ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేత అథనామ్
- ఇజ్రాయెల్ శాస్త్రజ్ఞుల ఆందోళన
- ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక
- చైనీయుల నరకయాతన
కరోనా వేరియంట్ ‘ఒమిక్రాన్’ నుంచి పుట్టుకొస్తున్న సబ్ వేరియంట్ల విషయంలో అప్రమత్తంగా ఉండడం అత్యవసరమని డబ్ల్యూ హెచ్ ఓ (ప్రపంచ ఆరోగ్య సంస్థ ) హెచ్చరిస్తోంది. ఇజ్రాయిల్ పరిశోధకులు కూడా కొన్ని అధ్యయనాలు ముందుంచుతున్నారు. పలు దేశాలలో కరోనా విజృంభణ జరుగుతున్న వేళ, వైరస్ లో జరుగుతున్న మార్పుల పట్ల డబ్ల్యూ హెచ్ ఓ అధినేత టెడ్రోస్ అథనామ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వైరస్ ఎలా మార్పులు చెందుతుందో, తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నామని డబ్ల్యూ హెచ్ ఓ అధినేత అంటున్న మాటలు అలోచనలను రేకెత్తిస్తున్నాయి.
Also read: ఐరోపాలో మోదీ పర్యటన
ఉపవేరియంట్ల వేగం అధికం
బి ఏ 2 కొన్ని దేశాల్లో విహరిస్తుండగా, బి ఏ 4, బి ఏ 5 దక్షిణాఫ్రికాను కుదిపేస్తోంది. పోయిన సంవత్సరం నవంబర్ ప్రాంతంలో దక్షిణాఫ్రికాలో పుట్టుకొచ్చిన ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ప్రపంచ వ్యాప్తంగా శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. అంతకుముందు వచ్చిన దానికంటే కూడా ఈ సబ్ వేరియంట్లలో వ్యాప్తి వేగం చాలా ఎక్కువ. అదే ప్రధానంగా ఆందోళన కలిగించే అంశం.ఆఫ్రికాతో పాటు అమెరికాలోనూ కేసులు పెరుగుతున్నాయి. మన దేశంలో దిల్లీ మొదలైన రాష్ట్రాలలోనూ అలజడి ఆరంభమైంది. ముంబయిలోనూ కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా వైరస్ త్వరలోనే మళ్ళీ ఉగ్రరూపం ఎత్తవచ్చునని ఇజ్రాయిల్ పరిశోధకులు తాజాగా హెచ్చరిస్తున్నారు. డెల్టా లేదా మరోరకమైనవి ఈ ఉధృతికి కారణం కానున్నాయని వీరి వ్యాఖ్యల బట్టి అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు వచ్చే రెండుమూడు నెలల్లో వాటికంతటికవే అంతరించిపోతాయని కూడా ఇజ్రాయిల్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒమిక్రాన్ – డెల్టా మధ్య కూడా పరస్పర చర్యలు జరుగుతున్నట్లు వారు వివరిస్తున్నారు. డెల్టా,ఒమిక్రాన్ రకాలలో డెల్టా ