కోవిడ్ టీకా నిల్వ, నిర్వహణపై పక్కా ప్రణాళిక రూపొందించుకోవాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అందుకు సంబంధించి ఈ నెల 6న రాష్ట్ర స్థాయిలో కార్యనిర్వాహక కమిటీ సమావేశమై టీకా ప్రక్రియపై కార్యాచరణను రూపొందించుకోవాలని సూచించింది. ఈ టీకాల అమలుపై రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని కూడా తెలిపింది. కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సోమవారం వీడియో కాన్పరెన్స్ నిర్వహించారు.
తొలి విడతగా దేశంలో 30 కోట్ల మందికి కోవిడ్ టీకా వేయాలని నిర్ణయించినట్లు గౌబా తెలిపారు. వారిలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్య సిబ్బంది కోటి మంది ఉంటారని, పోలీసులు,పారిశుద్ద్య సిబ్బంది, ముందు వరుసలో నిలిచే ఇతర సిబ్బంది రెండు కోట్ల మంది, దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 50 ఏళ్లలోపు వారు మరో కోటి మంది ఉంటారని వివరించారు. మిగిలిన వారు 50 ఏళ్లు దాటిన వారుంటారని చెప్పారు.
టీకా సిబ్బందిని గుర్తించండి
కరోనా టీకాలు వేసేందుకు సిబ్బందిని గుర్తించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి వందన గర్నాని ఇప్పటికే అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాశారు.
4న అఖిల పక్ష సమావేశం
దేశంలో కోవిడ్ పరిస్థితలను చర్చించేందుకు ఈ నెల 4 వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం ఏర్పాటవుతుంది. పార్లమెంట్ ఉభయ సభల్లో ఆయా పార్టీల సభానాయకులతో పాటు కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, హర్షవర్దన్ సమావేశానికి హాజరవుతారని సమాచారం. ఏప్రిల్ 20 అఖిల పక్ష తొలిసమావేశం జరిగింది.