- దిల్లీ ఆస్పత్రిలో క్షేమంగా కోలుకుంటున్న క్రికెట్ దిగ్గజం
- 1983లో ప్రపంచ కప్ గెలిచి ఇండియాకు కీర్తి తెచ్చిన స్టార్
- అత్యుత్తమ ఆల్ రౌండర్ గా ప్రశంసలు
- రెండు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్
క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ కి అత్యవసరంగా కొరోనరీ యాంజియోప్లాస్టీ జరిగింది. ఛాతిలో నొప్పి ఉన్నదని చెప్పడంతో ఆస్పత్రికి తరలించగా వెంటనే యాంజియోప్లాస్టీ నిర్వహించారు. గురువారం -శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గంటకు కపిల్ దేవ్ అత్యవసర స్థితిలో ఫోర్టిస్ ఎస్కార్ట్స్ హాస్పిటల్ కు వచ్చారనీ, ఛాతిలో నొప్పిగా ఉన్నట్టు చెప్పారనీ, డాక్టర్ అతుల్ మాథుర్ ఎమర్జెన్సీ కొరోనరీ యాంజియోప్లాస్టీ చేశారనీ ఆస్పత్రి ఒక ప్రకటనలో తెలిపింది.
కపిల్ దేవ్ ఇన్టెన్సివ్ కేర్ యూనిట్ లో క్షేమంగా ఉన్నారనీ, ఒకటి, రెండు రోజుల్లో ఆయనను ఇంటికి పంపుతామనీ ఆస్పత్రి వర్గాలు చెప్పారు. 1983లో లండన్ లో ప్రపంచ క్రికెట్ కప్ గెలుచుకున్న భారత జట్టుకు నాయకుడిగా వ్యవహరించిన కపిల్ దేవ్ క్రికెట్ చరిత్రలో తన పేరు చిరస్థాయిగా నిలిచేవిధంగా రాణించారు. ఆ సీరీస్ లోనే జింబాబ్వేపైన జరిగిన మ్యాచ్ లో 175 పరుగులు చేసి అజేయంగా నిలిచి క్రికెట్ రారాజుగా పేరు గడించారు. వన్ డే మ్యాచ్ లలో ఈ ఇన్నింగ్స్ అత్యుత్తమమైనదని క్రికెట్ పండితులు ఇప్పటికీ శ్లాఘిస్తూ ఉంటారు. ఆ తర్వాత 28 ఏళ్ళకు కానీ ఎంఎస్ ధోనీ నాయకత్వంలో 2011లో ఇండియా 50 ఓవర్ల క్రికెట్ సిరీస్ లో ప్రపంచ కప్పు ను గెలుచుకున్నది. భారత క్రికెటర్లలో అత్యుత్తమ ఆల్ రౌండర్ గా కపిల్ దేవ్ ను దేశవాసులు పరిగణిస్తారు. అయిదురోజుల మ్యాచ్ లలో మొత్తం 434 వికెట్లు తీసుకున్నారు. 5248 పరుగులు (సగటున 31.05) చేశారు. కపిల్ 225 వన్ డే ఇంటర్నేషనల్స్ ఆడారు. 253 వికెట్లు పడగొట్టారు. 3783 పరుగులు చేశారు.
ప్రస్తుత భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాడ్మింటన్ చాంపియన్ సైనా నెహ్వాల్, మాజీ భారత జట్టు ఓపెనర్ గౌతమ్ గంభీర్ లో ట్విట్టర్ లో కపిల్ దేవ్ శీఘ్రంగా కోలుకోవాలంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. కపిల్ ఆరోగ్యం కోసం ప్రార్థించవలసిందిగా తన అభిమానులను క్రికెటర్ గా, కామెంటేటర్ గా రాణిస్తున్న ఆకాశ్ చోప్డా కోరారు.
లండన్ లో (1983 లో) బలమైన వెస్టిండీస్ జట్టును ఫైనల్ చిత్తు చేసి ప్రపంచ చరిత్ర సృష్టించిన కపిల్ దేవ్ కు ఇండియాలోని అన్ని రాష్ట్రాలలోనూ అభిమానులున్నారు. ఇటీవలే ఆయన హైదరాబాద్ సందర్శించారు. నిరుడూ, అంతకు ముందు కూడా కపిల్ విజయవాడ, గుంటూరు సందర్శించారు.