Monday, January 27, 2025

చేజేతులా తెచ్చుకున్న ముప్పు

కరోనా వైరస్ వంటివి రావడానికి, కొన్ని రోజుల పాటు తగ్గినా, ఇప్పుడు మళ్ళీ ప్రబలడానికి మన స్వయంకృత అపరాధాలే ప్రధాన కారణం. లాక్ డౌన్ నిబంధనలను సడలించిన సమయంలోనే ఒక్కొక్కరు విశృంఖలంగా ప్రవర్తించారు. మద్యం దుకాణాలు తెరవడంతో అది మరింత వికృతరూపం దాల్చింది. లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేయడంతో అడ్డూ అదుపు లేకుండా పోయింది. సినిమా ధియేటర్లలో 100% సిట్టింగ్ అనుమతులు వచ్చేశాయి. పబ్బులు, బారులు, పార్టీ మీటింగులు , ఇతర సమావేశాలు, విందులు, వినోదాలు విపరీతంగా పెరిగిపోయాయి.

నిబంధనలు గాలికి

వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యే సరికి నిబంధనలను గాలికొదిలేశారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం అనేది మర్చిపోయారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, మాల్స్, వాణిజ్య సముదాయాలు, దేవాలయాలు అన్నింటా అదే పరిస్థితి. ఎన్నికలు కూడా రావడంతో ర్యాలీలు, సమావేశాలతో వేలాదిమంది గుమి గూడుతున్నారు. నదులు , సముద్ర స్నానాలు పెరిగిపోయాయి. కర్రీ, ఫుడ్ పాయింట్లు, రోడ్డు పక్కన తినుబండారాలు యదేచ్ఛగా కిటకిటలాడుతున్నాయి.

Also Read : బిగుస్తున్న ఉక్కు పిడికిలి

భౌతిక దూరం మరిచారు

విమానాల్లో భౌతిక దూరం అస్సలు పాటించడం లేదు. చాలా నెలల తర్వాత మళ్ళీ ప్రయాణ అనుమతులు రావడంతో విమానయాన సంస్థలు భౌతిక దూరం అనే మాటను పూర్తిగా గాలికొదిలేశాయి. ఇలా ఒక్కచోట అని కాదు, ఒక్కరిని కాదు… చాలా వరకూ సర్వత్రా ఇదే తంతు. దీనితో కరోనా వైరస్ మళ్ళీ విజృంభించింది. మహారాష్ట్రలో మొదలైన ఈ ఉధృతి మెల్లగా మిగిలిన రాష్ట్రాల్లోనూ విస్తరిస్తోంది.

మనదే తప్పు

ఎవరిది తప్పు అని ప్రశ్నించుకుంటే, అది నూటికి నూరు శాతం మనదే. అది 100% మానవ తప్పిదమే. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోకపోవడం, జీవ వైవిధ్యాన్ని గమనించకుండా మిగిలిన జీవరాశుల పట్ల క్రూరంగా ప్రవర్తించడం, అడవులు, నదీ నదాలను భ్రష్టు పట్టించడం,పారిశ్రామిక ప్రగతి, అభివృద్ధి, వ్యక్తిగత ఆర్ధిక స్వార్థం, భోగమయ జీవితం కోసం యావత్తు భూమండలాన్నీ, ఆకాశాన్ని సైతం కాలుష్యమయం చేసేశాం. పంచభూతాలను కాలుష్యకాసారంగా మార్చివేశాం. అందుకే, ప్రకృతి విలయ తాండవాలు సంభవిస్తున్నాయి. ఋతువుల క్రమం పూర్తిగా మారిపోయింది.

Also Read : బెంగాల్ బరిలో నందిగ్రామ్ పై గురి

పుట్టుకతోనే వార్థక్యం

ఉరుకులుపరుగులు, ఒత్తిళ్ల జీవితంతో శారీరక, మానసిక దృఢత్వాన్ని కోల్పోయాం. “కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు” అన్న చందాన, చిన్న పిల్లలు కూడా కళ్ళజోళ్లు వాడే పరిస్థితి వచ్చింది. ప్రకృతి పట్ల, తోటి జీవరాశి పట్ల మనం అమానుషంగా ప్రవర్తించడం వల్ల యావత్తు మానవాళి రోగాలు రొచ్చులతో బాధపడుతోంది. కరోనా వంటి కొత్త కొత్త వైరస్ లు పుట్టుకొస్తున్నాయి. ఈ దుష్ప్రభావాలన్నీ అందులో భాగమే. మన కళ్లెదుటే కరోనా వల్ల ఎందరో ఆత్మీయులు, మాననీయులు తనువు చాలించి వెళ్లిపోయారు. ఆంధ్రప్రదేశ్ లోనే సుమారు 7000మందికి పైగా కరోనా వల్ల మరణించారు. ప్రస్తుతం, ఇంకా 1200 మందికి పైగా చికిత్స పొందుతున్నారు.

