Sunday, December 22, 2024

నవ్వమంటారా? ఏడవమంటారా?

  • ఆవుపేడ పూసుకుంటున్నవారిపై అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలు
  • గోమయం, గోమూత్రం వల్ల చర్మవ్యాధులు వస్తాయని హెచ్చరిస్తున్న వైద్యులు

లక్నో: వంటినిండా ఆవుపేడ, మూత్రం రాసుకొని కోవిద్ నుంచి రక్షణ పొందుతున్నామనే భ్రమలో వీడియో దిగి అందరికీ పంపిన అమాయకులను లేదా మూర్ఖులకు చూసి నవ్వాలో, ఏడవాలో తెలియడం లేదని సమాజ్ వాదీపార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ ట్వీట్ లో వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్ ప్రచారం చేసిన వీడియోను తన ట్వీట్ కు జత చేసి తన వ్యాఖ్యానం రాశారు.

గుజరాత్ కు చెందిన శ్రీ స్వామినారాయణ్ గురుకుల్ విశ్వవిద్య ప్రతిష్ఠానం ప్రాంగణానికి వారానికి ఒక రోజు వెళ్ళి అక్కడ గోమూత్రాన్నీ, పేడనూ వంటినిండా రాసుకొని యోగాభ్యాసం చేసి వచ్చే యువకుల వీడియో అది. ఒక డజను మంది యువకులు చొక్కాలు లేకుండా నీరు కలిపిన పేడతో నిండిన బకెట్లను ముందు పెట్టుకొని వీడియోలో కనిపిస్తారు. ప్రతి వ్యక్తి బకెట్ లో చేయిపెట్టి పలచని పేడ తీసుకొని వంటిమీదా, తలమీదా, మొహం మీదా   రాసుకుంటాడు. ఆ తర్వాత అందరూ వలయాకారంలో నిలబడి ప్రార్థన చేస్తారు.

‘‘ఇక్కడికి వైద్యులు కూడా వస్తారు. ఇట్లా (పేడ, మూత్రం రాసుకోవడం) చేయడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని వారి విశ్వాసం,’’ అని ఆ తంతులో పాలుపంచుకున్న గౌతమ్ మణిలాల్ చెప్పాడు. నిరుడు ఈ పని చేయడం వల్ల కోవిడ్  -19 నుంచి కోలుకున్నానని మందుల తయారీ కంపెనీలో అసోసియేట్ మేనేజర్ గా పని చేస్తున్న బొరిసా అనే వ్యక్తి చెప్పుకున్నాడు.

కోవిడ్ – 19కి ప్రత్యామ్నాయ వైద్యం వద్దంటూ డాక్టర్లు అనేక మంది అనేక సందర్భాలలో హెచ్చరించారు. దీనివల్ల లేనిపోని రక్షణభావన కలుగుతుందనీ, ఆ విధంగా కోవిడ్ వల్ల నష్టం కలిగే ప్రమాదం ఉన్నదని డాక్టర్లు చెప్పారు.

ఆవు పేడ, మూత్రం వల్ల శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుతుందని శాస్త్రీయంగా ఎక్కడా నిరూపణ జరగలేదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ జేఏ జయలాల్ వ్యాఖ్యానించినట్టు రాయిటర్ వార్తాసంస్థ తెలియజేసింది. ఆవు పేడ వంటికి రాసుకోవడం వల్ల కొత్త చర్మవ్యాధి వచ్చే అవకాశం ఉన్నదని కూడా వైద్యులు అంటున్నారు.

ఈ విధంగా ఆవుపేడ, మూత్రం వినియోగం వల్ల రోగాలను నయం చేసుకోవచ్చునంటూ వాదించేవారూ, ఆ ప్రయత్నం చేసేవారూ భారత సమాజంలో చాలా సందర్భాలలో కనిపిస్తారు. ఇదే మొదటి సారి కాదు. ఇటీవల ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఎంఎల్ఏ సురేంద్ర సింగ్ స్వయంగా గోమూత్రం సేవిస్తూ ఆ విధంగా ప్రజలు కూడా చేసి ఆరోగ్యం కాపాడుకోవాలంటూ వీడియో దిగి ప్రచారం చేశాడు. అతనిపైనే లైంగికపరమైన అభ్యంతరకర వ్యాఖ్యాలు చేశాడనే ఆరోపణ సైతం ఏప్రిల్ లో వచ్చింది.

గోమూత్రం సేవనం వల్ల హాని ఏమీ లేదని బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ నిరుడు వ్యాఖ్యానిస్తూ, ‘‘నేను గోమూత్రం తరచుగా సేవిస్తానని చెప్పడానికి ఏ మాత్ర సంకోచించడం లేదు,’’ అని ప్రకటించారు. కోవిడ్ -19 నుంచి కాపాడుకోవడానికి గోమూత్రం తాగవలసిందిగా ప్రజలకు ఒక సభ నిర్వహించి హితబోధ చేసిన సందర్భంలో దిలీప్ ఘోష్ ఈ వ్యాఖ్య చేశారు. బీజేపీకే చెందిన పార్లమెంటు సభ్యురాలు (మొన్న అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయారు) లాకెట్ ఛటర్జీ ఆయనతో పూర్తిగా విభేదించారు. ‘‘అటువంటి అశాస్త్రీయమైన విశ్వాసాలను నమ్మకండి. వాటివల్ల కోవిడ్ తో పోరాడటం సాధ్యం కాదు,’’ అంటూ ఆమె స్పష్టం చేశారు.

గోమూత్ర పానాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఆమోదించలేదు. ‘‘మా కార్యాలయం ఇచ్చే సలహాను కానీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇచ్చే సందేశాలను కానీ పాటించండి. బాధ్యతాయుతంగా వ్యవహరించండి,’ అంటూ పార్టీ సహచరులను హెచ్చరించారు.

తరచుగా చేతులు కడుక్కోవడం, మాస్క్ ధరించడం, ఇతరులకు దూరంగా ఉండడం ద్వారానే కోవిడ్ పైన పోరాటం జయప్రదం అవుతుందని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. ఈ అంటువ్యాధికి చికిత్స లేదు. నిరోధించడమే ఉపాయం. టీకాలు వేయించుకోవచ్చు. దేశంలో ఇంతవరకూ అందుబాటులో ఉన్న టీకాలు రెండు రకాలు – కోవీషీల్డ్, కోవాగ్జిన్. రష్యా నుంచి స్పుత్నిక్ రావచ్చునని అంటున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు స్వయంగా గ్లోబల్ టెండర్లు వేయడం ద్వారా టీకా మందు దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. ఈ మార్గంలో టీకా మందుకోసం ప్రయత్నిస్తున్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా ఉన్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles