Thursday, November 21, 2024

రెండు మాసాల్లొ కరోనా ఖతం?

  • కొత్త వేరియంట్ రాకుండా ఉంటేనే
  • మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి

ఒక పక్క ఒమిక్రాన్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. మరోపక్క మార్చి కల్లా కరోనా ముగిసిపోతుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. నిజంగా అలా జరిగితే అంతకంటే కావాల్సింది ఇంకేముంది? ఐ సీ ఎం ఆర్ కు చెందిన డాక్టర్ సమీరన్ పాండా తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి ఊతం ఇస్తున్నాయి.ఆయన చేసిన వ్యాఖ్యలను ఒకసారి గమనిద్దాం.” మనం జాగ్రత్తలు పాటిస్తూ,భౌతిక దూరం మొదలైన నిబంధనలను అనుసరిస్తూ,మాస్కులు ధరిస్తూ,శానిటైజర్స్ ను వాడుతూ,అశ్రద్ధ వహించకుండా ఉంటే, కొత్త వేరియంట్లు పుట్టుకురాకపోతే, మార్చి11కల్లా కరోనా వైరస్ ఎండమిక్ గా మారుతుంది” అని అన్నారు.

Also read: కేజ్రీవాల్ – క్రేజీవాల్?

మార్చి నుంచి మంచి ఘడియలు

ఇంకా మాట్లాడుతూ…డెల్టా వేరియంట్ ను ఒమిక్రాన్ భర్తీ చేస్తే, కోవిడ్ ముగిసిపోయే అవకాశాలు ఉన్నాయని డాక్టర్ పాండా అభిప్రాయపడ్డారు. నిపుణుల బృందం కూడా ఇంచుమించు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. డిసెంబర్ 11వ తేదీన ఒమిక్రాన్ వేవ్ ప్రారంభమైంది. ఇది మూడు నెలల పాటు ఉంటుందని వారు అంటున్నారు. ఈ లెక్కన చూస్తే  మార్చి 11 నుంచి కొంత ఉపశమనం కలుగవచ్చు. ఐ సీ ఎం ఆర్ నిపుణుల మాటల ప్రకారం, మార్చి నుంచి మంచి ఘడియలు వస్తాయని అనుకోవాలి. ఒమిక్రాన్ తో పాటు డెల్టా వేరియంట్ కూడా వ్యాప్తిలో ఉంది. ఈ తీరు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా సాగుతోంది. దిల్లీ, ముంబయిలో ఒమిక్రాన్ – డెల్టా వేరియంట్ సగటున 80 : 20 నిష్పత్తిలో ఉన్నట్లు సమాచారం. మహా నగరాల్లో కరోనా గరిష్ఠ స్థాయికి చేరిందా లేదా అన్నది తెలియాలంటే మరో రెండు వారాలు వేచి చూడాల్సిందేనని నిపుణులు అంటున్నారు.

Also read: షరతులతో ‘చింతామణి’ని అనుమతించాలి

దానికి తగ్గట్టుగా ఐ సీ ఎం ఆర్ పరీక్షా వ్యూహాలను మార్చుకుంటూ వెళ్తోంది.ప్రస్తుతం దేశంలో కరోనా విజృంభిస్తోందన్నది వాస్తవం. కొత్త కేసులు 3లక్షలకు చేరువయ్యాయి. ఇది ఇలా ఉండగా, రికవరీ రేటు 94 శాతం ఉండడం శుభసూచకమే. కోవిడ్ కేసులు భారీగా పెరగడానికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. రెండు వేరియంట్లు కలిసి సాగుతుండడం ఒక కారణం. డెల్టా వేరియంట్ తో పోల్చుకుంటే ఒమిక్రాన్ వ్యాప్తి ఐదారు రెట్లు ఎక్కువగా ఉండడం మరో కారణమని నిపుణుల అభిప్రాయం. ఒమిక్రాన్ వ్యాప్తి అధికంగా ఉన్నప్పటికీ  తీవ్రత మాత్రం తక్కువేనని ఎక్కువమంది చెప్పడం ఊరటనిచ్చే అంశం. కాకపోతే, సెకండ్ వేవ్ తో పోల్చుకుంటే ఇప్పుడు నడుస్తున్న మూడో వేవ్ లో కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.

Also read: వాక్సిన్ కి ఏడాది

సోషల్ మీడియా అరాచకం

శాస్త్రీయమైన అంశాలకు భిన్నంగా సోషల్ మీడియాలో ఎవరికి నచ్చినట్లు వాళ్ళు వ్యాఖ్యలు చేస్తూ, ఉచిత సలహాలు ఇవ్వడమో, భయభ్రాoతులకు గురిచెయ్యడమో జరుగుతోంది. కమ్యూనికేషన్ వ్యవస్థ పెరిగిన నేపథ్యంలో ఇదొక విపరీతమైన పరిణామం. వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకోవడం ఎంతో ఆశావహం. రెండు డోసుల పంపిణీ 60 శాతం దాటితే హెర్డ్ ఇమ్మ్యూనిటీ ( సామూహిక రోగ నిరోధక శక్తి) ఆశించిన స్థాయిలో పెరుగుతుందని నిపుణులు మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రస్తుత వ్యాక్సినేషన్ ప్రగతిని గమనిస్తే  ఆ స్థాయిని దాటిపోయాం. ప్రీకాషస్ డోస్ కూడా మొదలైంది. 15 నుంచి 18 ఏళ్ళ పిల్లలకు కూడా వ్యాక్సిన్లు అందిస్తూ ఉండడం మరో మంచి అడుగు. కోవిడ్ ఉధృతిని, తీవ్ర పరిణామాలను అడ్డుకట్ట వేయాలంటే? నిబంధనలను పాటించడంతో పాటు మరిన్ని సమర్ధవంతమైన వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేలా చేయాలి. కోవిడ్ వైరస్ శక్తిసామర్ధ్యాలు త్వరలోనే నిర్వీర్యమవుతాయని ఆకాంక్షిద్దాం, అవ్వాలని బలంగా కోరుకుందాం.

Also read: ప్రపంచవ్యాప్తంగా సూర్య నమస్కారాలు

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles