Photo writeup: టైమ్ మషీన్ రచయిత వెల్స్
భగవద్గీత – 36
H.G.Wells ఒక ప్రముఖరచయిత. ఆయన తన Time machine అనే పుస్తకం మొదట్లోనే ఒక విషయం చాలా చక్కగా చెపుతారు. అదేమిటంటే పదార్ధానికి నాలుగు మితులు (dimensions) ఉన్నవని. నాలుగు మితులేమిటి మూడే కదా? పొడవు, వెడల్పు, ఎత్తు లేక మందము ఇంతే కదా?
ఇక నాలుగోదేమిటి?
ఒక ప్రశ్న. కొన్నితరాలనుండి మనం ఒకే ఊళ్ళో ఉంటున్నాం అనుకోండి. మనం ఉంటున్న ఇల్లు ఎన్నేళ్ళది అంటె ఎంతకాలమయ్యింది కట్టి అని అడిగితే, 10, 20, 30..100…సంవత్సరాలయ్యింది అని సమాధానం వస్తుంది!
అదేమిటి?
మన తాత, ముత్తాతలు, వారి తాతముత్తాతలు, వారి తాతలు అందరిదీ ఇదే ఊరు కదా? వారు ఎక్కడున్నారు? అని అడిగితే పాతిల్లు ఎంతకాలం ఉంటుందేమిటి? అది పడిపోతే కొత్తది కట్టుకున్నాం అని సమాధానం వస్తుంది.
మనం పాతది అనుకునేది మనతాతముత్తాతలు కట్టినప్పుడు కొత్తదే కదా! అంటే మనం ఇప్పుడు కట్టిన కొత్తిల్లుకూడా కొంత కాలానికి ఉండదనేకదా! అంటే ప్రతి వస్తువుకు అది మన్నే(మన్నిక) ’’కాలం’’ ఒకటుందనేకదా అర్ధం…
పొడవు, వెడల్పు, ఎత్తు కాకుండా కాలం కూడా ఒక ’’మితి’’అని చెపుతాడు H.GWells.
Time is the fourth dimension. అంటే సృష్టిలోని పదార్ధం అంతా పుట్టటం, చావటం అనివార్యం కదా. అంతా నశించి ఎక్కడ లీనమవుతున్నయి?
ఆయనలో!
మరల ఎలా పుడుతున్నవి? ఆయన సంకల్పం చేత!
ఈ సంకల్పం ఏమిటి?
ఉదాహరణకు మన ఇల్లును చూడండి. అది కట్టటానికి ముందు ఎక్కడ ఉంది?
మన ఊహల్లో, ఆలోచనలలో అంటే మన సంకల్పంలో. మన ఇల్లు ఫలానా విధంగా ఉండాలని మన భావనలో మాత్రమే ఉంది. ఆ భావనకు లేదా ఆ సంకల్పానికి రూపం వస్తే మనిల్లు అయ్యింది.
అదే విధంగా ఈ సృష్టి ఇలా ఉండటానికి పూర్వం ‘‘ఆయన’’ సంకల్పంలో ఉన్నది. ఆ సంకల్పం నుండే ఈ సృష్టి జరిగింది. అందుకే ఈ జగత్తంతా భావనే. ఆయన సంకల్పమే.
ఓ కౌంతేయా! ఓ అర్జునా!
కల్పాంతమందు భూతములన్నియు నా ప్రకృతినే చేరును!
మరల కల్పాదియందు నేనే మరల వాటిని సృజించుచున్నాను.
॥సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికామ్
కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహమ్॥