- బెయిల్ ఇవ్వొద్దని పోలీసుల కౌంటర్ పిటీషన్ దాఖలు
- అదనపు సెక్షన్లు నమోదు చేశామన్న పోలీసులు
బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియకు కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. పోలీసు కస్టడీ ముగియడంతో బెయిల్ మంజూరు చేయాలని ఆమె దాఖలు చేసిన పిటీషన్ ను సికింద్రాబాద్ కోర్టు తిరస్కరించింది. విచారణ అనంతరం ఆమె పై అదనపు సెక్షన్లు నమోదు చేసినట్లు కోర్టుకు దాఖలు చేసిన కౌంటర్ పిటీషన్ లో తెలిపారు. దీంతో అఖిల ప్రియ తరపు న్యాయవాదులు నాంపల్లి కోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది.
ఇది చదవండి: అఖిల ప్రియకు కోర్టులో చుక్కెదురు
హఫీజ్ పేట భూముల వ్యవహారానికి సంబంధించి ప్రవీణ్ రావు సోదరుల కిడ్నాప్ కేసులో ఈ నెల 6న బోయిన్ పల్లి పోలీసులు అఖిల ప్రియను అరెస్టు చేశారు. దర్యాప్తులో భాగంగా సమాచారం రాబట్టేందుకు ఈ నెల 12 నుంచి మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న పోలీసులు అఖిలప్రియను విచారించారు. కస్టడీ ముగియడంతో బెయిల్ ఇవ్వాలని అఖిలప్రియ తరపు న్యాయవాది పిటీషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం పరిస్థితి బాగోలేదని బెయిల్ మంజూరు చేయాలని పిటీష్ లో విజ్ఞప్తి చేశారు.
ఇది చదవండి: గంటకో మలుపు తిరుగుతున్న బోయిన్ పల్లి కిడ్నాప్ ఉదంతం
బెయిల్ ఇవ్వొద్దన్న పోలీసులు:
అయితే పోలీసులు అఖిలప్రియకు బెయిల్ ఇవ్వొద్దని కౌంటర్ పిటీషన్ దాఖలు చేశారు.. కిడ్నాప్ కేసులో ఆమె భర్త భార్గవరామ్, సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి, గుంటూరు శ్రీను మరికొంతమంది ఇప్పటికీ పరారీలో ఉన్నారని పోలీసులు కౌంటర్ లో వెల్లడించారు. ప్రధాన నిందితురాలిగా ఉన్న ఆమె బయటకు వెళితే సాక్ష్యాలు తారుమారయ్యే ప్రమాదం ఉందని కౌంటర్ లో పోలీసులు అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో బెయిల్ మంజూరు చేస్తే పరారీలో ఉన్న నిందితులు దొరికే అవకాశాలు తక్కువని పిటీషన్ లో వెల్లడించారు.
ఇది చదవండి: కేసీఆర్ పెద్దరికం చేయండి..మా అక్క ప్రాణాల్ని కాపాడండి