- రెండో విడత డ్రై రన్ లో కేంద్ర మంత్రి హర్షవర్ధన్ వెల్లడి
- ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి
- సిద్ధంగా 50 మిలియన్ కొవిషీల్డ్ వ్యాక్సిన్లు
- టీకా పంపిణీ ఏర్పాట్లలో వైద్య శాఖ యంత్రాంగం
మరికొద్ది రోజుల్లో దేశ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. కరోనా పోరులో ముందున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి, ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. దేశంలో కరోనాను పూర్తిగా అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. దీనికోసం ఇప్పటికే ఒకసారి డ్రైరన్ నిర్వహించింది. వ్యాక్సిన్ పంపిణీలో తలెత్తే సమస్యలను అధిగమించడానికి సిబ్బంది సమర్థతను అంచనా వేయడం కోస తలపెట్టిన రెండో దశ డ్రైరన్ ఈ రోజు (జనవరి 8)న దేశ వ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ డ్రైరన్ లో కొవిన్ యాప్ పనితీరును పరిశీలించనున్నారు.
ఇది చదవండి: టీకాల అనుమతిపై రాజకీయ వివాదం
వ్యాక్సినేషన్ పై భారీ కసరత్తు:
డ్రైరన్ లో భాగంగా వ్యాక్సినేషన్ కి ముందు ప్రజలు, ఆరోగ్య సిబ్బంది పాటించాల్సిన అంశాలలపై పూర్తి అవగాహన కల్పిస్తారు. టీకా ఇచ్చాక ప్రతికూల పరిస్థితులు ఎదురైతే అప్పటికప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తక్షణం అందించాల్సిన ప్రథమ చికిత్స గురించి అవగాహన కల్పించనున్నారు. కొవిన్ యాప్ లో నమోదు చేసుకున్న టీకా లబ్ధిదారులు టీకా కేంద్రానికి వచ్చేలా చర్యలు తీసుకుని వైద్య ఆరోగ్య సిబ్బందితో సమన్వయ పరచనున్నారు. వాక్సినేషన్ సమయంలో విధిగా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ క్యూలైన్లలో నిలబెట్టడం వారి నుంచి సమాచారాన్ని సేకరించి కొవిన్ యాప్ లో నమోదు చేయడం తదితర అన్ని దశలను ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. వాస్తవ టీకా ఇవ్వడం తప్ప మిగిలిన అన్ని ప్రక్రియలను అధికారులు పర్యవేక్షిస్తారు.
ఇది చదవండి: కొవాగ్జిన్ కోసం క్యూ కడుతున్న ప్రపంచ దేశాలు
ఎంపిక చేసిన కేంద్రాల్లో డ్రైరన్:
దేశంలోని 33 రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాంతాల్లో కలిపి 736 జిల్లాల్లో ప్రత్యేకంగా ఎంపిక చేసిన కేంద్రాల్లో వ్యాక్సిన్ డ్రైరన్ కార్యక్రమం జరుగుతోంది. జనవరి 2న నిర్వహించిన డ్రైరన్ లో గుర్తించిన సమస్యలను పరిష్కరించుకుని ముందుకు వెళ్లనున్నారు. డ్రైరన్ లో ముఖ్యంగా వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో నెలకొన్న అపోహలను, అనుమానాలను కూడా తొలగించాలను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
టీకా పంపిణీకి సిద్ధంగా ఉండాలని రాష్ట్రాలకు సూచన:
తొలివిడత వ్యాక్సినేషన్ లో భాగంగా ఫ్రంట్ లైన్ వారియర్లకు అందించేలా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచనలు చేసింది. ఈ రోజు డ్రైరన్ పూర్తయ్యాక అసలైన వ్యాక్సినేషన్ కు సంబంధించిన వివరాలను తెలియజేస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కొవిన్ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకున్న వారికి ముందుగా వ్యాక్సిన్ ఇవ్వాలని ఆ సంఖ్య ఆధారంగా ఆయా జిల్లాలకు ఎన్ని టీకాలు పంపాలనే విషయంపై ముందుగానే కసరత్తు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
ఇది చదవండి: ప్రజలందరికీ ఉచితంగా కరోనా టీకా
ఆర్డర్ రాగానే సరఫరాకు సిద్ధం :
కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ క్షణంలో ఆర్డర్ వచ్చినా పంపేందుకు సిద్ధంగా 50 మిలియన్ డోసుల కొవిషీల్డ్ వ్యాక్సిన్ లు సిద్ధంగా ఉన్నట్లు పూణె సీరం ఇనిస్టిట్యూట్ ఎగ్డిక్యూటివ్ డైరెక్టర్ సురేష్ జాదవ్ తెలిపారు. ఫూణె ఎయిర్ పోర్టు అధికారులు కూడా ప్రత్యేక విమానంతో సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా 700 జిల్లాలలో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. తొలి విడత వ్యాక్సినేషన్ లో భాగంగా దేశవ్యాప్తంగా 30 మిలియన్ల హెల్త్ కేర్ వర్కర్లకు తో పాటు ఫ్రంట్ లైన్ వర్కర్లకు వాక్సిన్ ఇవ్వనున్నారు. కేంద్ర ప్రభుత్వం అంచనా ప్రకారం ఈ ఏడాది జులైనాటికి 30 కోట్ల మందికి ప్రాధాన్యతా క్రమంలో వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.