కరోనా వైరస్ ముగిసిపోయిందని కొందరు భావిస్తున్నారు, కొందరు నటిస్తున్నారని డబ్ల్యూ హెచ్ ఓ చేసిన వ్యాఖ్య ఎంతో కీలకమైంది. అది ఇంకా ముగియలేదు. ముప్పు ఇంకా పొంచే ఉందన్న మాట చేదుగా అనిపించినా అది నిజం. పండుగల సీజన్ వచ్చేసింది. అక్టోబర్ నుంచి జనవరి వరకూ వరుసగా అనేక పండుగలు ఉన్నాయి. పెళ్లిళ్ల ముహుర్తాలు కూడా ఉన్నాయి. ఈ సందడిలో కరోనా వైరస్ ను మరువరాదని నిపుణులు చేస్తున్న హెచ్చరికలను గౌరవిద్దాం. వైరస్ మరింతగా విజృంభించే అవకాశం ఉంది. రద్దీ విపరీతంగా పెరిగిపోయింది.
బేపర్వా పెరిగింది
కరోనా కాలానికి ముందున్న వాతావరణం మళ్ళీ వచ్చేసిందని ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న రద్దీయే చెబుతోంది. కోవిడ్ మనల్ని పూర్తిగా వదిలేసి వెళ్లిపోయినట్లుగా కొందరు ప్రవర్తిస్తున్నారు. మాస్కుల వాడకం తగ్గిపోయింది. భౌతిక దూరం పాటించనివారి సంఖ్య పెరిగిపోయింది. నిన్నటి వరకూ వర్చువల్ పద్ధతిలో సభలు, సమావేశాలు జరిగేవి. ఇప్పుడు దానికి తిలోదాకాలు ఇచ్చేస్తున్నారు. జనసమ్మర్ధనతో వేడుకలు నిర్వహించడం మెల్లగా పెరుగుతోంది. వైరల్ ఫీవర్ బారినపడినవారు ఎక్కువమంది కనిపిస్తున్నారు. అది వైరల్ జ్వరమా, కరోనా వైరస్ జ్వరమా తెలియక భయపడేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి రెండు రోజుల నుంచి కొంచెం పెరిగింది. మొన్నటి వరకూ దేశంలో రోజుకు సగటున సుమారు 20వేల కేసులు నమోదయ్యేవి. ఇప్పుడు వ్యాప్తి ఒక్కరోజులోనే 19శాతం పెరిగింది. నిర్లక్ష్యం చేస్తే,కొంప ముణుగుతుంది. కేరళలో ఉధృతి ఇంకా తగ్గుముఖం పట్టకపోవడం బాధాకరం.దేశంలో నమోదవుతున్న కేసుల్లో 50శాతం అక్కడే ఉన్నాయి. మహారాష్ట్రలో కొంచెం తగ్గుముఖం పట్టింది. దేవాలయాల దర్శనాలు పెరుగుతున్న నేపథ్యంలో అత్యంత అప్రమత్తంగా ఉండాల్సి వుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావడం నిజమే కానీ, ఇంకా ఊపందుకోవాలి. రెండు డోసులు పూర్తయినవారి సంఖ్య ఇంకా అల్పంగానే ఉంది. సామూహిక రోగ నిరోధక శక్తి (హెర్డ్ ఇమ్మ్యూనిటీ) పెరగాలంటే దేశ జనాభాలో కనీసం 60 శాతంమందికి అన్ని డోసులు పూర్తవ్వాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డోసుల సంఖ్య విషయంలోనూ ఇంకా స్పష్టత రాలేదు.
Also read: శరన్నవరాత్రులు
స్వీయక్రమశిక్షణే శిరోధార్యం
రెండు డోసులు సరిపోతాయన్నదానితో ఎక్కువమంది ఏకీభవించడం లేదు. బూస్టర్ డోస్ పై చర్చ ఇంకా సమగ్ర స్వరూపాన్ని తీసుకోలేదు. ఇజ్రాయిల్ లో మాత్రం బూస్టర్ డోసుల పంపిణీ మొదలైంది. అమెరికా కూడా ఆ ప్రయత్నంలో ఉంది. రెండు వేరే వేరే కంపెనీల డోసులు తీసుకోవడం వల్ల ఎక్కువ లాభం /ప్రభావం ఉంటుందని కొంత ప్రచారం జరిగింది. ఈ అంశం కూడా ఇంకా నిగ్గు తేలాల్సివుంది. అన్ని కంపెనీల వ్యాక్సిన్లు ఒకేస్థాయి సామర్ధ్యం కలిగిలేవు. సమర్ధవంతమైన వ్యాక్సిన్లు ఇంకా రావాల్సి వుందని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు పనిచేసే కాలం కూడా కొన్ని నెలలు మాత్రమే. జీవితకాలం (లైఫ్ టైమ్) పనిచేసే వ్యాక్సిన్లు వచ్చేంత వరకూ ప్రతి సంవత్సరం వ్యాక్సిన్లు వేయించుకుంటూనే ఉండాలని అర్ధం చేసుకోవాలి.దీనినిబట్టి చూస్తే వ్యాక్సినేషన్ లో మనం ఇంకా చాలా వెనుకబడి వున్నామన్నది పచ్చినిజం. ప్రస్తుత వాతావరణం గుడ్డిలోమెల్లగా ఉంది. ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్ అందితేనే సురక్షితమైన వాతావరణం కొంత వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ ఓ) చేసిన సూచన చాలా విలువైనది. ఇటీవలే మన ప్రధాని అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంలో వ్యాక్సిన్ల తోడ్పాటు అంశం కూడా చర్చకు వచ్చింది. దాని ఫలితాలు ఇంకా తెలియాల్సి ఉంది. సింగిల్ డోస్ వ్యాక్సిన్లు కూడా విరివిగా అందుబాటులోకి రావాల్సివుంది. చిన్నపిల్లలకు వ్యాక్సిన్లు అందించే విషయంలో పెద్ద ప్రయత్నం జరగాలి. వ్యాక్సిన్ల వల్ల యాంటీబాడీలు ఏ మేరకు వృద్ధి చెందుతున్నాయన్న విషయంలో స్పష్టమైన నివేదికలు అందుబాటులో లేవు.దీనిపై సమగ్రమైన పర్యవేక్షణ జరగాలి. వ్యాక్సిన్ వేసుకున్నాం కదా మనకేంటి అనే నిర్లక్ష్యం తగదని అర్ధం చేసుకోవాలి. స్వీయక్రమశిక్షణ పాటించడమే శిరోధార్యం. ప్రభుత్వాలు మరింత వేగవంతంగా కదలాలి.
Also read: రక్తసిక్తమైన రైతు ఉద్యమం