Sunday, December 22, 2024

ఇది టీకానామ సంవత్సరం

  • కోవాగ్జిన్, కోవిషీల్డ్ లకు అనుమతి
  • రెండు ఔషధాలూ ఇండియాలోనే ఉత్పత్తి కావడం గర్వకారణం

అనుకున్నట్లుగానే కరోనా వైరస్ ను నిలువరించే వ్యాక్సిన్లు కొత్త సంవత్సరం ఆరంభంలోనే వచ్చాయి. ఇది గొప్ప శుభ పరిణామం. ఈ సంవత్సరం మొత్తం ఇంకా అనేక వ్యాక్సిన్లు వస్తూనే ఉంటాయి. 2020ని కరోనా నామ సంవత్సరంగా అభివర్ణించారు. 2021ని వ్యాక్సిన్ల (టీకా) నామ సంవత్సరంగా పిలువవచ్చు. హెపటైటిస్ కు అద్భుతమైన వ్యాక్సిన్లను రూపొందించి ప్రపంచ దేశాలతో ఎన్నో ప్రశంసలు పొందిన శాంతా బయో టెక్నిక్స్ సంస్థ నుండి కూడా కరోనా వ్యాక్సిన్  మరి కొన్ని నెలల్లో రానుందని సమాచారం. ఇలా అనేక సంస్థలు రూపొందించే వ్యాక్సిన్లు ఇక నుండి అందుబాటులోకి వస్తూనే ఉంటాయి.

స్వేచ్ఛావాయువులు

అధైర్యం, అసహనం, ఒత్తిడితో సతమవుతున్న మానవాళికి వ్యాక్సిన్ల రాకతో స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే సమయం వచ్చింది. భారతదేశంలో కూడా ఇంత తొందరగా వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడం  ప్రగతికి సంకేతం. కోవిడ్ పై  యుద్ధంలో దీన్ని ఒక మలుపుగా దేశ ప్రధాని నరేంద్రమోదీ అభివర్ణిస్తున్నారు. ఈ శుభ పరిణామంతో కోవిడ్ రహిత దేశంగా భారత్ మారడానికి పునాదులు పడ్డాయి. అనుమతులు పొందిన రెండు వ్యాక్సిన్లు కూడా మన దేశంలోనే తయారుకావడం ఎంతో గర్వకారణం.

కలసాకారం దిశగా ప్రస్థానం

ఆత్మనిర్భర్ అనే మాటను ప్రధాని మోదీ పదే పదే చెబుతున్నారు. ఆ కల సాకారం దిశగా ప్రస్థానం ప్రారంభమైందని ప్రధాని ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. భారత్ లో కరోనా వ్యాక్సినేషన్ కు అనుమతులు రావడన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా స్వాగతించింది. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన కోవిషీల్డ్, కోవాగ్జిన్ లను రెండు డోసులుగా తీసుకోవాలని చెబుతున్నారు. ఇంజెక్షన్ ద్వారా ఇచ్చే ఈ టీకా, మొదటి డోస్ ఇచ్చిన 28 రోజుల తర్వాత రెండవ డోస్ ఇస్తారు. ఈ మధ్య కాలంలో, కొత్త రకం కరోనా వైరస్ లు వచ్చి ఆందోళనకు గురి చేస్తున్నాయి.

కొత్త రకాల వ్యాధులను అరికట్టే సామర్థ్యం

ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్లు కొత్త రకాలను కూడా అరికట్టే సామర్ధ్యం కలిగి ఉన్నాయని చెబుతున్నారు. ఇది ఎంతో ధైర్యాన్ని ఇచ్చే అంశం. ఈ రెండూ దేశీయ టీకాలు కావడం హర్షణీయం, అభినందనీయం. అత్యవసర వినియోగంగా భావించి, ఈ వ్యాక్సిన్లకు డ్రగ్ కంట్రోలర్ అఫ్ ఇండియా అనుమతులు ఇచ్చింది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ కు మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ ఇంకా పూర్తికాలేదు. ట్రయల్స్ కొనసాగుతుండగానే అనుమతించడంపై పలు విమర్శలు వెల్లువత్తుతున్నాయి.

Also Read : కోవాగ్జిన్, ఆస్ట్రాజనీకాలకు అనుమతి మంజూరు

ఇప్పటికీ కొన్ని భయాలు

పూర్తి స్థాయి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించకుండా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవ్వడం శ్రేయస్కరమేనా? అనే భయాలు కొందరిలో ఉన్నాయి. భారత్ బయోటెక్ అనుమతులపై వస్తున్న విమర్శలకు ఎయిమ్స్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రణదీప్ గులేరియా సమాధానం కూడా చెప్పారు. ఇది ప్రస్తుతానికి బ్యాక్ అప్ టీకా మాత్రమేననీ, రీ ఇన్ఫెక్షన్ విషయంలో అత్యవసర వినియోగం కోసం ఇది ప్రస్తుతానికి ఉపయోగపడుతుందని ఆయన అంటున్నారు.

ఎయిమ్స్ డైరెక్టర్ జనరల్ విశ్వాసం

మూడో దశ డేటా దృఢమైందని చూపుతోందని వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే సరికి, అది సమర్ధవంతమైనదని, సురక్షితమని చెప్పడానికి తగినంత సమాచారం ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ జనరల్ భారత్ బయోటెక్ అందిస్తున్న వ్యాక్సిన్ పై ఎంతో విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు. ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ వ్యాక్సిన్లకు సంబంధించిన రోగ నిరోధక శక్తి, భద్రతలపై సంపూర్ణంగా సమీక్షించిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వ్యాఖ్యానిస్తోంది. మొత్తంమీద, ఈ సమాచారం ఈ రెండు  వ్యాక్సిన్లపై విశ్వాసాన్ని కలుగజేస్తున్నాయి.

ఏమైనా తేడాలు వస్తే?

కరోనా వైరస్ చేసిన, చేస్తున్న అలజడి అంతాఇంత కాదు. నిజంగా, వీళ్ళందరూ చెబుతున్నట్లు సత్ఫలితాలు ఇస్తూ, ఎటువంటి దుష్ప్రభావాలు కలుగజేయకపోతే, అంతకంటే కావాల్సిందేముంది. ఏవైనా తేడాలు జరిగితే? నష్ట పోయేది ప్రజలు. ఆ పాపాన్ని మూటకట్టుకునేది తయారుచేసిన సంస్థలు, అనుమతులు మంజూరు చేసిన తత్ సంబంధిత విభాగాలు. రాజకీయ ప్రయోజనాల కోసం, ఆర్ధిక స్వార్థంతో మనుషుల జీవితాలతో ఆడుకుంటే? ప్రజా న్యాయస్థానంలో వాళ్ళందరూ పెద్ద దోషులుగా నిలబడతారు.

Also Read : ప్రజలందరికీ ఉచితంగా కరోనా టీకా

ఆషామాషీ విషయం కాదు

నిజంగా అద్భుతమైన ఫలితాలు ఇస్తే, బోలెడు పుణ్యం మూటకట్టుకుంటారు, సుకీర్తిని పొందుతారు. 139.5 కోట్ల జనాభా కలిగిన భారతదేశానికి రెండు డోసుల చొప్పున భద్ర మార్గంలో, సమర్ధంగా టీకాలు అందించడం, మారుతున్న వైరస్ కు అనుగుణంగా సామర్ధ్యంతో పనిచేయడం, ఫలితాలను ఇవ్వడం ఆషామాషీ విషయం కాదు. గతంలో, వివిధ వ్యాధులకు సంబంధించి, ఎన్నో వ్యాక్సిన్లు  వచ్చాయి. అవి అందడానికి ఎన్నో ఏళ్ళ సమయం పట్టింది. అందివచ్చిన సాంకేతిక ప్రగతి, ప్రగతి రథాలు, అత్యవసర వినియోగానికి ఉన్న ఆవశ్యకత నేపథ్యంలో, అనుమతులు శరవేగంగా వచ్చాయి.

ఫలితాలే సంశయాలకు సమాధానాలు

ప్రభుత్వాధినేతలు కూడా ఆ దిశగా సంబంధిత వ్యవస్థలను పరుగెత్తించారని చెప్పాలి. తయారు చేసిన సంస్థలు కూడా ఎంతో చిత్త శుద్ధితో పనిచేశాయని విశ్వసించాలి. భవిష్యత్తులో వ్యాక్సిన్లు ఇచ్చే ఫలితాలే అన్నింటికీ సమాధానాలు చెబుతాయని భావిద్దాం. కరోనా వైరస్ అంతమై, ఒకప్పటి సాధారణ పరిస్థితులు వచ్చి, ఆనందమయంగా జీవితాలు సాగుతాయని అభిలషిద్దాం. వ్యాక్సిన్లు వచ్చాయని జాగ్రత్తలు పాటించకుండా, అశ్రద్ధగా ప్రవర్తిస్తే, నష్టపోయేది మనమే. వ్యాక్సిన్ల తయారీ యజ్ఞంలో నేనుసైతం అంటూ కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుదాం. ఆరోగ్య భారత్ నిర్మాణం దిశగా కలిసి అడుగులు వేద్దాం.

Also Read : భారత్ లో విజృంభిస్తున్న కరోనా స్ట్రెయిన్

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles