Saturday, December 21, 2024

సైన్స్ పట్ల అవగాహన పెంచడమే అసలు లక్ష్యం

డా నాగసూరి వేణుగోపాల్

లిటరసీ అంటేనే మాకు తెలియదు. ఇక సైన్స్ లిటరసీ ఏమిటి అంటారా… అనే ప్రశ్నలు ఎదురయ్యే కాలమిది! కనీసం జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవం సందర్భంగానైనా కొన్ని అవసరమయిన విషయాలు మాట్లాడుకుందాం.

క్రీస్తుపూర్వం సుమారు 24 లక్షల సంవత్సరాల క్రితం ఆదిమ మానవుడు సంకేతాలుగా రాళ్ళు వాడటం మొదలైంది. అలాగే వేటాడటానికి బాణాలు వంటివి వాడింది క్రీస్తుపూర్వం 25 వేల సంవత్సరాల క్రితం. రాళ్ళు వాడే దశనుంచి బాణాలు వాడే పరిస్థితి రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో మీరే లెక్కించుకోండి!

ఆకులుగల చక్రం మెసపొటేమియాలో క్రీస్తు పూర్వం 2000వ సంవత్సరంలో తయారైందని అంటారు. ఇప్పుడు మనం అత్యంత విరివిగా వాడే చక్రం మొదలై కేవలం నాలుగువేల సంవత్సరాలు మాత్రమే అయ్యింది – అని తెలుసుకుంటే ఈ కాలగతిలో మానవుడు ఎంత అల్ప ప్రాణో మనకు బోధపడుతుంది. మరీ ముఖ్యంగా క్రీస్తు పూర్వం 200 సంవత్సరాల నుంచి 14వ శతాబ్దం దాకా విజ్ఞాన శాస్త్ర ప్రగతి ఎంతో వేగంగా లేదు. కేవలం ఆరేడు వందల సంవత్సరాలలో అనూహ్యమైన రీతిలో విజ్ఞాన వృద్ధి సంభవించింది. తత్ఫలితంగా మానవుడి అవసరాలు, కోరికలు, సౌఖ్యాలు తీరడం మొదలైంది. పాలు పెరుగు కావడం; అన్నం వండుకోవడం; బట్టలు నెయ్యడం; రంగులు వేయడం; ఇల్లు కట్టడం; రవాణా సాధనాలు రూపొందించుకోవడం; పని తేలికగా, వేగంగా, నైపుణ్యంగా జరగడానికి పనిముట్లు తయారు చేసుకోవడం; దూరాన్ని వాహనాలతో అధికమించగలగడం నుంచి అంతరిక్షంలోకి వెళ్ళి రావడం, అణు కుహరంలోకి తొంగి చూడగలగడం ఇలా ఇవన్నీ కూడా విజ్ఞాన శాస్త్రాంశాలే. ఇలా విజ్ఞానశాస్త్ర ప్రాముఖ్యతను పలు రకాలుగా చెప్పుకోవచ్చు.

ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీని నేషనల్ సైన్స్ డే లేదా జాతీయ విజ్ఞానశాస్త్ర దినోత్సవంగా భారతదేశం జరుపుకుంటోంది. 1928 ఫిబ్రవరి 28వ తేదీన సి.వి.రామన్ ఆవిష్కరించిన రామన్ ఫలితం (రామన్ ఎఫెక్ట్) గా పిలువబడుతోంది. 1930లో సి.వి.రామన్ కు భౌతిక శాస్త్రపు నోబెల్ బహుమతి లభించింది. అంత తక్కువ వ్యవధిలో నోబెల్ బహుమతి రావడం అపూర్వమైన విషయం. ఈ విశేష కీర్తి పొందే సమయానికి ఆయన వయసు కేవలం 42 సంవత్సరాలు మాత్రమే. రామన్ ఎఫెక్ట్ కారణంగా రామన్ స్పెక్ట్రా, రామన్ స్పెక్ట్రోస్కోపి అని ప్రత్యేక విభాగాలు భౌతిక శాస్త్రంలో ఏర్పడటం అనేది రామన్ ఫలితం ప్రాధాన్యతను వివరిస్తుంది. 1933లో బెంగుళూరులో ఏర్పడిన ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కు మొదటి డైరెక్టర్ సి.వి.రామన్. వీరే 1948లో రామన్ రిసర్చి ఇన్ స్టిట్యూట్ ను ప్రారంభించారు.

నోబెల్ బహుమతి పొందిన రెండవ భారతీయుడు, తొలి దక్షిణాత్యుడు చంద్రశేఖర్ వెంకట్రామన్ (సి.వి.రామన్). అంతకు ముందు 1913 లో రవీంద్రనాథ్ ఠాగోర్ కు సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది. 1888 నవంబర్ 7వ తేదీన తిరుచునాపల్లి దగ్గర తిరువన్ కావల్ గ్రామంలో అమ్మమ్మగారింట సి.వి.రామన్ జన్మించారు. పార్వతి అమ్మాళ్, చంద్రశేఖర్ అయ్యర్ గార్లు సి.వి.రామన్ తల్లిదండ్రులు.  పార్వతి అమ్మాళ్ తండ్రి సప్తర్షి శాస్త్రి గొప్ప సంస్కృత పండితులు. ఆయన రెండువేల కిలోమీటర్లు కాలి నడకన బెంగాల్ ప్రాంతానికి పోయి నవ్య న్యాయం చదువుకోవడం అప్పటికీ, ఇప్పటికీ విశేషమే. సి.వి.రామన్ అన్న సి.ఎస్.అయ్యర్ కుమారుడు సుబ్రహ్మణ్యం చంద్ర శేఖర్ 1983లో నోబెల్ బహుమతి పొందాడు. సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ కు సి.వి.రామన్ వరుసకు చిన్నాన్నే అయినా వయసులో ఎంతో పెద్దవారు కాదు. సి.వి.రామన్ 1928లో రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరిస్తే సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ 1933లో చంద్రశేఖర్ లిమిట్ ను నక్షత్రాల జీవిత కాలాన్ని వివరించడానికి ప్రతిపాదించారు. అయితే ఇక్కడ అబ్బురం కలిగించే విషయం ఏమిటంటే సి.వి.రామన్ కు రెండేళ్ళ (1930)లో నోబెల్ బహుమతి రాగా సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ కు 50 ఏళ్ళ తర్వాత (1983) రావడం!

సి.వి.రామన్ తండ్రి చంద్రశేఖర్ అయ్యర్ విశాఖపట్టణంలో చాలా కాలం ఉపాధ్యాయుడుగా వుండి చివరకు మిసెస్ ఏ.వి.ఎన్. కళాశాలలో గణిత భౌతిక శాస్త్రాల ఉపన్యాసకులయ్యారు. అంటే సి.వి.రామన్ బాల్యం మన తెలుగునాటనే గడిచింది.  సి.వి.రామన్ కు యూక్లిడ్ గణితమే కాదు ఎడ్విన్ ఎర్నాల్డ్ రచించిన ది లైట్ ఆఫ్ ఏసియా  గ్రంథం అంటే కూడా ఎంతో అభిమానం. 1907లో మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో ఎం.ఏ. సర్వ ప్రధములుగా పూర్తిచేసి తండ్రి కోరిక మేర ఫైనాన్షియల్ సివిల్ సర్వీస్ (ఎఫ్.సి.ఎస్) పరీక్ష రాసి అందులో కూడా సర్వప్రధముడయ్యాడు. 1907లోనే కేవలం పద్దెనిమిదిన్నర సంవత్సరాల వయస్సులో కలకత్తా వెళ్ళి అకౌంటెంట్ జనరల్ గా చేరారు. అప్పట్లో ఆయనకు జీతం 400 రూపాయలు. అది చాలా చాలా పెద్ద మొత్తం.  జీతం బాగున్నా, ఉద్యోగం బాగున్నా సి.వి.రామన్ మనసు సైన్స్ లో ఉండిపోయింది. 

ఇటువంటి నేపథ్యంలో ఆఫీసుకు వెడుతూ బౌ బజార్ లో ది ఇండియన్ అసోసియేషన్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ సైన్స్ అనే బోర్డును చూశారు. అదే రోజు సాయంకాలం ఇంటికి తిరిగి వెడుతూ అక్కడే దిగి ఆ సంస్థలో అమృతలాల్ సర్కార్ ను కలిశారు. ఆ సంస్థ వ్యవస్థాపకులయిన మహేంద్రలాల్ సర్కార్ కుమారుడే ఈ అమృతలాల్ సర్కార్. ఈ సంస్థలోనే రామన్ ప్రతిరోజూ సాయంకాలం పరిశోధన ప్రారంభించాడు. అలా చేసిన పరిశోధనకే 1930 లో నోబెల్ బహుమతి వచ్చింది.  సి.వి.రామన్ వద్ద సత్యేంద్రనాథ్ బోస్, మేఘనాథ్ సాహ వంటి శాస్త్రవేత్తలు చదువుకోవడం విశేషం. ఆయన ఎంత పెద్ద శాస్త్రవేత్త అయినా సైన్స్ ప్రాచుర్యం పట్ల చాలా ఆసక్తి వుండేది. హాస్యం తొణికిసలాడుతూ సైన్స్ ప్రసంగం చేయడంలో సి.వి.రామన్ కు కొట్టిన పిండి. ఆకాశవాణిలో సి.వి.రామన్ చేసిన 19 ప్రసంగాలను న్యూయార్క్ కు చెందిన ఫిలసాఫికల్ లైబ్రరీ వారు ది న్యూ ఫిజిక్స్ టాక్స్ ఆన్ యాస్పెక్ట్స్ ఆఫ్ సైన్సెస్ అనే పేరుతో పుస్తకంగా ప్రచురించారు.  సి.వి. రామన్ కు సైన్స్ పరిష్కారాల పట్ల చాలా గురి. దేశ ఆర్ధిక సమస్యలకు సైన్స్ మార్గం చూపగలదని ప్రగాఢంగా నమ్మేవారు. మహాత్మాగాంధీ అంటే ఎంతో ఇష్టపడే రామన్ వీధిలో విగ్రహం కన్నా ప్రతి పాఠ్య పుస్తకంలో గాంధీజీ బొమ్మతోపాటు ఆయన ఆశయాల గురించి ప్రచురించాలనేవారు. సి.వి.రామన్ భార్య లోకసుందరి అమ్మాళ్ కు కూడా గాంధీజీ దంపతులు బాగా తెలుసు. మహాత్మా గాంధీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సందర్శించిన సందర్భం కూడా వుంది.  1970 నవంబర్ 21న కనుమూసిన సి.వి.రామన్ తన చివరి రెండు దశాబ్దాలలో గాంధీజీ గౌరవార్ధం ఆయన గురించి క్రమం తప్పకుండా స్మారక ప్రసంగాలు చెయ్యడం విశేషం. సి.వి.రామన్ కు భౌతిక శాస్త్రమే కాకుండా వాతావరణం, ఖగోళం, శరీర శాస్త్రం, సంగీతం వంటి అంశాలలో కూడా చాలా ఆసక్తి వుండేది. వాళ్ళ అమ్మగారికి సంగీత ప్రవేశం వుండగా సి.వి.రామన్ కు చిత్రకళలో కూడా ప్రవేశం వుండేది. ఆయన 475 పరిశోధనా పత్రాలు వెలువరించడం విశేషం.  వారు కనుమూసినపుడు పార్థివ దేహానికి బెంగుళూరు లోని రామన్ ఇన్ స్టిట్యూట్ లోనే అంత్యక్రియలు జరగాయి.

నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ (ఎన్.సి.ఎస్.టి.సి.) ఫిబ్రవరి 28వ తేదీని జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రకటించమని భారత ప్రభుత్వాన్ని 1986లో కోరింది. 1987 ఫిబ్రవరి 28న తొలి నేషనల్ సైన్స్ డే ను మన దేశం జరుపుకుంది. సైన్స్ ప్రాచుర్యానికి మరిన్ని అవకాశాలు కల్పిస్తూ…. సైన్స్ అభినివేశాన్ని పెంపొందించే కార్యక్రమాలు మరిన్ని జరిగే కార్యక్రమాలు రూపొందడం ప్రారంభమైంది. నిత్యజీవితంలో విజ్ఞాన శాస్త్ర ప్రాధాన్యత వివరించే విషయాలూ మానవ సంక్షేమానికి విజ్ఞానశాస్త్రం ద్వారా సాధ్యమైన ప్రయోగాలూ, ప్రయత్నాలూ, ఫలితాలూ వివరించడంతోపాటు విజ్ఞానశాస్త్ర రంగంలో ఎప్పటికప్పుడు తారసపడే విషయాలను పరిచయం చెయ్యడానికి ఈ సందర్భం బాగా ఉపకరిస్తుంది. ఫలితంగా 1988 సి.వి.రామన్ శతజయంతి సంవత్సరం ఎంతో అర్ధవంతమైన కార్యక్రమాలతో శోభించింది.

