- బయో సెక్యూర్ స్టేడియాలలో క్రికెట్
- క్రిమిరహిత వాతావరణంలోనే ఐపీఎల్-14
అవసరం మనిషికి సరికొత్త ఆలోచనలను,వినూత్న ఆవిష్కరణలను చేసేలా చేయిస్తుందని మరోసారి రుజువయ్యింది. కరోనా వైరస్ దెబ్బతో కకావికలైన అంతర్జాతీయ క్రికెట్ కేవలం నాలుగుమాసాల వ్యవధిలోనే పడిలేచిన కెరటంలా దూసుకొచ్చింది. దీనికి కారణం క్రిమిరహిత వాతావారణం లేదా బయోబబుల్ తో సురక్షిత వాతావరణం సృష్టించడమే.
ఇంగ్లండ్ లో పుట్టిన బయోబబుల్…
మూడుశతాబ్దాల క్రికెట్ చరిత్రలో మరో సరికొత్త ప్రయోగం క్రికెట్ పుట్టినిల్లు ఇంగ్లండ్ అండ్ వేల్స్ గడ్డపైనే ఆవిష్కృతమయ్యింది. కరోనా వైరస్ దెబ్బతో గత ఏడాది నాలుగుమాసాల పాటు స్తంభించిపోయిన అంతర్జాతీయ క్రికెట్ ను తిరిగి కొనసాగించడానికి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వినూత్న రీతిలో ఏర్పాట్లు చేసింది.2020 జులై 8 నుంచి వెస్టిండీస్ తో మూడుమ్యాచ్ ల ఐసీసీ టెస్ట్ లీగ్ సిరీస్ ను బయో సెక్యూర్ వాతావరణంలో ప్రేక్షకులు లేకుండానే ఖాళీ స్టేడియాలలోనే విజయవంతంగా నిర్వహించి టెస్టు హోదా పొందిన మిగిలిన దేశాలకు మార్గదర్శిగా నిలిచింది.
మాంచెస్టర్ వేదికగా తొలి బయోబబుల్…
Also Read: భారత క్రికెటర్లకు బయోబబుల్ గుబులు
ఇంగ్లండ్- వెస్టిండీస్ జట్ల మూడుమ్యాచ్ ల సిరీస్ లోని తొలిటెస్టును జులై 8 నుంచి 12 వరకూ మాంచెస్టర్ లోని ఏజియోస్ బౌల్ స్టేడియంలోను, రెండోటెస్టును జులై 16 నుంచి 20 వరకూ, మూడోటెస్టును జులై 24 నుంచి 28 వరకూ ఓల్డ్ ట్రాఫోర్డ్ లోని ఎమిరేట్స్ స్టేడియంలోనూ విజయవంతంగా నిర్వహించారు.
కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో వైరస్ రహిత వాతావరణంతో కూడిన స్టేడియాలలో మాత్రమే మ్యాచ్ లు నిర్వహించాలని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. ప్రేక్షకులను అనుమతించకుండా ఖాళీ స్టేడియంలోనే మ్యాచ్ లు జరిగేలా జాగ్రత్తలు తీసుకొంది.
బయోబబుల్…ఎలా?
రెండుజట్ల ఆటగాళ్లు , సిబ్బంది, మ్యాచ్ నిర్వాహకులు విడిది చేసే హోటళ్లను స్టేడియాలకు కాలినడకన వెళ్లేంత దూరంలో ఉండేలా చర్యలు తీసుకొన్నారు. క్రికెటర్లు, సహాయక సిబ్బంది టీమ్ బస్సుల్లో ప్రయాణం చేయకుండా తమ విడిది నుంచి స్టేడియానికి నడచివచ్చేలా ఏర్పాట్లు చేశారు. అంతేకాదు సిరీస్ ప్రారంభానికి రెండువారాల ముందే ఇరుజట్ల ఆటగాళ్లు వేదికలకు చేరుకోడం, తొలిదశగా క్వారెంటెన్ లో ఉండటం, ఆ తర్వాత ప్రతిమూడురోజులకోసారి కరోనా పరీక్షలు నిర్వహిస్తూ అందరూ నెగిటివ్ గానే ఉండేలా చూడటం బయోబబుల్ లో కీలకం.ఒక్కమాటలో చెప్పాలంటే కరోనా వైరస్ మనుగడకు, వ్యాప్తికి ఎలాంటి అవకాశమూ లేని క్రిమిరహిత వాతావరణాన్ని సృష్టించడమే బయోబబుల్. క్రిమిరహిత వాతావరణం లోనే క్రికెటర్లు నిర్భయంగా మ్యాచ్ లు ఆడగలరని ఐసీసీ అంచనావేసింది.
Also Read: విజయం మాది…అవార్డులు వారికా?
లాలాజలానికి రాం రాం…
క్రికెట్ మ్యాచ్ ఏదైనా బంతి సరికొత్తగా, స్వింగ్ కు అనుకూలించేలా ఉండటానికి ఉమ్మిని రాస్తూ ఉండటం, తుడవటం, నునుపు తేలేలా రుద్దటం, మెరుగులు దిద్దటం ఓ సాంప్రదాయంగా వస్తోంది.అయితే కరోనా వైరస్ దెబ్బతో దశాబ్దాలుగా వస్తున్న ఆ సాంప్రదాయానికి స్వస్తిపలకాలని ఐసీసీ నిర్ణయించింది. బంతికి లాలాజలాన్ని రుద్దితే దానిద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉండటంతో ముందు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకొన్నారు.
సబ్ స్టిట్యూట్లకు అవకాశం..
క్రికెట్ మ్యాచ్ లు సజావుగా సాగటానికి వీలుగా ఐసీసీ పలు సరికొత్త మార్పులు తీసుకువచ్చింది. బంతిని పాలిష్ చేయటానికి ఉమ్మిని ఉపయోగించడాన్ని నిషేధించడంతో పాటు మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఆటగాళ్లలో కోవిడ్ పాజ్ టివ్ లక్షణాలు కనిపించినా, అనుమానం వచ్చినా వారిని ఆట నుంచి తప్పించి వారి స్థానాలలో సబ్ స్టిట్యూట్ ప్లేయర్లను అనుమతించడానికి వెసలుబాటు కల్పించారు.
కరీబియన్ జట్టు ఇంగ్లండ్ లో జరిపే 7వారాల పర్యటన, ఆ తర్వాత వివిధ దేశాలలో జరిగిన సిరీస్ ల సమయంలో బయో సెక్యూర్ నిబంధనావళిని తుచ తప్పక పాటించేలా నిబంధనలు రూపొందించారు.వెస్టిండీస్ క్రికెటర్లతో పాటు సహాయక సిబ్బంది సైతం ఒకే ప్రాంతంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకొన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఆటగాళ్ల కదలికలను కేవలం నిర్దేశిత ప్రాంతానికి మాత్రమే పరిమితం చేయటం ద్వారా క్రిమిరహిత వాతావరణాన్ని సృష్టించగలిగారు.కరోనా వైరస్ మహమ్మారి గత రెండేళ్ళుగా పెరిగిపోతూ ఓవైపు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తుంటే నాలుగుమాసాలపాటు స్తంభించిపోయిన అంతర్జాతీయ క్రికెట్ ను తిరిగి ప్రారంభించడంలో ఇంగ్లండ్ బయోబబుల్ నిర్ణయం గొప్ప సాహసం మాత్రమే కాదు విజయవంతమైనది కూడా క్రికెట్ చరిత్రలో నిలిచిపోనుంది.
Also Read: మ్యాచ్ విన్నర్ల జట్టు భారత్
భారత జట్టు ఆస్ట్ర్రేలియా పర్యటన సమయంలోనూ, ఇంగ్లండ్ జట్టు భారత పర్యటన సమయంలోనూ అడిలైడ్, సిడ్నీ, మెల్బోర్న్, బ్రిస్బేన్, చెన్నై, అహ్మదాబాద్, పూణే నగర స్టేడియాలలో బయోబబుల్ వాతావరణం సృష్టించగలిగారు. సిరీస్ లను విజయవంతం చేయగలిగారు.
ఖాళీ స్టేడియాలలోనే….
క్రికెట్ అంటేనే స్టేడియాలలో కిటకిటలాడే జనం. చప్పట్లు, కేరింతలతో పండుగవాతావరణం. అయితే జనంలేని స్టేడియంలో నిర్మానుష్యవాతావరణంలో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లు అదీ ఐదురోజుల సాంప్రదాయ టెస్ట్, వన్డే,టీ-20 మ్యాచ్ లు నిర్వహించడం క్రికెట్ వింతలకే వింతగా నిలిచిపోక తప్పదు.బయోబబుల్ క్రికెటర్ల స్వేచ్ఛకు ఆటంకమే అయినా కరోనా వైరస్ కంటే ఏమాత్రం ప్రమాదకరం కాదనటంలో ఏమాత్రం సందేహం లేదు. బయోబబుల్ అంటే కరోనా ట్రబుల్ లేనట్లే మరి.
Also Read: క్రికెట్ దేవుడికి కరోనా పాజిటివ్