మబ్బులు ఉలిక్కిపడ్డయ్
కోవిడ్ డేగ
నేలకు చూపులు సారించింది.
కనిపించని తీగల్లా అవి
భూమిని చుట్టుముట్టినై.
నిన్నటి దాకా పృథ్విని
శ్రామిక ప్రేమతో నింపిన చేతులు
ఒక్కసారిగా ముడుచుక పోయినై.
ఈ భయద ప్రాంతాన్ని విడిచి
ఎకాయెకిన నిష్క్రమిస్తున్నై.
ఇంటి పక్కల
ఇంటి వాళ్లలా తిరిగిన
ఈ ఆప్యాయపు ముద్దలు
ఇప్పుడు
అపరిచిత జీవులుగా మారిపోయారు.
జీవనోపాధి పోయిందా
మనస్సు ఇంటివైపు మళ్లిందా
తట్టా బుట్టా సర్దుకున్నారు
పిల్లా మేకల్ని పట్టుకున్నారు
ఈడ నాలుగు మైళ్ల కోసరం
బస్టాండులో ఎదురు చూసిన వాళ్లకు
ఇప్పుడు నలభై కోసులు కూడా
బలాదూర మైనాయి.
‘పల్లెకు పొయ్యి ఏం జేస్తరయ్యా’
అంతే
ఇది తర్కానికి అందేది కాదు
వారి మౌలిక లోకం జాగృతమయ్యింది.
వారు వెళ్ళేది కేవలం
ఒక పల్లీయ భూఖండం కాదు.
పేగులతో ముడేసుకున్న
మమతల భాండం,
అది వారి జన్మీయ చిరునామా.
మళ్లీ సుధీర్ఘయాత్ర మొదలైంది
వారిని ఆపడం కష్టం.
వారి కాళ్ల కింద
ప్రపంచీకరణ నలిగి పోతున్నది.