ సమయంలో పొరుగుదేశాలతో కలిసి సాగుతున్నామని స్పష్టం చేశారు. దేశ ప్రజలందరి జీవన స్థితిగతుల ఉన్నతికి ఆత్మనిర్భర్ భారత్ బాటలు పరిచిందని రాష్ట్రపతి తెలిపారు.
ఇది చదవండి: పార్లమెంటు క్యాంటీన్ లో భోజనప్రియులకు మంట
రైతుల సంక్షేమం కోసమే కొత్త సాగు చట్టాలను తెచ్చామని రాష్ట్రపతి తెలిపారు. కొత్త చట్టాలతో రైతులకు కొత్త అవకాశాలు, హక్కులు లభిస్తాయని అన్నారు. కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతుల ఖాతాల్లోకి లక్షా 13 వేల కోట్ల రూపాయాలు బదిలీ చేశామన్నారు. బాపూజి కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాధించేందుకు కృషిచేస్తున్నామని అన్నారు. దేశంలో ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించే కార్యక్రమం వేగంగా సాగుతోందన్నారు. గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీ లో జరిగిన ఘటన బాధ కలిగించాయన్నారు. జాతీయ పతాకాన్ని అవమానించడం దురదృష్టకరమైన సంఘటనగా అభివర్ణించారు.
పార్లమెంటు సమావేశాల్లో భాగంగా 2020-21 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టారు. పార్లమెంటు ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగం పూర్తయిన తర్వాత ఆమె ఆర్థిక సర్వేను సభకు సమర్పించారు. ఆర్థిక సర్వే సమర్పించిన అనంతరం లోక్ సభను ఫిబ్రవరి 1 వ తేదీకి వాయిదా వేశారు.
ఇది చదవండి: నివురుగప్పిన నిప్పులా ఢిల్లీ సరిహద్దులు
రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించిన ప్రతిపక్షాలు:
సాగు చట్టాలపై రైతులు చేస్తున్న ఆందోళనలపై కేంద్రం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరికి నిరసనగా 18 పార్టీలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాయి.