- ప్రయోగ స్థాయిలో ప్రపంచంలో మొత్తం 240 టీకాలు
- 9 రకాల టీకాలు తుది దశ ప్రయోగంలో
- భారత్ బయోటెక్ శాస్త్రజ్ఞుల అహరహం పరిశోధన
- టీకా ఏ దేశంలో కనుగొన్నప్పటికీ ఉత్పత్తి బాధ్యత హైదరాబాద్ దే
(‘సకలం’ ప్రత్యేక ప్రతినిధి)
కోవిద్ మహమ్మారిని అరికట్టడానికి టీకా మందుకోసం ప్రపంచం యావత్తూ నిరీక్షిస్తున్నది. ఈ సంవత్పరాంతానికి టీకా మందు అందుబాటులోకి వస్తుందనీ, అది సామాన్య ప్రజలకు కూడా భారం కాని విధంగా చౌకగా లభిస్తుందనీ తెలంగాణ గవర్నర్ తమిళిసై మంగళవారం నాడు ఆశాభావం వెలిబుచ్చారు.
హైదరాబాద్ శివార్లలోని జినోమ్ వ్యాలీలోని భారత్ బయోటిక్ ను గవర్నర్ సందర్శించి ప్రయోగశాలను పరీక్షగా చూశారు. కొవాగ్జిన్ కోసం భారత్ బయోటిక్ లో శాస్త్రజ్ఞులు అహరహం పరిశోధన చేస్తున్నందుకు వారిని ఆమె అభినందించారు. భారత్ బయోటెక్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్ల, జాయంట్ ఎండి సుచిత్ర ఎల్ల, పరిశోధన చేస్తున్న శాస్త్రజ్ఞులను ఆమె కలుసుకున్నారు. కరోనా టీకా తయారీలో నిమగ్నమై ఉన్న శాస్త్రజ్ఞులను అభినందించారు. టీకాల తయారీలో భారత్ బయోటెక్ ముందున్నది.
ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం ప్రారంభించిన కరోనా వ్యతిరేక టీకా తయారీలో అగ్రగామిగా ఉన్నప్పటికీ దాన్ని ఇంకా పరీక్షించవలసిన అవసరం ఉన్నది. ప్రపంచ ఆరోగ్యసంస్థ పర్యవేక్షణలో పని చేసే ప్రవీణుల బృందం పరీక్షించి ఆమోదించిన తర్వాతనే ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. అంతలోనే రష్యా ఒక అడుగు ముందుకు వేసి అధినాయకుడు పుతిన్ కుమార్తె పైనే జయప్రదంగా ప్రయోగించిన టీకా తయారైనదని ప్రకటించింది. వచ్చే సంవత్సరం ప్రారంభంలో భారత దేశంలో కరోనా టీకా లభిస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్ తెలియజేశారు. ఇండియన్ కౌన్సిల్ ఆప్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వాక్సీన్ కోసం ప్రత్యేకించిన పోర్టల్ ను ఆయన ప్రారంభించారు.
దేశంలో ప్రస్తుతం మూడు రకాల టీకా మందులు – కొవిషీల్డ్, కొవాగ్జిన్, జైకోవ్ –డి వివిధ స్థాయిలలో ప్రయోగంలో ఉన్నాయి. వివిధ దేశాలలో మొత్తం 240 రకాల టీకాలు ప్రయోగంలో ఉన్నాయి. ఎవరి ప్రయత్నం వారు చేస్తున్నారు. నలభై టీకాలను మనుషులపైన ప్రయోగించారు. వీటిలో తొమ్మిది టీకాలు వేలాది మందిపైన ప్రయోగం చేసి తుది దశ ప్రయోగస్థాయిలో ఉన్నాయి. ఏ టీకా ప్రపంచ ప్రవీణుల ఆమోదం పొందినప్పటికీ దాని తయారీలో మాత్రం ఇండియా ముందు ఉంటుంది. అందులోనూ జినోమ్ వ్యాలీ ఉన్న హైదరాబాద్ నగరం అగ్రగామిగా ఉంటుంది. ఫార్మాసుటికల్ ఉత్పత్తిలో హైద్రాబాద్ దే ప్రథమ స్థానం.