- జాగ్రత్తలు తీసుకోవడం అవసరం
- ఎన్ ఫెక్షన్ ఉన్నట్లయితే వైద్యం తప్పనిసరి
కోవిడ్ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయనే వార్తలు మళ్ళీ భయాన్ని కలిగిస్తున్నాయి. దానికి తోడు ఐన్ ఫ్లూయెంజా వ్యాప్తి మరింత కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో యాంటీబయాటిక్స్ వాడకం కూడా పెరుగుతోంది. కరోనా మనల్ని పూర్తిగా వదిలివెళ్లిపోలేదనే మాటలను పెడచెవినపెట్టడం ఒక కారణమైతే, కరోనా వేరియంట్ల ప్రభావం మరో హేతువుగా చెప్పవచ్చు. ఇతర అంటువ్యాధుల వ్యాప్తితో కోవిడ్ సోకే ప్రమాదాన్ని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మొన్న ఆదివారం ఒక్కరోజులోనే వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. సోమవారం నాడు కూడా దగ్గర దగ్గర అదే సంఖ్య నమోదైంది. యాక్టివ్ కేసుల సంఖ్య 6,350కి చేరుకుంది. దేశంలోని ముఖ్యంగా ఆరు రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తం కూడా చేసింది. వైరల్ ఐన్ ఫెక్షన్స్ పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ కట్టడి చర్యలు వేగవంతం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది.
Also read: మండలి ఎన్నికల హెచ్చరికలు
పరీక్షలు పెంచడం అత్యవసరం
పరీక్షలు పెంచడం, వ్యాక్సినేషన్ పై దృష్టి పెట్టడం కీలకం. మార్చి మొదటి వారంలో కోవిడ్ కేసుల సంఖ్య 2వేలు మాత్రమే ఉండేది. ప్రస్తుతం అది మూడు రెట్లు పెరిగింది. కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కేరళ, తెలంగాణలో ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ప్రయాణాలు బాగా పెరిగాయి. ముఖ్యంగా అంతర్జాతీయ ప్రయాణీకుల రద్దీ కూడా బాగా పెరిగింది. కేసుల వ్యాప్తికి ఇదొక కారణంగా గుర్తించిన వేళ పరీక్షలు, జాగ్రత్తలపై దృష్టి సారించాలి. ఇన్ఫ్లుయెంజా ప్రభావంతో శ్వాస సంబంధిత ఇబ్బందులు పడుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.ఈ నేపథ్యంలో యాంటీబయోటిక్స్ వాడకంపై కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసింది. యాంటీ బయోటెక్స్ వాడకం బాగా పెరుగుతోంది.
Also read: దర్యాప్తు సంస్థల దుర్వినియోగం
యాంటీబయాటిక్స్ విధిగా వాడాలట
కోవిడ్ బాధితుల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ను గుర్తిస్తినే చికిత్సలో యాంటీబయోటెక్స్ ఉపయోగించాలని వైద్యులకు కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. అజిత్రోమైసిన్, ఐవర్ మెక్టిన్ వంటి ఔషధాలను కూడా ఉపయోగించవద్దని ఆరోగ్యశాఖ చెబుతోంది. కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న బాధితులకు ఐదు రోజుల పాటు రెమిడెసివర్ ఇవ్వవచ్చని అంటోంది. మొత్తంగా చూస్తే కోవిడ్, ఐన్ ఫ్లూయెంజా మళ్ళీ ఉధృతమవుతున్న వేళ జాగ్రత్తలను పాటించడం ప్రజల బాధ్యత. కట్టడి చర్యలను కట్టుదిట్టం చెయ్యడం ప్రభుత్వాల బాధ్యత. కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలను పాటించడం వైద్యుల బాధ్యత. చీటికిమాటికీ యాంటీబయోటెక్స్ వాడవద్దనే మాటను అందరూ గుర్తుపెట్టుకోవాలి.
Also read: ‘నాటునాటు’ బృందానికి అభినందనలు