ఆకలితో ఎవరూ చావడానికి వీల్లేదు. ప్రజల ఆకలి తీర్చేలా ప్రభుత్వం ఏం చేయ్యదలచిందో తక్షణం చెప్పాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
అందరి ఆకలి తీర్చాలంటే మేం కడుపు కట్టుకొని పడుండాలి. ప్రభత్వం విధించే పన్నులు కట్టలేక పరిశ్రమల్ని మూసి రేపో ఎల్లుండో ఆ పేద ప్రజలతో ఫ్రీఫీడింగ్ సెంటర్ల దగ్గర క్యూ కట్టాలి. అందుచేత మేమిచ్చే కూలీనాలీతో, ఎవరైనా సరే అర్ధాకలితో బ్రతుకుతారు కానీ, ఆకలితో చావరు. పరిశ్రమలూ, పెట్టుబడులూ ఉంటేనే బ్రతుకుంటుంది. కానీ అన్నపానీయాలు కూడా ఉచితంగా ఇస్తే మనుషులకు బద్దకం పెరిగిపోయి, ఒళ్ళు చేసి, బీపీ, షుగరూ, గుండె జబ్బులొచ్చి చస్తారని చెప్పి కోర్టు వార్ని ఒప్పించండి,’’ అని పెట్టుబడిదార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు.
ప్రభువులు గెడ్డం సవరించుకొని రాత్రికి రాత్రి దివాళా తీసినట్టుగా మొహం పెట్టి ‘‘దేవుడున్నాడో లేడో తెలవదు కానీ, ప్రజలకి ఇప్పుడు దేవుడు మీదా, కోర్టుల మీదా మాత్రమే విశ్వాసం ఉంది. ఇప్పుడు మనం దేముడు లేడన్నా, కోర్టులని కాదన్నా మన ఉనికికే ప్రమాదం. అందుచేత మా మాటవిని, ప్రతిదాంట్లోనూ లాభం చేసుకోవడం ఎలాగో ఆలోచించండి,’’ అని సలహా చెప్పారు.
‘‘అదెలా కుదురుతుంది’’ అని ఆలోచనలో పడ్డారు పరిశ్రమల యజమానులు.
‘‘సృష్టిలో ఒక గొప్ప రహస్యం దాగి ఉంది. ఒక నక్క ఇంకో నక్కని తినదు. ఒక మేక సాటి మేకల్ని తినదు. ఒక పులి ఇంకో పులిని తినదు. తిండి దగ్గర పోటీ వస్తే వాటికవ్వే కొట్టుకొనీ, కుమ్ముకొనీ చస్తాయి. చచ్చినా వాట్నవ్వే తిని బ్రతకవు. సాటి పులులూ, సాటి మేకలూ ఉంటేనే తమ జాతి అభివృద్ధి చెంది, యీ భూమండల మంతా పులుల మయమో, సింహాలమయమో, సివరాకరికి కుక్కల తోటో నిండపోతే ఇది కుక్కల రాజ్యమని ప్రకటించుకోవచ్చనుకుంటాయి. మన మతమే మిగలాలని అన్యమతస్తులు, మన జాతికి ప్రమాద కారకులని చెప్పి, వాళ్ళని ఉనికిలో లేకుండా చేస్తున్నాం. అంటే మన జాతి మనుగడ కోసం మాత్రమే మనం ఆ పని చేస్తున్నాం అని అర్థం. దీన్నిబట్టి తేలేదేంటంటే, యీ భూమ్మీద ఏ జీవీ తన జాతిని చంపి తినదు. పరాయి జీవుల్ని మాత్రమే తింటుంది. ఆ మాటకొస్తే మనిషితో సహా జీవులన్నీవెజిటేరియనే…’’ అని చెప్పుకు పోతున్న ప్రభుత్వాల్ని వింటూ ‘‘అదెలాగ?’’ అని హాశ్చర్య పోయారు, పెట్టుబడిదారులు.
‘‘అక్కడికే వస్తున్నాను. ఒక పులి ఇంకోపులిని తింటే దానికది నాన్ వెజిటేరియన్. అలాగే మనిషి మనిషిని వేటాడకుండా జాగ్రత్తగా ఫారం కోళ్ళలా పెంచుకొని తిన్నా నాన్ వెజిటేరియన్స్ అవుతారు. అలాగ మనిషెప్పుడూ చెయ్యడు కనుక, సద్ బ్రాహ్మల్లా అంతా వెజిటేరియనే. అందుచేత మానవ జాతి మనుగడ కోసం సుప్రీంకోర్టు చెప్పినట్లుగా, కట్టుకోవడానికి బట్టల్లేకపోయినా, ఉంటానికి ఇల్లు లేకపోయినా, చెయ్యడానికి పని లేక పోయినా, జబ్బు చేస్తే వైద్యం చేయించుకోవడానికి డబ్బు లేకపోయినా, డబ్బెట్టి చదువుకొనుక్కొని జ్ఞానవంతులై గౌరవంగా బతక లేకపోయినా, ఎవరూ ఆకలితో చావడానికి వీల్లేదు. మనమంతా మనుషులమని చెప్పుకోవడానికి మొహానికి హ్యూమెన్ మాస్కులు (ఫేస్ మాస్కులు) పెట్టుకోవాల్సిన అవసరం లేదు.
కడుపు కాల్తున్నవాడికి కాసిని గంజి నీళ్ళు పోస్తే సరిపోతుంది. వాడు మనలో మనిషినే కాదు దేముణ్ణి కూడా చూస్తాడు. అయినా మనని మనం మహమ్మారుల నుంచి కాపాడుకోవడానికి మనం తయారు చేయించే మందులు ప్రయోగించి చూడాలంటే కూడా, మనుషులు మిగలాలి కదా’’ అంటూ వివరించింది ప్రభుత్వం.
మనుషుల్ని మనుషులు తినకూడదు. పెట్టుబడి తినాలి. అప్పుడే తమకి గిట్టుబాటౌతుందని గ్రహించారంతా….
భారీ ఎత్తున పెట్టుబడి పెట్టి, కృత్రిమ ఆహార ధాన్యాలు ఉత్పత్తి చెయ్యడం మొదలు పెట్టారు. చూస్తుండగానే లాభాల పంటలు పండటం మొదలు పెట్టాయి. వాళ్ల మానవీయతతో ఉచిత భోజనం తిన్న వాళ్ళందరికీ అరుగుదల తగ్గిపోయింది. అందుకు మందులు వాడితే విరోచనాలు తగులుకున్నాయి. ఇలా ఒక దాని వెంట ఒక సమస్య తోడై చివరికి పేదరికం రోగంగా మారిపోయింది. ఆ రోగాల్ని తగ్గించడానికి భూముల్లో మందుల్ని పండించడం మొదలు పెట్టారు పెట్టబడిదార్లు.
జైహో టు కంపెనీ విత్ హ్యూమన్ ఫేస్. మూడు తలల సింహానికి కూడా మనిషి వెజిటేరియనేనని శాంతి వచనాల్ని జపించింది మానవ సేవలో గడ్డం పెంచుకొన్న ప్రభుత్వం గెడ్డం సవరించుకొంటూ.
Also read: మందులేని జబ్బు
Also read: కమ్యూనిస్టు గాడిద
Also read: నాలుగో సింహం
Also read:నీలాకాశాన్ని కొలిచే కొలబద్ద
Also read: కుక్కచావు