Wednesday, December 25, 2024

జనతా కర్ఫ్యూ పెట్టిన రోజు

కరోనా వైరస్ దుష్ప్రభావంతో కేంద్ర ప్రభుత్వం  సంవత్సరం క్రితం దేశంలో “జనతా కర్ఫ్యూ” విధించింది. దేశమంతా కర్ఫ్యూ ఏంటి? అని ఆనాడు జనత ఆశ్చర్యపోయింది. మన ఆరోగ్యం కోసమే కదా అని అందరూ మనసుకు సర్దిచెప్పుకున్నారు. గోధూళి వేళ అత్యవసర సేవా సిబ్బందికి కృతజ్ఞతగా చప్పట్లు చరచి, గంటలు మ్రోయించమన్నారు. అందరూ ఏకకాలంలో ఏకతాళం వేశాం. ఆ దృశ్యాలను సెల్ఫీ వీడియోలు మీడియాలో సోషల్ మీడియాలో హోరెత్తి పోయాయి. అదో సందడిగా, సంబరంగా జరిగినా క్రమశిక్షణగానే సాగింది. అది అంతటితో ఆగలేదు. 21రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నామని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. ఎవ్వరూ బయటకు రావడానికి వీల్లేదన్నారు.

సమాజం స్తంభించిన వేళ

సర్వ వ్యవస్థలు స్తంభించాయి. మళ్ళీ మే వరకూ పొడిగించారు. ఈ నేలపై జీవిస్తున్న నాలుగు తరాల మనుషులు గతంలో ఎప్పుడూ ఇటువంటి అనుభవాన్ని ఎదుర్కోలేదు. ఇంట్లో ఉండలేరు. బయటకు వెళ్ళలేరు. ఉద్యోగం,ఉపాధి, వెలుతురు, వెన్నెల ఆన్నీ దూరమయ్యాయి. మనిషి నిర్వేదంలోకి వెళ్లిపోయాడు. ఈ బంధనాల నుంచి మనం ఎప్పుడు బయటపడతామని పిన్నలు పెద్దలు విలవిలలాడిపోయారు. లాక్ డౌన్ ను సడలించుకుంటూ వచ్చారు.

Also Read : మనిషి మారకపోతే మహమ్మారే

రెచ్చిపోయిన మనిషి

సడలించిన ప్రతిసారీ మనిషి రెచ్చిపోయాడు. మద్యం దుకాణాలు కూడా తీసేసరికి చెలరేగిపోయారు.దీనితో తగ్గుముఖం పట్టిన కేసులు మళ్ళీ పెరగడం ప్రారంభించాయి.మెల్లగా కొంతకాలానికి బాగా తగ్గిపోయాయి. ఈ నడిమి, ఒక్కొక్కరూ విశృంఖలంగా ప్రవర్తించారు. ఇప్పటికీ కొందరు అదే తీరులో ఉన్నారు. ఇంకేముంది? మళ్ళీ కరోనా విజృంభణం పెరిగింది. మృత్యు ఘంటికలు మ్రోగడం మొదలు పెట్టాయి. వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. వ్యాక్సినేషన్ కూడా మెల్లగా పెరుగుతోంది. ఇంకా కొన్ని రకాల వ్యాక్సిన్లు రాబోతున్నాయి.

ఏడవాలో, నవ్వాలో తెలియని స్థితి

కరోనా వైరస్ వ్యాప్తి తగ్గి పెరిగినందుకు ఏడవాలా? వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినందుకు సంతోషపడాలా? తెలియని సందిగ్ధంలో మానవాళి ఉంది. మిగతా దేశాల్లో ఎట్లా ఉన్నా, భారతదేశంపై కరోనా తెచ్చిన కష్టనష్టాలు సామాన్యమైనవి కావు. ఎన్నో జీవితాలు చీకట్లోకి వెళ్లిపోయాయి. మానవ సంబంధాలు తెగిపోయాయి. భౌతిక దూరంతో పాటు మానసిక దూరం పెరిగిపోయింది. ఆత్మీయులకు కరోనా సోకినప్పుడు ఆ బాధ వర్ణనాతీతం. వాళ్ళను కలవలేం,చూడలేం, సేవలు అందించలేం.

Also Read : అగ్రనేతలకు విశాఖ ఉక్కు పట్టదా?

తిరిగి ప్రత్యక్షమైన బాధామయ దృశ్యాలు

వ్యాప్తి పెరగడంతో మళ్ళీ ఆ దృశ్యాలు వచ్చేశాయి. కరోనా సోకినవారు ప్రైవేట్ ఆస్పత్రిలో చేరితే, ఆరోగ్యం సంగతి ఎలా ఉన్నా, ఆ ఫీజుల బరువు మామూలువాళ్లు మోయలేరు. రోజుకు లక్ష రూపాయలు వదిలిస్తున్నారు. ఏవో ఇంజక్షన్స్ అంటున్నారు, ఆక్సిజన్ రేట్ తగ్గిపోయింది, కృత్రిమ ఆక్సిజన్ ఎక్కించాలంటున్నారు. సాధారణ ఆస్పత్రిలో కూడా రూమ్ అద్దె రోజుకు వేలల్లో ఉంటోంది. ఎగువ మధ్య తరగతివారు తప్ప సామాన్యుడు తట్టుకోలేక పోతున్నారు. మనిషిని వదులుకో లేక, ఖర్చు పెట్టలేక ఎందరో కన్నీరు మున్నీరవుతున్నారు. దీని వైపు ప్రభుత్వాలు దృష్టి పెట్టి, ఆస్పత్రుల దోపిడీని అరికట్టకపోతే… తీవ్ర ప్రజా ఉద్యమాలు వస్తాయి. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజేషన్ ఎలాగూ పాటిస్తారు.మళ్ళీ వ్యవస్థలు స్థంభిస్తే?  ఆ పరిస్థితులను ఊహించుకోలేం.

భయం కొల్పుతున్న సెకండ్ వేవ్

సెకండ్ వేవ్ భయభ్రాoతులకు  గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో, కొన్ని రాష్ట్రాల్లో మళ్ళీ ఆంక్షలు మొదలయ్యాయి. కాకపోతే, దేశ వ్యాప్తంగా మళ్ళీ లాక్ డౌన్ ఉండకపోవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. వైరస్ తీవ్రత ఉండే జిల్లాలు, ప్రాంతాల్లో, కంటైన్ మెంట్ జోన్లవారీగా ఆంక్షలు విధించుకోవచ్చునని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్ర ముఖ్యమంత్రులతో సమావేశమై సమీక్ష జరిపారు. వ్యాక్సినేషన్ పెరగడం తద్వారా హెర్డ్ ఇమ్మ్యూనిటీ పెరగడంతో (సామాజిక రోగ నిరోధక శక్తి)  కరోనా దుష్ప్రభావాలను కట్టడి చేయగలమని సూచించారు. సాక్షాత్తు ప్రధానమంత్రి, ప్రధానమైన వ్యక్తులు వ్యాక్సినేషన్ చేసుకోవడం వల్ల ప్రజల్లో ధైర్యం పెరుగుతోంది. వ్యాక్సిన్ల వైపు మొగ్గు చూపించేవారి సంఖ్య పెరుగుతోంది.

Also Read : అసోంలో కమలదళానికే మళ్ళీ కిరీటమా?

భారీగా పెరిగిన కేసులు

దేశంలో రోజువారీ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఒక్కరోజులోనే 47వేల కేసులు నమోదు అయ్యాయి.ఈ పరిణామం చాలా ఆందోళన కలిగిస్తోంది. వరుసగా 12రోజుల నుంచి పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దాదాపు నాలుగు నెలల తర్వాత రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గడచిన ఐదు రోజుల్లోనే మరింతగా పెరిగాయి. మరణాల సంఖ్య కూడా పెరిగింది. ఎక్కువ కేసులు మహారాష్ట్రలోనే ఉన్నప్పటికీ మిగిలిన రాష్ట్రాలు తేలిగ్గా తీసుకునే పరిస్థితి కాదు. మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్ ప్రభుత్వాలు రాత్రిపూట కర్ఫ్యూతో పాటు పాక్షికంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. ఢిల్లీలోనూ మళ్ళీ పెరుగుదల మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లోనూ పెరుగుతున్నాయి.ఇప్పటి వరకూ సుమారు నాలుగున్నర కోటిమంది వ్యాక్సిన్లు వేయించుకున్నారు.

అందుబాటులోకి వచ్చిన రెండు టీకాలు

ప్రస్తుతం కోవిషీల్డ్, కోవాక్జిన్ రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఏ వ్యాక్సిన్ వేయించుకోవలన్నది వ్యక్తి ఇష్టానికే వదిలివేశారు. కరోనా వైరస్ ఇప్పుడప్పుడే మానవాళి మధ్య నుంచి వెళ్ళిపోదు, దాని ప్రభావం మెల్లగా తగ్గిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జనతా కర్ఫ్యూ విధించి మార్చి 22కు సంవత్సరం పూర్తయింది. ఈ సందర్భాన్ని పునఃసమీక్ష చేసుకుంటే, ప్రస్తుతం ఇంచుమించూ అవే పరిస్థితులు, అంతకు మించిన సంధిగ్ధ పరిస్థితులు నెలకొని వున్నాయి. కోవిడ్ పరీక్షలు కూడా ఇంకా పెరగాల్సి వుంది. కోవిడ్ సోకినవారికి అనుకూలమైన వైద్య వాతావరణాన్ని ప్రభుత్వాలు కల్పించాలి.ఇంకా సమర్ధవంతమైన వ్యాక్సిన్లు అందుబాటులోకి రావాలి. అవి అందుబాటులోకి వచ్చేంత వరకూ అప్రమత్తంగా ఉండడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. వైద్య రంగంలో మానవత్వం పెరగకపోతే ప్రజల మనుగడకే ప్రమాదం. జనజీవనం స్థంభించకుండా ముందుకు సాగే పరిస్థితులు కావాలి.

Also Read : కేరళలో వామపక్షాలకు వన్స్ మోర్ అంటారా?

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles