- మహారాష్ట్రలో నమోదవుతున్న అత్యధిక కేసులు
- 4కోట్ల 50 లక్షల మందికి వ్యాక్సినేషన్
- భయం గుప్పిట్లో రాష్ట్ర ప్రభుత్వాలు
- తెలంగాణలో పాక్షిక లాక్ డౌన్ యోచనలో ప్రభుత్వం
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి పట్ల పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రోజూవారీ కేసులు క్రమేణా పెరుగుతూ 50 వేలకు చేరువవుతున్నాయి. కరోనా మరణాలు 200కు చేరాయి. ఆదివారం (మార్చి 21) న దేశ వ్యాప్తంగా 46,951 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1,16,46, 000 కోట్ల మంది వైరస్ బారినపడగా 1,59,967 మంది మృత్యువాత పడినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కరోనా పాజిటివ్ బారిన పడ్డవారిలో కోలుకుంటున్న వారి సంఖ్య సగం కంటే తక్కువగా ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది.
మహారాష్ట్రను వణికిస్తున్న కరోనా మహమ్మారి:
కరోనా మహమ్మారితో మహారాష్ట్ర విలవిలలాడుడోతంది. గడిచిన 24 గంటల్లో అక్కడ 30,535 కేసులు కొత్తగా నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కరోనా కేసులు 46,951గా ఉండగా ఒక్క మహారాష్ట్రలోనే 30వేల పైగా కేసులు నమోదవడంతో మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 24 లక్షల మార్కును దాటింది. తాజాగా 100 మంది మృత్యువాత పడగా ఇప్పటి వరకు 53,400 మంది ప్రాణాలు వదిలారు.
Also Read: దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి
4.50 కోట్ల మందికి టీకాలు:
కరోనా నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన టీకా కార్యక్రమం కొనసాగుతోంది. మార్చి 21న 4,62,157 మంది టీకాలు వేయించుకున్నారు. దాంతో ఇప్పటి వరకు టీకాలు తీసుకున్నవారి సంఖ్య 4,50,65,998కి చేరుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
కొవిడ్ పై తెలంగాణ సీఎం సమీక్ష:
భయం గుప్పిట్లో రాష్ట్ర ప్రభుత్వాలుతెలంగాణలో గత కొన్ని రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోముందు జాగ్రత్తగా రాష్ట్రప్రభుత్వం పాక్షికంగా లాక్ డౌన్ అమలు చేయాలని యోచిస్తోంది. వారాంతాలలో హైదరాబాద్ తో పాటు ప్రధాన నగరాలలో లాక్ డౌన్ అమలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. వారంలో రెండు రోజుల పాటు లాక్ డౌన్ లేదంటే ప్రతి రోజు రాత్రి కర్ఫ్యూ విధించే యోచనలు ఉన్నట్లు తెలుస్తోంది. గురుకుల పాఠశాలల్లో పదుల సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు కాలేజీలు మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. వైన్ షాపులు, సినిమా థియోటర్లు, పార్క్ లు జనాల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఆంక్షలు విధించనున్నట్లు తెలుస్తోంది.