మహారాష్ట్రలో రెండో విడత

మహారాష్ట్రలో ఈ ఫిబ్రవరిలో 36,917 కేసులుంటే, అవి ఈ మార్చి 12వ తేదీకి 1,10,485 అయ్యాయి. తెలంగాణలోనూ పెరుగుతున్నాయి. ఇప్పుడు మనదేశంలోనూ సెకండ్ వేవ్ నడుస్తోందా అని అడిగితే, ఎవ్వరూ స్పష్టమైన సమాధానం చెప్పడం లేదు. బ్రిటన్ లో వలె మన దగ్గర కూడా కరోనా వైరస్ మ్యుటేషన్ జరిగే ఉంటుందని కొందరు అనుమానిస్తున్నారు. ఈ అనుమానాలను నివృత్తి చేయాలి. ఒకసారి కరోనా వచ్చిన వారికి యాంటీ బాడీలు వృద్ధి చెందుతాయో లేదో అన్న అంశం అటుంచుదాం. రెండోసారి కూడా కరోనా వచ్చి ఇబ్బందులు పడినవారు ఎంతోమంది వున్నారు. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రోజువారీ కేసుల సంఖ్య 25 వేలకు దగ్గరయ్యింది.

Also Read : బీజేపీ ఉత్సాహంపై సర్వేక్షణం నీళ్ళు

రెండు నెలల విరామం తర్వాత

రెండున్నర నెలల తర్వాత ఇన్ని కేసులు నమోదు కావడం గమనార్హం. దీన్ని తేలికగా కొట్టి పారేయకూడదు. రికవరీలు ఆశాజనకంగానే ఉన్నా, కొత్త కేసులు ఎక్కువ గా నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 64శాతం మహారాష్ట్రలోనే ఉన్నాయి. వ్యాప్తి మహారాష్ట్రకే పరిమితం కాజాలదు. అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాల్సిందే. మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, శానిటైజషన్, మెడికల్ పరీక్షలు నిర్వహించుకోవడం మొదలైన వాటిని విస్మరించ కూడదు. వ్యాక్సినేషన్ పెరిగే కొద్దీ హెర్డ్ ఇమ్మ్యూనిటీ (సామాజిక రోగ నిరోధక శక్తి ) పెరుగుతుందని కొందరు శాస్త్ర వేత్తలు చెబుతున్నారు. దీన్ని సాధించడానికి ఇంకా కొన్ని నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే నిశ్శబ్దంగా కరోనా కొంతమందికి వచ్చిపోయిందని చెబుతున్నారు. వ్యాక్సినేషన్ రెండో దశ కూడా ప్రారంభమైంది. ఇప్పటికే రెండు సంస్థలు తయారు చేసిన వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.

కొత్త టీకా మందులు రావచ్చు

రాబోయే కాలంలో మరి కొన్ని సంస్థల నుంచి మరిన్ని వ్యాక్సిన్లు రానున్నాయి. జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ రూపొందించిన వ్యాక్సిన్ కు అత్యవసర వినియోగ అనుమతులు వచ్చాయి. మరి కొన్ని ఆ దశలో ఉండడం శుభ పరిణామం. వ్యాక్సినేషన్ పెరగడం ముఖ్యం. అదే సమయంలో, వ్యాక్సిన్ తీసుకున్నవారు కూడా నిబంధనలను పాటించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.కరోనా ఇప్పుడప్పుడే మనల్ని పూర్తిగా వెళ్ళిపోదనే శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఐతే, భవిష్యత్తులో దాని ప్రభావం సహజంగానే తగ్గిపోతుందని చెబుతున్నారు.

Also Read : మహిళకు వందనం

రోగ నిరోధక శక్తి పెరగాలి

స్పానిష్ ఫ్లూ మొదలు ఎన్నో వైరస్ లు మానవాళిని చుట్టుముట్టాయి.నష్టం, కష్టం వచ్చినా,కాలంలో వాటిని జయించాం.వాటన్నింటిలో మశూచి (స్మాల్ ఫాక్స్ ) ఒక్కటే పూర్తిగా నిర్మూలమైంది. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ద్వారానే కరోనా వైరస్ ను కూడా ఎదిరించ గలుగుతాం. దాన్ని సాధించడానికి ఏమేమి మార్గాలు ఉన్నాయో, వాటన్నింటినీ అవలంబించడమే మన కర్తవ్యం. జాగ్రత్తలు, నిబంధనలను పాటించడమే మన చేతిలో ఉన్న పని.

Also Read : అన్నదాత ఆగ్రహించి వందరోజులు

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles