- ఐసోలేషన్ లో ఇద్దరు ఉన్నతాధికారులు
- కరోనా నేపథ్యంలో అధికారుల అప్రమత్తం
- ఆందోళనను ఉధృతం చేస్తామంటున్న రైతు సంఘాలు
ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న ఆందోళనలు 16 వ రోజుకు చేరాయి. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసేవరకు పోరాటం ఆగదని అన్నదాతలు హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆందోళనలను ఉధృతం చేసేందుకు రైతులు సమాయత్తమవుతున్నారు. ఆందోళనల్లో భాగంగా శనివారం టోల్ గేట్ల వద్ద ఫీజు కట్టకుండా నిరసన తెలపాలని యావత్ దేశానికి పిలుపునిచ్చారు. త్వరలో రైల్వే ట్రాక్ లపై బైఠాయించి నిరసన తెలుసుతామని రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు. మరోవైపు చర్చలకు ఎల్లవేళలా సిద్ధమని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం సవరణలకు మాత్రమే సమ్మతి తెలుపుతోంది. సాగు చట్టాలను రద్దుచేసే ప్రసక్తేలేదని స్పష్టం చేసింది.
సరిహద్దుల్లో పోలీసుల మోహరింపు
కరోనా నేపథ్యంలో తీవ్రమైన చలిని కూడా లెక్కచేయకుండా రహదారులపై బైఠాయించి రైతులు నిరసనలు చేపట్టారు. దీంతో సరిహద్దుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా టిక్రి, సింఘు, ఘాజిపూర్, నోయిడా సరిహద్దు ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం భారీగా పోలీసు బలగాలను మోహరించింది. అయితే సింఘు సరిహద్దుల్లో మోహరించిన పోలీసు సిబ్బందిలో ఇద్దరికి కరోనా పాజిటివ్ గా తేలినట్లు అధికారులు ధృవీకరించారు.
ఐసోలేషన్ లో ఇద్దరు పోలీసు అధికారులు
ఆందోళన చేస్తున్న వేలాది మంది రైతులు కనీస జాగ్రత్తలు కూడా పాటించడం లేదు. దీంతో కొన్ని స్వచ్ఛంద సంస్థలు రైతులకు కొవిడ్ పరీక్షలతో పాటు ఇతర అత్యవసర ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులకు కరోనా సోకినట్లు తాజాగా నిర్థారణ కావడం తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసు బలగాలకు నేతృత్వం వహిస్తున్న డీసీపీ, అడిషనల్ డీసీపీలకు కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం వారిని ఐసోలేషన్ లో ఉంచామని తెలిపారు.
నిబంధనలు పాటించని రైతులు
నిరసన చేస్తున్న రైతులు భారీ సంఖ్యలో గుమికూడటం, సరిహద్దుల్లోనే వంట చేయడం, అక్కడే తిని పడుకోవడం లాంటి చర్యల నేపథ్యంలో కొవిడ్ నింబంధనలు పాటించలేదని తెలుస్తోంది. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున వైరస్ వేగంగా వ్యాపించే ముప్పు కూడా పొంచి ఉందని అధికారులు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా కేసులు అధికార వర్గాలను కలవరానికి గురి చేస్తున్నాయి.