- అహ్మదాబాద్ లో రవిశాస్త్రికి తొలిడోస్
- దేశవ్యాప్తంగా ప్రజలకు వాక్సినేషన్ షురూ
ప్రపంచంలోనే జనాభాపరంగా రెండో అతిపెద్ద దేశం భారత్ లో కరోనా నిరోధక వాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమయ్యింది. ఇప్పటి వరకూ కరోనాతో పోరాటంలో ముందు వరుసలో ఉన్న ఆరోగ్య,వైద్య, పోలీసు శాఖల వారికి మాత్రమే ఇస్తూ వచ్చారు. అయితే ఈ రోజు నుంచి ప్రజలకు సైతం వాక్సినేషన్ తొలిడోసు కార్యక్రమం మొదలు పెట్టారు.
భారత క్రికెట్ జట్టు సభ్యులతో పాటు ప్రస్తుతం అహ్మదాబాద్ లో విడిది చేసిన ప్రధాన శిక్షకుడు, భారత మాజీ కెప్టెన్ రవి శాస్త్రి కరోనా వాక్సిన్ తొలిడోసును వేయించుకొన్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు.మార్చి 4 నుంచి ఇంగ్లండ్ తో అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ప్రారంభంకానున్న ఆఖరి టెస్టు మ్యాచ్ లో భారత బృందానికి రవిశాస్త్రి నేతృత్వం వహిస్తున్నారు.
Also Read: మొతేరాలో స్పిన్నర్లే విన్నర్లు
అహ్మదాబాద్ లోని ఓ స్టార్ హోటెల్ బయోబబుల్ వాతావరణంలో గత రెండువారాలుగా గడుపుతున్న రవిశాస్ర్రికి 60 సంవత్సరాలు దాటడంతో వాక్సిన్ తొలిడోసును ఇచ్చారు.అహ్మదాబాద్ అపోలో ఆసుపత్రిలోని కాంతాబెన్ బృందం తనకు ఎలాంటి అసౌకర్యం లేకుండా వాక్సిన్ ఇచ్చారని, కరోనా మహమ్మారితో ఓ వైపు పోరాడుతూనే వాక్సిన్ కనిపెట్టిన శాస్త్రవేత్తలకు, వైద్య, ఆరోగ్యసిబ్బందికి రుణపడి ఉంటామని, వారందరికీ ధన్యవాదాలు చెబుతున్నట్లు రవి శాస్త్రి తెలిపారు.
Also Read: టెస్ట్ లీగ్ ఫైనల్స్ కు భారత్ చేరితే ఆసియాకప్ వాయిదా
ఇప్పటి వరకూ ఆన్ లైన్ ద్వారా 29 లక్షల మంది మాత్రమే వాక్సిన్ కోసం దరఖాస్తు చేసుకొన్నారు. ఆరోగ్యసేతు యాప్ ద్వారా వాక్సిన్ వేయించుకోదలచినవారు రిజిస్టర్ కావచ్చునని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ ప్రకటించారు.దేశవాప్తంగా 60 సంవత్సరాలు పైబడిన వారికి మాత్రమే ముందుగా వాక్సినేషన్ ఇవ్వనున్నారు.