- పూణే వేదికగా తొలి పోరుకు కౌంట్ డౌన్
- శిఖర్ ధావన్ కు అసలు పరీక్ష
భారత్ లో ఆరువారాల ఇంగ్లండ్ జట్టు పర్యటన ఆఖరిదశకు చేరింది. నాలుగుమ్యాచ్ ల టెస్టు, ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ లను ఆతిథ్య భారత్ గెలుచుకోడంతో ఆఖరి అంచె తీన్మార్ వన్డే సిరీస్ కు పూణేలోని మహారాష్ట్ర్ర క్రికెట్ సంఘం స్టేడియంలో రంగం సిద్ధమయ్యింది.వన్డే ఫార్మాట్లో సైతం టాప్ ర్యాంక్ జట్లుగా ఉన్న ఇంగ్లండ్, భారత్ 50 ఓవర్ల డే-నైట్ ఫైట్ కు సై అంటే సై అంటున్నాయి.
టాప్ గేర్ లో భారత్…
నాలుగుమ్యాచ్ ల టెస్టు సిరీస్ ను 3-1తోనూ, పాంచ్ పటాకా టీ-20 సిరీస్ ను 3-2తో నెగ్గిన భారత్ తీన్మార్ వన్డే సిరీస్ లోనూ విజేతగా నిలవాలన్న పట్టుదలతో ఉంది.అహ్మదాబాద్ వేదికగా ముగిసిన ఆఖరివన్డేలో టాప్ గేర్ ఆటతో చెలరేగిపోయిన విరాట్ సేన తొలివన్డేలో సైతం అదే దూకుడు కొనసాగించాలన్న లక్ష్యంతో ఉంది.కేవలం వన్డే సిరీస్ కోసమే జట్టులో చేరిన ఆల్ రౌండర్ కృణాల్ పాండ్యా, యువఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ కృష్ణ, టీ-20 స్పెషలిస్ట్ సూర్యకుమార్ యాదవ్ సైతం తుదిజట్టులో చోటు కోసం తహతహలాడుతున్నారు.
Also Read: లెజెండ్స్ టీ-20 విజేత భారత్
శిఖర్ ధావన్ కు టెన్షన్ టెన్షన్…
తొలిటీ-20లో విఫలం కావడం ద్వారా మిగిలిన నాలుగుమ్యాచ్ లకూ దూరమైన వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ తీవ్రఒత్తిడి నడుమ రోహిత్ తో కలసి భారత ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు.వన్డే జట్టులో ఓపెనర్ స్థానం కోసం యువఆటగాళ్లు పృథ్వీ షా. దేవదత్ పడిక్కల్, శుభ్ మన్ గిల్ వేచిచూస్తున్నారు. ఈ ముగ్గురి నుంచే శిఖర్ ధావన్ చోటుకు ముప్పు పొంచి ఉంది.ముంబై జోడీ శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ లలో ఎవరో ఒకరికి మాత్రమే రెండో డౌన్ చోటు దక్కనుంది.
కొహ్లీకి శతకం చిక్కేనా?
వన్డే ఫార్మాట్లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్ విరాట్ కొహ్లీ గత ఏడాది కాలంగా మూడంకెల స్కోరు సాధించడంలో విఫలమవుతూ వచ్చాడు. గత ఏడాది ఆడిన మూడుమ్యాచ్ ల వన్డే సిరీస్ లో కొహ్లీ 173 పరుగులు సాధించాడు. అంతేకాదు ప్రస్తుత టీ-20 సిరీస్ లో మూడు హాఫ్ సెంచరీలతో సహా 231 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.2020 సీజన్లో భాగంగా మూడు ఫార్మాట్లలో కలసి మొత్తం 30 అంతర్జాతీయ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ 1014 పరుగులతో 34.96 సగటు నమోదు చేశాడు. కనీసం ఒక్క శతకమూ సాధించలేకపోయాడు.
Also Read: టీ-20ల్లో విరాట్ రికార్డుల పర్వం
కేవలం 9 అర్థశతకాలు మాత్రమే సాధించిన కొహ్లీ 17సార్లు 30 పరుగుల కంటే తక్కువ స్కోర్లకే అవుటయ్యాడు.అయితే ఆలోటును ప్రస్తుతవన్డే సిరీస్ లో కనీసం ఒక్కశతకమైనా సాధించడం ద్వారా అధిగమించాలని అభిమానులు కోరుకొంటున్నారు.పేస్ బౌలింగ్ విభాగంలో భువనేశ్వర్ కుమార్ తో కలసి శార్దూల్ ఠాకూర్ బాధ్యతలు పంచుకోనున్నాడు.
పరువుకోసం ఇంగ్లండ్ పోరాటం..
Also Read: ఆల్-ఇంగ్లండ్ లో సింధుకు సెమీస్ షాక్
టెస్టు,టీ-20 సిరీస్ ల్లో పరాజయాలు పొందిన ఇంగ్లండ్ కనీసం వన్డే సిరీస్ లోనైనా పైచేయి సాధించడం ద్వారా స్వదేశానికి సంతృప్తిగా తిరిగివెళ్లాలని భావిస్తోంది.వోయిన్ మోర్గాన్ నాయకత్వంలోని వన్డే జట్టును సైతం తక్కువగా అంచనావేస్తే భారత్ కు చిక్కులు తప్పవు.మహారాష్ట్ర్రలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరిగిపోతూ ఉండడంతో వన్డే సిరీస్ ను అభిమానులు లేకుండానే ఖాళీ స్టేడియంలోని నిర్వహించాలని ఆతిథ్య మహారాష్ట్ర్ర క్రికెట్ సంఘం నిర్ణయించింది.అహ్మదాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో పూణే చేరుకొన్న రెండుజట్ల సభ్యులు పూణే స్టేడియం బయోబబుల్ లో ఇమిడిపోయారు.సిరీస్ లోని తొలివన్డే మంగళవారం మధ్యాహ్నం 1-30 గంటలకు ప్రారంభమవుతుంది.