- కేంద్ర మంత్రి హర్షవర్దన్ ప్రకటన
- తొలివిడతలో 3 కోట్ల మందికి టీకా
- దేశవ్యాప్తంగా టీకా డ్రైరన్ లో పాల్గొన్న మంత్రి
దేశ ప్రజలకు ఉచితంగానే కరోనా వ్యాక్సిన్ అందిస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ ప్రకటించారు. ఢిల్లీలో జరుగుతున్న వ్యాక్సిన్ డ్రైరన్ తీరును హర్షవర్దన్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతీయులందరికీ కరోనా వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తామని తెలిపారు. కొవిషీల్డ్ టీకా అత్యవసర వినియోగానికి కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ నిపుణుల బృందం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
వదంతులకు దూరంగా ఉండండి
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ డ్రైరన్ జరుగుతున్న సందర్భంగా వ్యాక్సిన్ పై వచ్చే వదంతులను నమ్మవద్దని మంత్రి హర్షవర్దన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీకా సామర్ధ్యం, భద్రత, రోగనిరోధకతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందిని స్పష్టం చేశారు. పోలీయో వ్యాక్సినేషన్ సమయంలోనూ ఇలాంటి వదంతులు వ్యాపించాయని హర్షవర్ధన్ గుర్తు చేశారు.
దేశవ్యాప్తంగా టీకా డ్రైరన్
దేశవ్యాప్తంగా 116 జిల్లాలలోని 259 ప్రదేశాల్లో వ్యాక్సినేషన్ మాక్ డ్రిల్ ఈ రోజు ఉదయం ప్రారంభమయింది. వ్యాక్సిన్ పంపిణీ కోసం ఏర్పాటు చేసిన అన్ని వ్యవస్థల పనితీరును డ్రైరన్ లో అధికారులు పరిశీలిస్తున్నారు. టీకా ఇవ్వడం తప్ప వాస్తవ వేక్సినేషన్ కార్యక్రమంలో పాటించే మొత్తం ప్రక్రియను యథాతథంగా పాటిస్తారు. డిసెంబరు 28, 29 తేదీలతో దేశంలోని నాలుగు రాష్ట్రాలలో తొలివిడత డ్రైరన్ నిర్వహించారు. ఇందులో తలెత్తిన లోపాల్ని సరిదిద్ది కొత్త మార్గదర్శకాల ప్రకారం డ్రైరన్ ను నిర్వహిస్తారు.
ఆక్స్ ఫర్డ్, ఆస్ట్రాజెనికా సహకారంతో సీరం ఇనిస్టిట్యూట్ తయారు చేసిన కొవిషీల్డ్ టీకా అత్యవసర వినియోగానికి కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొవిషీల్డ్ కు షరతులతో కూడిన అనుమతినివ్వాలని భారత ఔషధ నియంత్రణ సంస్థకు సిఫారసు చేసింది.
ఇదీ చదవండి: స్వదేశీ టీకాతోనే కరోనా కట్టడి-మోదీ
Good information