సైన్స్ అంటే ఏ ఒక్క విభాగం మాత్రమే కాదు. మౌలిక శాస్త్రాలూ, అప్లైడ్ విభాగాలు, టెక్నాలజీ, ఆరోగ్యం, వైద్యం, వ్యవసాయం, పశువిజ్ఞానం, ఇలా పలు రంగాలలో సైన్స్ విస్తరించి వుంటుంది. అంతేకాదు వాతావరణం, తుఫానులు పసిగట్టడం, ప్రకృతి విపత్తులను ముందుగానే గణించడం, ప్రమాదాలు సంభవిస్తే  ప్రాణనష్టాన్ని ఆస్తి నష్టాన్ని తగ్గించడం కూడా సైన్స్ గానే పరిగణించాలి. అందువల్ల సైన్స్ అంటే మూఢనమ్మకాల గురించి మాట్లాడుకోవడమో సెల్ ఫోన్ కల్పించే సమస్యను చర్చించుకోవడం మాత్రమే కాదు. సైన్స్ పలురకాలుగా ప్రాచుర్యంలోకి రావాలి. అవి ఏమిటో చూద్దాం –

1. వివిధ సైన్స్ రంగాల సమాచారం అందరికీ అందుబాటులోకి రావాలి.

2. ఆయా రంగాలలో సాధ్యపడే ఉపయోగాలు ఏమిటో బోధపడాలి.

3. ఇందులో ఎదురయ్యే సమస్యలు, కనబడే పరిమితులు, వూహించని ప్రమాదాలు తెలియాలి.

4. కాలుష్యం, కాలుష్యం నుంచి రక్షణ అవగాహన పెరగాలి.

5. అన్ని రకాల జాగ్రత్తలు తెలుసుకోవడం

6. వివిధ శాఖలకు సంబంధించిన సిద్ధాంత విభాగాలు వృద్ధికావడం, ప్రచారంలోకి రావడం

7. విజ్ఞానశాస్త్ర ప్రగతిలో తారసపడే చారిత్రక కోణాలు

8. సమాజం పై సైన్స్ టెక్నాలజీ రంగాల ప్రభావం

9. అపోహలు, మూఢనమ్మకాలు, డిజిటల్ డినైడ్10.  సైన్స్ దృక్పథం, సైన్స్ దృక్పథ సాధన11.  పరిష్కార మార్గాలు

12.  విజ్ఞాన పరివ్యాప్తి పోకడలు

ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక ఇతివృత్తం (థీమ్) తో జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీ.  ఫ్యూచర్ ఆఫ్ ఎస్ టి ఐ : ఇమ్పాక్ట్స్ ఆన్ ఎడ్యుకేషన్, స్కిల్స్ అండ్ వర్క్ అనేది ఈ సంవత్సరపు జాతీయ సైన్స్ దినోత్సవం ఇతివృత్తం.  ఏఏ ఇతివృత్తాలతో జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవ కార్యక్రమాలు రూపుదిద్దుకున్నాయో తెలుసుకుంటే విజ్ఞాన శాస్త్ర ప్రాముఖ్యత, విస్తృతి, పరిమితి, ప్రాధన్యాతాంశాలు బోధపడతాయి.

1999 – మారుతున్న మన భూగోళం

2000 – మౌలిక విజ్ఞాన శాస్త్ర అంశాల పట్ల ఆసక్తిని పెంపొందించడం

2001 – సైన్స్ విద్యకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజి

2002 – చెత్త నుంచి విత్తం (వేస్ట్ నుంచి వెల్త్)

2003 – 50 ఏళ్ళ డి ఎన్ ఎ, పాతికేళ్ళ ఐవిఎఫ్ – జీవపదార్ధానికి బ్లూ ప్రింట్

2004 – జన సామాన్యంలో సైన్స్ అవగాహనను పెంపొందించడం

2005 – భౌతిక శాస్త్రాన్ని ఉత్సవంగా జరుపుకోవడం

2006 – మన భవిష్యత్తు కోసం ప్రకృతిని కాపాడుకుందాం

2007 – తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి

2008 – భూగోళాన్ని అర్ధం చేసుకుందాం

2009 – విజ్ఞాన శాస్త్ర పరిధిని పెంచడం

2010 – స్త్రీ పురుష సమానత, సుస్థిర అభివృద్ధికి సైన్స్ టెక్నాలజి

2011 – నిత్యజీవితంలో రసాయన శాస్త్రం

2012 – శుభ్రమైన శక్తి వనరులు, అణు విజ్ఞానపరమైన భద్రత

2013 – జెనిటికల్లీ మోడిఫైడ్ పంటలు, ఆహార భద్రత

2014 – శాస్త్రీయ దృక్పధాన్ని పెంపొందించడం

2015 – దేశ నిర్మాణానికి విజ్ఞాన శాస్త్రం

2016 – దేశాభివృద్ధికి తగిన విజ్ఞాన శాస్త్ర అంశాలు

2017 – స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్స్ కోసం సైన్స్ అండ్ టెక్నాలజి

2018 – సుస్థిర భవిష్యత్తుకు సైన్స్ టెక్నాలజి

2019 – సమాజం కోసం సైన్స్, సైన్స్ కోసం సమాజం

2020 – విజ్ఞాన శాస్త్ర రంగంలో మహిళలు

సి.వి.రామన్ మనకు నోబెల్ బహుమతి సంపాదించిన తొలి శాస్త్రవేత్త. ఇటీవలి కాలంలో విజ్ఞానశాస్త్ర రంగంలో భారతీయ సంతతి వారికి నోబెల్ బహుమతులు వచ్చినా వారందరూ ఇతర దేశాల పౌరులుగా ఉండిపోవడం ఆలోచించాల్సిన విషయం. స్వాతంత్ర్యానంతరం ప్రయోగశాలలు పెరిగాయి. పరిశోధనాంశాలు విస్తృతమయ్యాయి. ఒకవైపు అణుశక్తి, ఇంకోవైపు అంతరిక్ష విజ్ఞానం రంగాలలో భారతదేశ ప్రతిభ అమోఘంగా వున్నా, ఒక్క భారతదేశంలోనే కాకుండా అన్ని ఖండాలలో మన శాస్త్రవేత్తలు విశేషంగా వున్నా నోబెల్ బహుమతులు ఆ స్థాయిలో రాకపోవడం విచారించదగ్గ విషయం. ఇలా పలు విషయాలను జాతీయ విజ్ఞానశాస్త్ర దినోత్సవ నేపథ్యంలో మనం చర్చించుకోవలసి వుంది. అలా చర్చించుకుని అవగాహన పెంపొందించుకుని ప్రణాళికలు మార్పు చేసుకుని మనలను మనం ఆ దిశలో మరింత క్రియోన్ముఖంగా సమాయత్తం కావడమే సైన్స్ లిటరసీ.  దాని కోసమే ప్రతి ఏటా జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవ కార్యక్రమాలు రూపు దిద్దుకుంటాయి.  మీ అందరికీ జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవ శుభాకాంక్షలు.

(నేడు, బుధవారం, నేషనల్ సైన్స్ డే – జాతీయ విజ్ఞాన దినోత్సవం)

డా. నాగసూరి వేణుగోపాల్

9440732392

Dr. Nagasuri Venugopal
Dr. Nagasuri Venugopal
A broadcaster by profession, media researcher by training, a staunch Gandhian in thought, and a science writer by passion, Dr. Nagasuri Venugopal writes prolifically on contemporary issues. He penned over 60 books and two thousand newspaper articles so far. He is a PhD in journalism.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles