ఉలిక్కిపడుతున్న యూరప్
ఎంత సర్ది చెప్పుకుందామనుకున్నా సమాధానపడటం చేతకావడం లేదు. భయమే ప్రాణాలను హరిస్తోందనీ, ధైర్యంగా ఉండాలనీ మానసిక నిపుణులు చెబుతున్న సూచనలు ఒకపక్క చెవిలో జోరీగలా వినిపిస్తున్నప్పటికీ…అంతర్జాతీయంగా వినవస్తున్న వార్తలు నిలకడగా ఉండనీయడం లేదు. ఈ ఉపోద్ఘాతమంతా ప్రపంచం ఇప్పుడు ఎదుర్కొంటున్న కొవిడ్ -19 సమస్య గురించే. లక్షలాదిమంది ప్రాణాలను ఇప్పటికే హరించేసిన మహమ్మారి తగ్గుముఖం పడుతోందనే వార్తలు వినిపిస్తున్నప్పటికీ తాజాగా యూరోప్‌లో బహిర్గతమవుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆ ఖండంలో కొవిడ్ సెకండ్ వేవ్ మొదలైపోయిందంటున్నాయి. రోజుకు లక్షపైగా కేసులు నమోదవుతున్నాయి. వేల సంఖ్యలో మరణాలూ సంభవిస్తున్నాయి. గణాంకాలు అందరిలోనూ గాభరా పుట్టిస్తున్నాయి. ఇంతకీ యూరప్‌లో కొవిడ్ సెకండ్ ప్రారంభమయిందా? మరణాల సంఖ్య ఎలా ఉంది? కేసుల నమోదు ఎలా ఉంది?
అక్టోబర్ నుంచీ విజృంభణ
మే నెలలో కేసుల నమోదు పూర్తిగా తగ్గిపోయి హమ్మయ్యా అనుకున్నారు. అక్టోబర్ నెలలో మళ్ళీ సంఖ్య భారీగా పెరిగింది. బ్రిటన్లో సెప్టెంబర్ నెలలో రోజుకు 3 నుంచి 4వేలు నమోదయ్యాయి. ఇప్పుడు ఆ సంఖ్య 20వేలు దాటిపోయింది. గ్రేటర్ మాంచెస్టర్, సౌత్ యార్క్ షైర్, లాంక్‌షైర్, లివర్‌పూల్ నగరాలలో కఠిన నిబంధనలను అమలుచేస్తున్నారు. వేల్స్ నగరంలో నవంబర్ 9వ తేదీ వరకూ లాక్‌డౌన్ విధించారు. ఉత్తర ఐర్లాండ్‌లో సైతం నాలుగు వారాల లాక్‌డౌన్ అమలవుతోంది.
రానున్నవి గడ్డు రోజులు: మార్కెల్ హెచ్చరిక
సెప్టెంబర్‌లో వెయ్యి లోపు కేసులున్న జర్మనీలో అక్టోబర్ 24న 14,700 కేసులు నమోదయ్యాయి. రానున్నవి అత్యంత గడ్డురోజులంటూ చాన్సలర్ మెర్కెల్ వ్యాఖ్యానించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. గార్డియన్ పత్రిక ఈ కథనాన్ని ప్రముఖంగా ప్రచురించి, రానున్న ప్రమాదాన్ని చెప్పకనే చెప్పింది. బెల్జియంలో అక్టోబర్ 25న 17700కేసులు నమోదయ్యాయి. అక్కడి కరొనా సెంటర్‌లోని 2000 ఐసీయూ బెడ్లూ నిండిపోయాయి. ఈ నెల 22,23 తేదీలలో 19వేలు చొప్పున కేసులు నమోదు కావడంతో స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ అప్రమత్తమయ్యారు. అక్టోబర్ 25న దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు. కొవిడ్‌ను అదుపు చేసేందుకే ఈ చర్య తీసుకున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్రాన్సులో అక్టోబర్ 25న 52వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. త్వరలో ఈ సంఖ్య లక్షకు పెరిగే అవకాశముంది. ఇక్కడి కేసుల సంఖ్యను ఇది 11లక్షల 38వేలకు చేర్చింది. తాజా పరిణామంతో ఫ్రాన్స్ అప్రమత్తమైంది. కరోనా అదుపునకు ఏం చేయాలో ఆ దిశగా అడుగులు వేస్తోంది.
ఇటలీలో మళ్ళీ మొదలు
ఇటలీలో అక్టోబర్ మొదటి వారంలో 3వేల లోపు నమోదైన కేసులు 25నాటికి 20వేలకు చేరుకున్నాయి. దీని అర్థం కొవిడ్-19 సెకండ్ వేవ్ యూరప్‌లో ప్రారంభమైనట్లేనా? ఎలా అదుపు చేయాలి? ఈ ప్రశ్నలు యూరప్‌నే కాదు. యావత్ప్రపంచాన్నీ వేధిస్తున్నాయి. భారత్ ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే విదేశీ విమానాల రాకను నిషేధించడంలో చూపిన తాత్సారమే భారత్‌లో కొవిడ్ విజృంభణకు దారితీసిందన్నది పచ్చి నిజం. ఈ విషయాన్ని మరువకూడదు. అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు చేపట్టాలి.
యూరప్ దేశాల పరిస్థితిని బాగా వివరించారు. అభినందనలు. కేసులు నెమ్మదించాక జనం మునపటిలాగే తిరగడం ప్రారంభించారు. అది సహజం కూడాను. తిరిగినా జాగ్రత్తలు పాటించడం టీకాలు కనిపెట్టబడి అందుబాటులోకి వచ్చేవరకూ తప్పదు.
యూరప్ దేశాల పరిస్థితి మనకి రాకూడదంటే మనం జాగ్రత్తలు పాటించడాన్ని నిర్లక్యం చేయరాదు.