——————
( ‘ CRIME AND PUNISHMENT ‘ FROM ‘ THE PROPHET ‘ BY. KAHLIL GIBRAN)
తెలుగు అనువాదం: డా. సి. బి. చంద్ర మోహన్
——————-
నగరంలోని న్యాయ మూర్తులలో ఒకరు లేచి నిలబడి ఆల్ ముస్తఫాను ఇలా అడిగాడు. ” మాకు నేరము, శిక్ష గురించి వివరించండి.”
ఆయన ఇలా జవాబిచ్చాడు:
మీమనసు గాలిలో సంచరించే టప్పుడు–
ఏకాంతంగా, ఎవరూ మిమ్ములను గమనించనప్పుడు
మీరు– ఇతరుల ఎడల తప్పు చేస్తారు.
అందువలన మీరు, మీకు కూడా చెడు చేసుకుంటారు.
ఆ, చేసిన తప్పు వలన–
పరమాత్మ ద్వారం తట్టి, నిర్లక్ష్యానికి గురై,
కొంతసేపు వేచి ఉండవలసి వస్తుంది.
మీలోని అంతర్యామి– ఒక మహా సాగరం
అది ఎప్పుడూ కల్మష రహితమే!
తేలికైన గాలిలా- రెక్కలున్నవారిని పైకి లేపుతుంది.
మీ లోని దేవతాంశ — సూర్యుని లాంటిది కూడా
ఎలుకల బోరియలేవో
పాము కన్నాలేవో —
దానికి తెలియదు.
మీ పవిత్రత మాత్రమే మీలో ఒంటరిగా ఉందనుకోకండి!
మీలో మానవత్వమూ దాగి ఉంటుంది
మంచితనమూ లోపించి ఉంటుంది.
— నిరాకార మరుగుజ్జు
నిద్రావస్థలో, మంచులో నడుస్తూ
తన జాగరణ గురించి వెతుకుతున్నట్లుగా!
ఇప్పుడు మీలోని మనిషితనం గురించి మాట్లాడతాను
ఎందుకంటే —
మీలోని దైవాంశ కాదు,
మీలోని మంచులో నడిచే మరుగుజ్జూ కాదు
మీలోని మనిషికి మాత్రమే
నేరం గురించి, నేరానికి పడే శిక్ష గురించి
—- తెలుసును కాబట్టి!
చాలాసార్లు మీరు ఇలా అనుకోవడం నేను విన్నాను.
“తప్పు చేసిన మనిషి మనలో ఒకడు కాదు.
అతడు మనకు అపరిచితుడు.
మన లోకంలోకి వచ్చిన చొరబాటుదారుడు!”
నేను అంటానూ —
“మీ ప్రతి ఒక్కరిలో ఉన్న ఔన్నత్యం కంటే —
పవిత్ర, ధార్మిక వర్తన కలవారు
— అంతకుమించి ఎదగలేరు!
అలాగే, మీలో ప్రతి ఒక్కరిలో ఉన్న
బలహీనత, నైచ్యం కన్నా
— ఎవరూ, ఇంకా అధమ స్థాయికి జారి పోలేరు!
వృక్షం యొక్క నిశ్శబ్ద జ్ఞానానికి
తెలియకుండా,
ఒక్క ఆకైనా పండి పచ్చ బారదు
మీ అందరిలో దాగున్న నిశ్శబ్ద కాంక్షకు
ఎరుక లేకుండా
నేరస్తుడు తప్పు చేయలేడు!
ఆత్మ జ్ఞానం వైపు
కలసి కదలాడే మీ ఊరేగింపులో
మార్గమూ మీరే — బాటసారీ మీరే!
ఆ ప్రస్థానంలో మీలో ఎవరైనా పడిపోతే —
అది మీ వెనుక నున్న వారికి
అడ్డంకులున్నాయని హెచ్చరించడానికే!
ఇంకా — మీ ముందు వడివడిగా,
బలంగా అడుగులు వేస్తూ —
అడ్డంకులున్నాయని చెప్పకుండా ,
తొలగించకుండా వెళ్లి పోయిన వారిని
— గుర్తు చేయడానికే!
ఈ చెప్పబోయేది కూడా
మీ మనసులను నొప్పించవచ్చు:
హత్యకు గురైన వాడు
ఆ హత్యకు బాధ్యుడు కాకుండా పోడు.
దోచుకోబడ్డవారు కూడా
దోచుకోబడడానికి నిందార్హులే!
