నన్ను సూస్తే నవ్వులాట అందరికి
మరదంతే!
అమ్మోరి మచ్చల నల్ల మొకం,
బఱ్ఱె పెదాలు, చాటంత సెవులు,
బట్టతల, దిబ్బ ముక్కు, మెల్ల కళ్ళు,
బాన పొట్ట, వంకర కాళ్ళు.
నేల నుండి నాలుగడుగుల పొడుగు!
మరి నవ్వరా!?
ఏలకోళం సేస్తారు, ఎటకారాలు పడతారు,
చతుర్లాడతారు, ఎనకమాల జేరి ఇక ఇక నవ్వతారు.
నేనిట్టుంటే నాది తప్పా!?
తోలు జూసి మొక్కతారు తొత్తు కొడుకులు!
పైన పటారం సూసి పలకరిస్తారు
డబ్బు సూసి ఎకిలిగా పల్లికిలిస్తారు.
నేనింతే, ఆల్లింతే!
నేనూ నవ్వత, నన్నుచేసినోన్ని సూసి,
నవ్వత నవ్వతానే నవ్వుతో కడిగేస్తా!
“వయసు మల్లతాంది నీకు నాలుగు తలల సామి!
నా మట్టి పిసకతుంటే సేయి వణికిందా ఏమి?”
రైతు బిడ్డ
నా తోటోళ్లందరు ఇసుకూలుకు బోయారు.
అడిగితే, మా అయ్య ఈడకు తెచ్చాడు.
మట్టి, బురద, నీళ్లు, ముళ్ళు దాటితే,
గనాల మీద తడబడతా తడబడతా పోతే
లోన ఏడో మా చేలు, ఓ ఎకరా అట!
“ఇదేరా నీ ఇసుకూలు!” సూపిస్తా సెప్పాడు అయ్య
…ఏడుస్తున్న ఎండిపోయిన ఖాళీ నేల
కోతలయ్యాక మిగిలిన ఎండు గడ్డి!
“ఈడ జూడు నల్లగా ఉండలుండలుగా నేల
ఇదేరా నీ కొత్త పలక, ఈ నాగలి బలపం.”
“అయిగో తెల్లగా, నల్లగా మబ్బులు ఆకాశంలో
మంచిగా పాఠం సెప్పే సల్లని అయ్యోర్లు ఓళ్ళు.
అదిగో తలమీద ఎర్రగా సూరీడు, …పెద్దయ్యోరు.
ఈపు బలే మాడస్తాడు గాని మంచోడు.
ఈ సాగతా సాగతా పోతున్న సన్నటి, ఎర్రటి వానపాములు
ఆల్లే డబ్బులడగని మన కూలీ పనోళ్లు,
ఆడజూడు బొరియలోన్చి తొంగి తొంగి సూస్తున్న
ముచ్చుమొహం పందికొక్కులు,
ఇంకా పైన వచ్చి వచ్చి సూసి పోతున్న పిచ్చికలు
ఈళ్ళిద్దరు పచ్చి దొంగలు.
“మొదలెత్తు మొదటి పాఠం…అబ్బాయా!
నేలపై నాగలి తో గీయి, నేరుగా, లోతుగా
బుడ్డ వరి రైతు మొదటి అచ్చరాలు…
మనం ఇయి గీయకపోతే అంతే సంగతులు
ఓ, న, మా, లు రాసేవాలకు పుట్టవు పిడికెడు మెతుకులు.”
…మహతి
14.03.2021.
Also read: గాయం
Also read: పగిలిన గాజు పెంకు
Also read: జగన్నాథ రథచక్రాలు
Also read: నేను చెప్పని కతలు
Also read: నా ఇష్టాయిష్టాలు
bagundi genem