Wednesday, January 22, 2025

వీడని కోవిద్ మహమ్మారి

  • పాజిటీవ్ కేసులు పెరుగుతున్నట్టు సమాచారం
  • జాగ్రత్తలు తీసుకుంటూనే ముమ్మరంగా పోరాటం

కరోనా వ్యాప్తికి సంబంధించిన గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిన్న ఒక్కరోజే 11 శాతం కొత్త కేసులు నమోదయ్యాయి. మరణాలు కూడా సంభవిస్తున్నాయి. ఈ రెండేళ్ల వ్యవధిలో నాలుగు కోట్ల కేసులు నమోదయ్యాయని, 4,91,127 మంది ప్రాణాలు కోల్పోయారని బుధవారం నాడు కేంద్ర ఆరోగ్య శాఖ తాజా గణాంకాలను వెల్లడించింది. మొన్న మంగళవారం నాడు 17 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే, 2,85,914 కేసులు పాజిటివ్ గా ఉన్నట్లు తేలాయి. అంతకు ముందు రోజుతో పోలిస్తే  కేసుల్లో 11.7 శాతం వృద్ధి నమోదైందని అర్ధమవుతోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 16శాతానికి పెరిగింది. ఇటీవల కేసుల్లో ఆకస్మిక పెరుగుదల లేనప్పటికీ  మరణాలు ఎక్కువగానే నమోదు కావడం భయాన్ని తెప్పిస్తున్నాయి.

Also read: ఆంధ్రప్రదేశ్ లోనూ కొత్త జిల్లాలు వస్తున్నాయ్!

కోలుకుంటున్నవారి సంఖ్య సంతృప్తికరం

ఐతే, వ్యాప్తి కట్టడిలో ఉండడం వల్ల రీకవరీ సంఖ్య పెరుగుతూ ఉంది. ఈ వార్త ఊపిరినిస్తోంది. కొత్త కేసుల కంటే కోలుకుంటున్నవారి సంఖ్య ఎక్కువగా నమోదు కావడం సంతోషాన్ని ఇచ్చే అంశం. రికవరీ రేటు ప్రస్తుతానికి 93.23కు చేరుకోవడం మంచిదే. క్రియాశీల రేటు 5.55 శాతం ఉంది. ఇది తగ్గాల్సి ఉంది. దేశంలో  ఇంకా 22 లక్షలకు పైగా కేసులు క్రియాశీలంగా ఉన్నాయి. ఇది ఆలోచించాల్సిన అంశం. కరోనా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ పోరాటం ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. ఉధృతిని కట్టడి చేస్తూ దుష్ప్రభావాలను అరికట్టడంలో వ్యాక్సిన్ల పాత్ర ప్రముఖమైనదిగా నిపుణులు అందరూ చెబుతున్నారు. వేరియంట్ల ఉత్పత్తి పెను సవాల్ గా మారింది. డెల్టా తర్వాత ఒమిక్రాన్ వచ్చింది. ముందు ముందు ఇంకా ఎటువంటి వేరియంట్లు ఉత్పన్నమవుతాయో ఎవ్వరూ చెప్పలేక పోతున్నారు. వ్యాక్సిన్ల రూపకల్పనకు ఈ అంశాలు అడ్డుగోడగా నిలుస్తున్నాయి. ఇప్పటి వరకూ రెండు డోసులు కలిపి 163 కోట్ల టీకాలు దేశ ప్రజలకు అందాయి. మొదటి నుంచీ నిపుణులు చెబుతున్నదాన్ని బట్టి చూస్తే, ఈ పాటికే సామూహిక రోగ నిరోధక శక్తి దేశంలో గణనీయంగా పెరిగి ఉండాలి. ఇప్పుడు ఒమిక్రాన్ తీరు చూస్తుంటే సామాజిక వ్యాప్తి దశలోకి చేరిందనే వార్తలు వింటున్నాం. పెరిగిన సామూహిక రోగ నిరోధక శక్తి ( హెర్డ్ ఇమ్మ్యూనిటీ ) ఒమిక్రాన్ సామాజిక వ్యాప్తిని అడ్డుకోలేదా అన్నది ప్రశ్న. సంబంధిత వర్గాల నుంచి దీనికి సమాధానం రావాల్సి ఉంది. మూడో డోసు తీసుకున్న తర్వాత వైరస్ ను అడ్డుకోగల యాంటీబాడీస్ నాలుగు నెలల పాటు స్థిరంగా ఉన్నట్లు కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. అమెరికాలో ఫైజర్ -బయో ఎన్ టెక్ వ్యాక్సిన్ బూస్టర్ డోసు తీసుకున్నవారిపై నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో నాలుగో డోస్ తీసుకోవాల్సిన అవసరం లేదని ఆ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.  వ్యాక్సిన్ – వ్యాక్సిన్ కు, దేశ- దేశానికి మధ్య ఇందులో వేరు వేరు అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Also read: రెండు మాసాల్లొ కరోనా ఖతం?

బూస్టర్ డోసులపై స్పష్టత అవసరం

నాలుగు డోసులు అవసరమని కొన్ని దేశాలు చెబుతున్నాయి. మన దేశంలో బూస్టర్ కు ముందుగా అత్యవసర సర్వీసులకు, 60ఏళ్ళు దాటినవారికి ప్రీకాషస్ డోస్ ఇస్తున్నారు. దీని తర్వాత బూస్టర్ డోస్ ఉండవచ్చు అంటున్నారు. బూస్టర్ డోస్ తీసుకోబోయే ముందు ప్రీకాషస్ డోస్ తీసుకోవడం మంచిదని ప్రచారం జరుగుతోంది. చాలామంది అనధికారికంగా బూస్టర్ డోసులు వేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. రెండో డోస్ – బూస్టర్ డోస్ మధ్య వ్యవధి విషయంలో ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క విధానాన్ని అమలుచేస్తున్నాయి. అనధికారికంగా బూస్టర్ డోసులు తీసుకొనేవారు వీటిని ఏమాత్రం అనుసరించడం లేదనే సమాచారం. డోసుల స్వీకరణలో, హైబ్రిడ్ విధానంలో వేరే వేరే సంస్థల వ్యాక్సిన్లను తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రభావం ఉంటుందని కొందరు చెబుతున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఇటువంటి సందేహాలు ఎన్నో వ్యక్తం అవుతున్నాయి. వీటన్నిటిపైన ప్రభుత్వాల నుంచి స్పష్టతను ప్రజలు కోరుకుంటున్నారు. ప్రస్తుతం మన దేశంలో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఒమిక్రాన్ వేరియంట్ పై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయో ఇంకా సమగ్రంగా తెలియరావడం లేదు. ప్రభుత్వాలు, ప్రైవేట్ వ్యవస్థలు, ప్రజలు కలిసి సాగించాల్సిన ఈ పోరాటంలో ఇంకా ఎన్నో పాఠాలు, గుణపాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది.

Also read: షరతులతో ‘చింతామణి’ని అనుమతించాలి

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles