- బెంగాల్లో గెలుపు కోసం శ్రమిస్తున్న బీజేపీ
- దక్షిణాది రాష్ట్రాలలో పార్టీ విస్తరణకు బీజేపీ వ్యూహాలు
- మమత విజయం సాధిస్తే థర్డ్ ఫ్రంట్ ఏర్పాట్లు ముమ్మరం
నాలుగు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలలో జరిగే ఎన్నికల ఫలితాలు, అధికార, ప్రతిపక్షాల తలరాతలు మారనున్నట్లు తెలుస్తోంది. అస్సాం, పుదుచ్చేరిలలో మాత్రమే బీజేపీకి విజయావకాశాలు కనిపిస్తున్నాయి. తమిళనాడు, కేరళలో విపక్షాలు గెలుస్తాయని పలు సర్వేలు తేల్చాయి. బెంగాల్లో మాత్రం రోజు రోజుకీ తృణమూల్ కాంగ్రెస్ బీజేపీల విమర్శలతో వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. దీంతో ఈ ఐదు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా బీజేపీకి ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఈ ఎన్నికల ద్వారా బీజేపీ తన భవిష్యత్ రాజకీయాలను నిర్ణయించుకోనున్నట్లు తెలుస్తోంది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కు బీజేపీ గట్టి పోటీ ఇవ్వనున్నట్లు పలు సర్వేలు తేల్చడంతో బీజేపీ పెద్దలు కాస్త నిరుత్సాహానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. అటు మమతకు కూడా బొటాబొటి మెజారిటీ మాత్రమే దక్కనున్నట్లు తెలుస్తోంది.
సీఎం అభ్యర్థిపై గందరగోళం:
తృణమూల్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా మమతా బెనర్జీ ఎన్నికల బరిలో దిగారు. దీనికి భిన్నంగా తృణమూల్ కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్న బీజేపీ మాత్రం సీఎం అభ్యర్థిని ప్రకటించకపోవడంతో శ్రేణులు గందరగోళానికి గురవుతున్నాయి. ఎన్నికల్లో విజయం సాధించినా ఎవరు సీఎం అవుతారనేందుకు సరైన సమాధానం బీజేపీ వద్ద లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. తమిళనాడు, కేరళలో ప్రత్యర్ధులను అడ్డుకునేందుకు బీజేపీ శ్రమించడమేకాని అధికారంలోకి వచ్చే అవకాశాలు ఏమాత్రం కనిపించడంలేదు. బెంగాల్ లో గతంలోకంటే ఎక్కువ సీట్లు సాధించి బలమైన ప్రతిపక్షంగా అవతరించేందుకు బీజేపీకి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
Also Read: అసోంలో కమలదళానికే మళ్ళీ కిరీటమా?
హింస, మతం ప్రాతిపదికన బెంగాల్లో ఎన్నికలు :
బెంగాల్ ఎన్నికల్లో అధికారం చేపడతామని బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. మిగతా రాష్ట్రాలతో పోల్చితే బీజేపీలోకి పలువురు ప్రముఖ నేతలు బీజేపీలో చేరారు. తృణమూల్ నుంచి తాజా, మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు ప్రముఖ సినీ నటులను కూడా బీజేపీ పార్టీలోకి చేర్చుకుంది. మత ప్రాతిపదికన ఓట్లు చీల్చేందుకు ఇక్కడ బీజేపీకి పెద్దగా అవకాశాలు కనిపించడంలేదు. తృణమూల్ కాంగ్రెస్ కు బలమైన ముస్లిం ఓటు బ్యాంకు అండగా ఉంది. బీజేపీ కార్యకర్తలపై తృణమూల్ కాంగ్రెస్ పాల్పడుతున్న దాడులనుంచి బీజేపీ సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తోంది. బీజేపీ పుదుచ్చేరి, తమిళనాడు కేరళ, పశ్చిమ బెంగాల్ లో సొంతంగా ఇప్పటివరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. ఆయా రాష్ట్రాలలో పార్టీని విస్తరించేందుకు ఈ ఎన్నికలను కీలకంగా భావిస్తోంది. మొదటి సారి బెంగాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగే ఎన్నికల్లో దక్కే విజయంతో బీజేపీకి 2022లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు, ఆతర్వాత జరగనున్న సాధారణ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఎంతో ఉపయోగపడతాయి. అంతేకాకుండా ప్రస్తుతం బీజేపీకి రాజ్యసభలో ఉన్న 40 శాతం స్థానాలను పెంచుకోవడానికి ఈ ఎన్నికలు ఉపయోగపడతాయి. వామపక్షాల పాలించిన సమయంలో టీఎంసీ కార్మికులు, ఆఫీస్ బేరర్లపై విపరీతంగా దాడులు జరిగాయి. ఆ సానుభూతి మమతా అధికారంలోకి వచ్చేందుకు ఉపయోగపడింది.
Also Read: తృణమూల్ గూటికి కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా
పార్టీల భవిష్యత్ ను మార్చనున్న ఎన్నికలు:
బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించినట్లయితే దేశంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు మమతా బెనర్జీ నేతృత్వంలో ఏర్పాట్లు జరిగే అవకాశం ఉంది. ఆమె ఇప్పటికే ఎన్పీపీ అధినేత శరద్ పవార్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ లతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు ఆర్జేడీ, సమాజ్ వాదీ పార్టీలు కూడా మమతకు మద్దతిచ్చే అవకాశాలున్నాయి. అదే జరిగితే రాబోయే కాలంలో బీజేపీ గడ్డుపరిస్థితులు ఎదుర్కోవాల్సిఉంటుంది. అయితే మమత ఆధ్వర్యంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతిస్తుందా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమ ప్రభావం బీజేపీ పై తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. బీజేపీ ఈ అడ్డంకులను అధిగమించాల్సిన అవసరం ఉంది. దేశంలోని ప్రధాన ప్రతిపక్షాలు ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్ల రూపంలో మార్చుకునేందుకు తగిన ప్రయత్నాలు చేయడంలేదని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ముఖ్యంగా నాయకత్వ సమస్యతో సతమతమవుతున్న కాంగ్రెస్ కు ఈ ఎన్నికల్లో నామమాత్రపు పోటీదారుగానే కనిపిస్తోంది. ఏ రాష్ట్రంలోనూ గట్టిగా పోటీ ఇచ్చే అవకాశాలు కనిపించడంలేదు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల ఫలితాలపై అధికార, ప్రతిపక్షాల రాజకీయ భవితవ్యం ఆధారపడిఉందని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు.
Also Read: కేరళలో వామపక్షాలకు వన్స్ మోర్ అంటారా?