- చెన్నై క్వారెంటెన్ లో భారత్, ఇంగ్లండ్ జట్లు
- క్రికెటర్ల కుటుంబసభ్యులకూ అనుమతి
చెన్నై వేదికగా ఫిబ్రవరి 5 నుంచి జరిగే నాలుగుమ్యాచ్ ల సిరీస్ లోని మొదటి రెండు టెస్టుల్లో పాల్గొనటానికి భారత్, ఇంగ్లండ్ జట్ల సభ్యులు చేరుకొన్నారు. చెపాక్ స్టేడియం వేదికగా తొలిటెస్ట్ లో పాల్గొనటానికి ముందు రెండు జట్ల సభ్యులూ ఆరురోజుల క్వారెంటెన్ పాటిస్తున్నారు. జో రూట్ నాయకత్వంలో శ్రీలంక పర్యటన విజయవంతంగా ముగించుకొని చెన్నై చేరిన ఇంగ్లండ్ క్రికెటర్లతో పాటు భారత క్రికెటర్లకు సైతం లీలా పేలస్ హోటెల్ లో బస కల్పించారు. బయోబబుల్ వాతావరణం కల్పించడానికి వీలుగా మొత్తం హోటల్ ను బీసీసీఐ ముందుగానే బుక్ చేసి ఉంచింది.
ఫిబ్రవరి 2 వరకూ క్వారెంటెన్ :
భారత్, ఇంగ్లండ్ జట్ల ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి క్వారెంటెన్ అమలు చేస్తున్నారు. మొత్తం ఆరురోజుల క్వారెంటెన్ కాలంలో రోజు విడిచి రోజు మూడుసార్లు ఆటగాళ్లందరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. చెన్నై చేరిన వెంటనే నిర్వహించిన కోవిడ్ పరీక్షలో భారత బృందం మొత్తానికి నెగిటివ్ ఫలితమే వచ్చింది. మరో రెండుసార్లు ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తారు.
ఇది చదవండి: ఇంగ్లండ్ క్రికెటర్లకూ క్వారెంటెన్
కుటుంబసభ్యులకూ అనుమతి:
లీలా పేలస్ హోటెల్ లో బస చేసిన క్రికెటర్లు, సహాయక సిబ్బంది ఫిబ్రవరి 1 వరకూ తమ తమ హోటల్ గదులకే పరిమితం కావాల్సి ఉంది. భారత క్రికెటర్లు మాత్రం తమకు కేటాయించిన హోటల్ గదుల్లోనే బీసీసీఐ ట్రైనర్ల పర్యవేక్షణలో వ్యాయామం చేస్తూ ఫిట్ నెస్ ను కాపాడుకొంటున్నారు. కరోనా వైరస్ భయంతో గత ఏడాది వరకూ ఆటగాళ్లు తమ తమ కుటుంబసభ్యులతో కలసి ఉండటానికి, ప్రయాణించడానికి బీసీసీఐ అనుమతి ఇవ్వలేదు. అయితే ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్ నుంచి మాత్రం ఆ నిబంధనను సడలించారు. ఆటగాళ్లతో కలసి కుటుంబసభ్యులు ఉండటానికి అనుమతించారు.
దీంతో వైస్ కెప్టెన్ అజింక్యా రహానే, ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా, ఓపెనర్ రోహిత్ శర్మ, వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా తో వచ్చి వారి భార్య, పిల్లలు చేరారు. నాలుగు మ్యాచ్ ల సిరీస్ లోని తొలి టెస్ట్ ఫిబ్రవరి 5 నుంచి, రెండో టెస్టు 13 నుంచి చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా జరుగనున్నాయి. బోర్డు ఆదేశాల ప్రకారం స్టేడియం గేట్లు మూసి ఈ టెస్టులను నిర్వహించనున్నారు. ఐసీసీ టెస్ట్ తాజా ర్యాంకింగ్స్ ప్రకారం భారత్ నంబర్ వన్ గా, ఇంగ్లండ్ నాలుగో ర్యాంక్ జట్లుగా కొనసాగుతున్నాయి.
ఇది చదవండి: భారత్ కు ఇంగ్లండ్ పేస్ సవాల్