మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తనపై చేస్తున్న అవినీతి ఆరోపణలను సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ తీవ్రంగా ఖండించారు. పార్టీ కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం అనుమతి లేకుండా పార్లమెంటు ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీచేయడం సాధ్యం కాదని నారాయణ అన్నారు. పువ్వాడ నాగేశ్వరరావుకి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే పదవులు రాకుండా అడ్డుకున్నానని నాపై విమర్శలు చేయడం తగదని హితవు పలికారు.
పార్టీలో ఉమ్మడి నిర్ణయాలకే ప్రాధాన్యం:
కేంద్ర పార్టీ, రాష్ట్ర పార్టీ నాయకత్వాలు సంప్రదింపుల ద్వారా ఉమ్మడి నిర్ణయాలు మాత్రమే పార్టీలో అమలవుతాయని నారాయణ తెలిపారు. పార్టీలో సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత లేదని తెలిపారు. తన రాజకీయ జీవితం గురించి మాట్లాడే అర్హత పువ్వాడ అజయ్ కు లేదన్నారు. మొదట నుంచి సిద్ధాంతాలకు కట్టుబడి ఒకే పార్టీలో కొనసాగుతున్నానని నారాయణ స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసం మూడు పార్టీలు మారిన వ్యక్తులు నాపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.