దుర్మార్గుల చేష్టలను కనిపెట్టలేని
అమాయకులు కాదు– ధార్మికులు!
అపరాధులు దౌష్ట్యాలు చేసినంతకాలం
మీ చేతులు శుభ్రంగా ఉంటాయనుకోవద్దు!
చాలాసార్లు,
అపరాధి దెబ్బతిన్న వానిచే
బాధింప బడిన వాడే!
ఇంకా చాలా సార్లు ,
అపరాధి నిర్దోషుల, నిరపరాధుల
భారం మోసే వాడే!
అన్యాయం నుండి న్యాయాన్ని,
మంచి నుండి దుర్మార్గాన్ని
వేరు చేయలేము !
సూర్యుని ముందు —
నలుపు తెలుపు దారాలు
కలగలిపి నేసిన వస్త్రంలా
పైన చెప్పిన రెండూ కలిసే ఉంటాయి!
నలుపు దారం తెగితే
నేతన్న వస్త్రాన్ని అంతా పరిశీలిస్తాడు
మగ్గాన్ని కూడా పరీక్షిస్తాడు!
మీలో ఎవరైనా నమ్మకద్రోహి అయిన భార్యను
తీర్పుకోసం తీసుకువస్తే
న్యాయమూర్తి ఆ భర్త యొక్క హృదయం బరువెంతో తూచాలి
అతని ఆత్మను కొలతలు వేయాలి!
అపరాధికి కొరడా దెబ్బలు కొట్టేవానిని,
బాధితుని మనస్సు కూడా తెలుసుకో మనండి!
మీలో ఎవరైనా గాని,
ధర్మం పేరుతో శిక్షించ దలిస్తే,
గొడ్డలిని చెడు వృక్షంపై పెట్ట దలిస్తే —
దాని వేర్లు ముందుగా పరిశీలించండి!
నిజానికి,
మంచి, చెడుల వేర్లు
ఫలించే , ఫలించని వాటి వేర్లు
అవని నిశ్శబ్ద హృదయంలో
అల్లుకుని ఉంటాయి!
అప్పుడు, న్యాయమూర్తులు ఏమని న్యాయం చెప్పగలరు?
పైకి నిజాయితీ పరుడిగా కనిపిస్తూ
మనసులో దొంగ అయితే
మీరు ఎలాటి తీర్పు ఇవ్వగలరు?
హంతకునిలా దొరికిపోయి —
నిజంగా, ఆత్మలో చంపబడ్డ వానికి
మీరు ఏ దండన విధిస్తారు?
ఒక మోసగాడూ మరియు అణచబడ్డ వాడూ
అతడే బాధితుడు, ఆగ్రహోదగ్రుడు కూడా అయితే
మీరు ఎలా వి చారణ జరుపుతారు?
చేసిన దుర్మార్గాల కన్నా
వారి పశ్చాత్తాపం ఎక్కువగా ఉంటే
— అటువంటివారిని మీరు ఎలా శిక్షిస్తారు?
పశ్చాత్తాపం కూడా చట్ట పరిధిలో
మీరు చెప్పే న్యాయంలోకే వస్తుంది గదా?
అయినా గాని,
అమాయకునిపై పశ్చాత్తాపం ఉంచలేరు
అపరాధి మనసులో నుండి దానిని తీయనూ లేరు!
ఈ పశ్చాత్తాపం పిలవకుండానే
రాత్రులు మిమ్ములను సందర్శిస్తుంది.
మిమ్ములను మేల్కొలిపి
అంతర్మధనం చేయిస్తుంది!
న్యాయాన్ని అర్థం చేసుకునే న్యాయమూర్తులారా!
అపరాధి చేసిన నేర కృత్యాలు
నిండు వెలుగులో పరిశీలించకుండానే
తీర్పు నెలా ఇవ్వగలరు?
రాత్రి మరుగుజ్జు రూపము,
పగలు పరమాత్మ రూపంతో
సంజ వెలుగులో
మీకు ఉన్నతునిగా, పాపాత్ముని గా కనబడే మనిషి
— ఒక్కరేననే విషయం మీకు అవగతమవుతుంది
ఆలయానికి మూలస్తంభం
పునాది లో ఉన్న చిన్న రాయి కంటే
ఉన్నతమైనది కాదనే విషయం
మీకు తెలుస్తుంది!
Also read: చెెవిటి భార్య
Also read: ఒక దేవుడు మరియు చాలా మంది దేవుళ్ళు
Also read: ఆవాసాలు
Also read: దానిమ్మ పళ్ళు
Also read: శాపం