- చోటా సచిన్, పూజారాల వైపే అందరి చూపు
- వేలం బరిలో 292 మంది క్రికెటర్లు
ఐపీఎల్-14వ సీజన్ మినీ వేలానికి చెన్నై నగరంలో కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ వేలం కార్యక్రమంలో మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీ యాజమాన్యాలు 169 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తమకు నచ్చిన ఆటగాళ్ల కోసం తలపడనున్నాయి. వివిధ దేశాలకు చెందిన మొత్తం 1100 మంది ఆటగాళ్ల జాబితా నుంచి 292 మంది ఆటగాళ్లతో తుది జాబితాను సిద్దం చేశారు.
164 మంది భారత క్రికెటర్లు :
వివిధ ప్రాంచైజీల అవసరాలకు అనుగుణంగా సిద్ధం చేసిన 292 మంది జాబితాలో 164 మంది భారత, 125 మంది విదేశీ ఆటగాళ్లున్నారు. కేవలం 61 స్థానాల కోసమే ఐపీఎల్ మండలి మినీ వేలాన్ని నిర్వహిస్తోంది. తుది జాబితాలో గ్లెన్ మాక్స్ వెల్, హర్భజన్ సింగ్ లాంటి దిగ్గజ ఆటగాళ్లతో పాటు ఏమాత్రం అనుభవం లేని అర్జున్ టెండుల్కర్ లాంటి నవయువ ఆటగాళ్లు సైతం ఉన్నారు. వేలంలో గరిష్టంగా 61 స్థానాలు మాత్రమే ఖాళీలు కాగా, ఇందులో 22 మంది వరకు విదేశీ ఆటగాళ్లను ఎనిమిది జట్లు ఎంచుకోనే వీలుంది. బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టులో అత్యధికంగా 13 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. హైదరాబాద్ సన్‌రైజర్స్ జట్టులో 3 స్థానాలు ఖాళీగా ఉన్నాయి.
Also Read: ఐపీఎల్ వేలం తుదిజాబితా సిద్ధం
పూజారా వేలం ధర 50 లక్షలు :
టెస్టు స్పెషలిస్ట్ , భారత క్రికెట్ నయావాల్ చతేశ్వర్ పూజారా ఆరు సంవత్సరాల విరామం తర్వాత ఐపీఎల్ వేలంలో తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోబోతున్నాడు. పూజారా కనీస వేలం ధరను 50 లక్షల రూపాయలుగా ఖరారు చేశారు. 2014 ఐపీఎల్ లో చివరిసారిగా పాల్గొన్న పూజారాను ఆ తర్వాత నుంచి ఫ్రాంచైజీలు పక్కనపెట్టాయి.
సచిన్ తనయుడి ధర 20 లక్షలు :
సచిన్ తనయుడు అర్జున్ టెండుల్కర్ కనీస వేలం ధరను 20 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. ఓపెనర్ గా, లెఫ్టార్మ్ పేస్ బౌలర్ గా జూనియర్ స్థాయిలో భారత్ కు, ముంబైజట్టుకు ఆడిన అర్జున్ టెండుల్కర్ ముంబై సీనియర్ జట్టులో మాత్రం చోటు ఖాయం చేసుకోలేకపోయాడు. మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీలలో అర్జున్ టెండుల్కర్ ను ముంబై ఫ్రాంచైజీ తమజట్టులో చేర్చుకొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భారత మాజీ స్పిన్నర్ , వెటరన్ హర్భజన్ సింగ్ కనీసవేలం ధరను 2కోట్లుగా నిర్ణయించారు. భజ్జీతో పాటు కేదార్ జాదవ్ సైతం 2 కోట్ల రూపాయల జాబితాలో ఉన్నాడు. కాగా 2కోట్ల రూపాయల వేలం ధర జాబితాలో చేరిన విదేశీ ఆటగాళ్లలో స్టీవ్ స్మిత్, మాక్స్ వెల్ ఉన్నారు.
Also Read: ఐపీఎల్ కు వీవో గుడ్ బై
వేలం కోసం కింగ్స్ పంజాబ్ ఫ్రాంచైజీ దగ్గర అత్యధికంగా 53 కోట్ల 20 లక్షల రూపాయలు అందుబాటులో ఉన్నాయి. తొమ్మిదిమంది ఆటగాళ్లను వేలం ద్వారా కింగ్స్ జట్టు సమకూర్చుకోవాల్సి ఉంది. కోల్ కతా, హైదరాబాద్ ఫ్రాంచైజీలు మాత్రం 10 కోట్ల 75 రూపాయల మొత్తం తో వేలం బరిలోకి దిగబోతున్నాయి.
వేలం బరిలో నిలిచిన క్రికెటర్లు వీరే :
స‌్టీవ్ స్మిత్, మ్యాక్స్‌వెల్, ఫించ్, క్రిస్ మోరిస్, కేదార్ జాదవ్, మురళీ విజయ్, పియూష్ చావ్లా, అలెక్స్ కేరీ, కీమో పాల్, తుషార్ దేశ్‌పాండే, సందీప్ లామిచానె, మోహిత్ శర్మ, జేసన్ రాయ్, షెల్డన్ కాట్రెల్, ముజీబుర్ రెహమాన్, హార్డస్ విలియోన్, జేమ్స్ నీషమ్, క్రిష్ణప్ప గౌతమ్, కరుణ్ నాయర్, జగదీశ సుచిత్, తేజిందర్ సింగ్ ధిల్లాన్, క్రిస్ గ్రీన్, హ్యారీ గుర్నీ, ఎం. సిద్దార్థ్, నిఖిల్ నాయక్, సిద్ధేశ్ లాడ్, టామ్ బాంటన్, ప్రిన్స్ బల్వంత్ రాయ్, దిగ్విజయ్ దేశ్‌ముఖ్, నేథన్ కూల్టర్‌నైల్, జేమ్స్ పాటిన్‌సన్, షెర్ఫానె రూథర్‌ఫర్డ్, మిచెల్ మెక్‌క్లెనగన్, ఆకాశ్ సింగ్, అనిరుద్ధ జోషి, అంకిత్ రాజ్‌పుత్, ఒషానె థామస్, శశాంక్ సింగ్, టామ్ కరన్, వరుణ్ ఆరోన్, శివమ్ దూబె, ఉమేష్ యాదవ్, మోయిన్ అలీ, పార్థివ్ పటేల్, పవన్ నేగి, ఇసురు ఉడానా, గురుకీరత్ మాన్, బిల్లీ స్టాన్‌లేక్, సందీప్ బవనాకా, ఫేబియన్ అలెన్, సంజయ్ యాదవ్, పృథ్విరాజ్ యర్రా.