Tuesday, December 3, 2024

చట్టసభలు నేరచరితులమయం!

  • చట్టాలు చేయవలసినవారే నేరస్థులా?
  • ఇందులోనూ యూపీదే అగ్రతాంబూలం
  • నైతికత పెరగాలి, నేరస్వభావులు తగ్గాలి

రాజకీయాల్లో నేరచరితులు పెరిగిపోతున్నారని మేధావులు ఘోషించడమేకాదు, నివేదికలు కూడా  అవే చెబుతున్నాయి. ఇది చాలా ప్రమాదకరమైన పరిణామం. చాప కింద నీరులా చట్టసభల్లోకి నేరస్తులు తామర తంపరల్లాగా చేరిపోతున్నారనే అంశం దేశానికి మంచిది కాదు. నివేదికల ప్రకారం ప్రస్తుతం దేశంలో 4వేలకు పైగా క్రిమినల్ కేసులు తాజా, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్నాయని సమాచారం. సుప్రీంకోర్టు మొదలు వివిధ హైకోర్టుల నుంచి అందిన నివేదికలు ఈ అంశాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. ఇందులో సిట్టింగ్ ప్రజాప్రతినిధులపై సగానికి పైనే కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిపై సత్వరమే విచారణ జరిపి శిక్షించాలని కొందరు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేస్తూ ఉద్యమబాట పడుతున్నారు. ఈ కేసులపై విచారణ వేగవంతం చెయ్యాలని సుప్రీంకోర్టు ఇప్పటికే సూచించింది. నేరచరితులైన నేతలను విచారించడానికి ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చెయ్యాలని రాష్ట్రాలకు  సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా జారీచేసింది. తీవ్రనేరాలకు సంబంధించి యావజ్జీవిత ఖైదుకు శిక్షార్హమైన కేసులు 413ఉంటే, అందులో 174మంది సిట్టింగ్ ప్రజాప్రతినిధులు ఉండడం ఆశ్చర్యకరం. ఉత్తరప్రదేశ్, బీహార్, కర్ణాటక, మహారాష్ట్రలో తీవ్ర నేరచరిత కలిగిన నేతలు ఎక్కువగా ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. చాలా కేసుల్లో తీవ్రమైన నేరాలకు పాల్పడినవారిపై  ఇంతవరకూ ఛార్జిషీటు కూడా దాఖలు కాలేదనే సమాచారం.

Also read: సాహో సాంకేతికత!

అశ్వినీకుమార్ ఉఫాధ్యాయ వ్యాజ్యం

ఉత్తరప్రదేశ్ కు చెందిన 446, కేరళకు చెందిన  310 కేసుల్లో  ఎంపీలు/ఎమ్మెల్యేలు  ఉన్నట్లు గత నివేదికలు చెప్పాయి. తెలుగురాష్ట్రాల్లో తాజా, మాజీ ప్రజాప్రతినిధులపై 263 కేసులు ఉన్నాయని అంటున్నారు. ప్రజాప్రతినిధులుగా ఉన్న నేరస్తులకు శిక్ష పడాలని హక్కుల ఉద్యమనేత అశ్వినీకుమార్ ఉపాధ్యాయ ఆ మధ్య ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టుకు సహాయం చెయ్యడానికి అమికస్ క్యూరీగా సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా నియమితులయ్యారు కూడా. పెండింగ్ కేసులకు సంబంధించిన అఫిడవిట్ ను హన్సారియా సుప్రీంకోర్టులో సమర్పించడం కూడా జరిగింది. ఈ గణాంకాలను చూస్తే భయం వేస్తోంది. ప్రజల తరపున నిలిచి, సమస్యలు పరిష్కరించి, సంక్షేమం చేపట్టి, విచక్షణాయుతంగా  సమాజాన్ని, రాష్ట్రాలను, దేశాన్ని ప్రగతివైపు నడిపించాల్సిన ప్రజారథ సారథులు ప్రజాప్రతినిధులు. వారే నేరస్తులుగా ఉంటే, నేరచరితులే చట్టసభలకు  ప్రాతినిధ్యం వహిస్తే, రాజ్యాంగస్ఫూర్తి, ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజికనైతికత ఏమైపోవాలని బాధ్యతగల పౌరులు గగ్గోలు పెడుతూనే ఉన్నారు.

Also read: ఆయుర్వేదం వైపు ప్రపంచం చూపు

సత్యసంధుల సంఖ్య తగ్గిపోతోంది

ఒకప్పుడు ఎక్కువమంది సత్ శీలురు చట్టసభల్లో ఉండేవారు. చిన్న ఆరోపణ వచ్చినా, చిన్న మరక అంటినా వెంటనే పదవికి రాజీనామా చేసి, తమ నైతికతను  చాటుకొని స్ఫూర్తిగా నిలిచిన నేతలు మొన్నమొన్నటి వరకూ ఉన్నారు. క్రమేపీ నైతికత కలిగినవారు రాజకీయాల్లోకి రావడం తగ్గిపోయింది. నేరచరితులై వచ్చినవారు, వచ్చిన తర్వాత నేరస్తులుగా మారిపోతున్నవారు పెరిగిపోతున్న దశలో రాజకీయ సమాజం ఉండడం చాలా బాధాకరం. చట్టాలు చెయ్యవలసినవారే చట్టవ్యతిరేక కార్యాలు చేపడితే, రాజకీయాలు ఎటు పోతున్నాయని ప్రశ్నించుకోవాలి, ఆవేదన చెందాలి. అదే సమయంలో ఇక్కడ ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ కక్షల్లో భాగంగా నిందలు వెయ్యడం వేరు, నిందలు మొయ్యడంవేరు, నిజంగా నేరస్తులై ఉండడం వేరు. ముందు నేరం రుజువవ్వాలి. రుజువై, శిక్ష పడే పరిస్థితి రావాలి. నిష్పక్షపాతం, న్యాయం, ధర్మం విచారణా తీరులో అమలవ్వాలి. నేరస్తుడుగా రుజువైన వ్యక్తిని ఎన్నికలకు అనర్హుడిగా ప్రకటించాలి. నేరస్వభావుడికి, నేరచరితుడికి ఓటు వెయ్యకుండా ప్రజలు తమ పాత్రను పదునుగా  పోషించాలి. ఎలక్షన్ కమీషన్, న్యాయవ్యవస్థలు, రాజ్యాంగశక్తులు స్వేచ్చాయుత వాతావరణంలో తమ వృత్తిధర్మాన్ని పాటించగలిగే పటిష్ఠమైన పరిస్థితులు నెలకొని ఉండాలి. ఇవన్నీ కాస్త ఆలోచన ఉన్న  పౌరులను తొలుస్తున్న ప్రశ్నలు. తప్పు ఎక్కడ ఉందని ప్రశ్నించుకుంటే, అడగడుగునా కనిపిస్తోంది. ఈ ప్రక్షాళన ఆచరణలో సాధ్యమా? అన్నది పెద్ద ప్రశ్న.

Also read: సంపన్న భారతం

శేషన్ వంటి ఎన్నికల అధికారులు రావాలి

ప్రతి తప్పుకు-ఇంకొక తప్పుతో ముడిపడి ఉన్న వ్యవస్థలో మనం ఉన్నాం. పండిట్ జవహర్ లాల్ నెహ్రు, లాల్ బహుదూర్ శాస్త్రి, మొరార్జీదేశాయ్, పటేల్, ప్రకాశంపంతులు వంటి నేతల చరిత చరిత్ర పుటల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పటికీ సత్ శీలురైన ప్రజాప్రతినిధులు లేకపోలేదు. కాకపోతే,ఆ సంఖ్య తగ్గిపోతూ ఉండడమే ఆవేదన రగిల్చే అంశం. పెండింగ్ కేసులు సత్వరం పరిష్కారం కాకపోవడానికి సిబ్బంది కొరత ఒక కారణం. రాజకీయ ఒత్తిళ్లు, ప్రభావం  ప్రధానమైన కారణాలుగా భావించవచ్చు. చట్టాల్లో ఉండే కొన్ని లోపాలు లేదా తమకు అనుకూలంగా ఉండే కొన్ని  అంశాలు కూడా నిజమైన నేరస్తులను శిక్ష పడకుండా రక్షిస్తూ ఉన్నాయనే వాదనలు కూడా ఉన్నాయి. నేరస్వభావిని  అధికారపు అందలం ఎక్కకుండా ఆపటం ప్రజల చేతుల్లోనే  ఉంది. అది ఓటుకున్న శక్తి.నేరస్తుడ్ని ఎన్నికల నుంచి బహిష్కరించడం రాజ్యాంగ శక్తుల్లో ఉంది.ఇవన్నీ కచ్చితంగా జరిగితే, జరగనిస్తే మంచివాళ్లు రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. కోట్లాది రూపాయల డబ్బుమయంగా మారిన ఎన్నికల ప్రక్రియ మారకపోతే నేరచరితుల సంఖ్య ఇంకా పెరగడం తప్ప,తరగడం జరిగేపని కాదు. టిఎన్ శేషన్ వంటి అధికారులు పుట్టుకురావాలని మొన్నామధ్య  సుప్రీం న్యాయమూర్తులు కూడా వ్యాఖ్యానించారు. కెజె రావు వంటి వారు కలిసి ‘ఎలక్షన్ వాచ్’ ద్వారా అక్రమాలను వెలికితీయడానికి కొంత ప్రయత్నం చేశారు. ఇటువంటి ప్రయత్నాలు ఎంతోకొంత సహకరించినా, మూల వ్యవస్థలలో మార్పులు రాకాపోతే ఆశించిన న్యాయం జరుగదు. ప్రస్తుత సామాజిక దృశ్యంలో, నైతికత అనే మాట ఒక ఆచరణ సాధ్యంకాని అంశంగానే మిగిలివుంది. అసమర్ధుడి మొదటి లక్షణం గానే నిలిచివుంది. మనిషి ఆశాజీవి కదా, ఏదో రోజు పెనుమార్పు, సరికొత్త చైతన్యం వస్తాయని ఆశిద్దాం. రావాలని బలంగా కోరుకుందాం.

Also read: యువముఖ్యమంత్రి రేవంత్ కేబినెట్ లో సీనియర్లు

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles