వ్యాక్సిన్లు వేయడానికి దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. ఈ దిశగా కేంద్రప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. ఇప్పటికే పలు సమీక్షా సమావేశాలు జరిగాయి. వ్యాక్సినేషన్ ఊపందుకునే వరకూ పలు దఫాలలో సమీక్షలు, పర్యవేక్షణలు కొనసాగుతూనే ఉంటాయని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలను వేగవంతం చేస్తున్నాయి. ఈ ప్రక్రియ ఒక కొలిక్కివచ్చి, కరోనా అదుపులోకి వచ్చేంత వరకూ స్థానిక ఎన్నికలు నిర్వహించకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. కనీసం మొదటి దశ వ్యాక్సినేషన్ దాటాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యంగా అర్ధమవుతోంది.
వ్యాక్సినేషన్ పై ప్రభుత్వం పట్టుదల
రాజకీయ కారణాలు ఏమైనా ఉండవచ్చుకానీ వ్యాక్సినేషన్ పై పట్టుదలగానే ఉంది. రెండు మూడు నెలల్లోనే ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. డిసెంబర్ లోనే సిద్ధమని ఒక ముఖ్యనాయకుడు ట్విట్టర్ లో సందేశం పెట్టి మళ్ళీ తొలిగించినట్లు కొన్ని వార్తలు వచ్చాయి. ఈ విషయం ఎట్లా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకున్న గడువు కంటే ముందే ప్రక్రియ ప్రారంభించడానికి సన్నధ్ధమవుతున్నట్లు భావించవచ్చు. జనవరి, ఫిబ్రవరిలో టీకాలు వేయడంపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు కూడా జారీ చేసింది.
యజ్ఞంలో భాగస్వాములు
జనవరి అంటే ఇంకా ఎన్నో రోజులు లేవు. వ్యాక్సిన్ నిల్వ, రవాణా, నిర్వహణ పనుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యంత్రాంగం బిజీగా బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆరోగ్య కార్యకర్తలు, ప్రభుత్వ ఉద్యోగులు ఈ యజ్ఞంలో భాగస్వామ్యులు కానున్నారు. ఈ ప్రక్రియలో 23శాఖలకు సంబంధించి కొన్ని లక్షల మంది పనిచేయనున్నారు. ఎన్నికల ప్రక్రియ ఎలా ఉంటుందో, అక్కడ సిబ్బందిని ఎట్లా ఉపయోగిస్తారో అదే తీరున వ్యాక్సినేషన్ ప్రక్రియలోనూ ఉపయోగించాల్సిందని కేంద్ర ప్రభుత్వం తన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఒక్కొక్క వ్యాక్సినేషన్ సెషన్ లో 100మంది లబ్ధిదారులు, ఐదుగురు వ్యాక్సినేషన్ బృంద సిబ్బంది ఉంటారని సమాచారం.
Also Read : కోవిడ్ టీకా ప్రక్రియ ఇలా….
నిపుణుల హెచ్చరిక
ప్రస్తుతం కరోనా కొంత అదుపులో ఉన్నా, డిసెంబర్, జనవరిలో మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. మార్చి వరకూ సెకండ్ వేవ్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత అందరికీ ఉంది. అన్ లాక్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండీ కొందరు జాగ్రత్తలు పాటించకుండా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. వీళ్ళ వల్లే ప్రమాదం పొంచి ఉంటుంది. కోవిడ్ నుంచి స్వేచ్చా వాయువులు పీల్చుకోడానికి, వ్యాకిన్లు అతి త్వరలోనే అందుబాటులోకి వస్తున్నాయానే వార్తలు వెలుగులు ప్రసరిస్తున్నా, దాని వెనకాల ఉన్న చీకటి నీడలను మరచిపోరాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రాకేష్ మిశ్రా వ్యాఖ్య గమనార్హం
సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యులర్ బయలాజీ (సి సి ఎం బి ) డైరెక్టర్ డాక్టర్ రాకేష్ మిశ్రా తాజాగా చేసిన వ్యాఖ్యలను తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి. ఒకే టీకాపై ఆధారపడరాదని, కోవిడ్ ఇప్పుడప్పుడే పూర్తిగా తగ్గదని, వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చి, కొందరు వేసుకున్నా, అందరికీ అందడానికి ఇంకా చాలా సమయం పడుతుందని, అప్పటి దాకా మిగిలిన వారు కోవిడ్ మనల్ని వదల్లేదనే స్పృహతో జాగ్రత్తలు, రక్షణ చర్యలు పాటించాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం రాబోయే వ్యాక్సిన్ల వల్ల కలిగే రోగ నిరోధక శక్తి ఎంతకాలం వరకూ ఉంటుందన్నది ఇప్పుడే అంచనా వేయలేమని ఆయన అంటున్నారు.
సామూహిక రోగనిరోధకశక్తి
హెర్డ్ ఇమ్మ్యూనిటీ అంటే, సామూహిక రోగనిరోధకశక్తి వచ్చేంత వరకూ రక్షణ చర్యలు తప్పవని చెబుతున్నారు. కరోనా వైరస్ రకరకాల మార్పులకు గురిఅవుతూ ఉంటుందని, డానికి తగ్గట్టుగా వ్యాక్సిన్లను తయారుచేసుకోవాల్సి వస్తుందనీ వ్యాఖ్యానిస్తున్నారు. వ్యాక్సిన్ రూపకల్పనలో ఇది పెద్ద సవాల్ అని అంటున్నారు. ఎన్ని వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా, క్రమశిక్షణ వీడకుండా, కనీసం ఒకటి రెండు సంవత్సరాలు అప్రమత్తంగా ఉండడం అవసరమని నిపుణుల మాటల వల్ల తెలుస్తోంది. ఈ వెలుగునీడల మధ్య, కరోనా అంశం చీకటివెలుగుల ఆటలా సాగుతోంది.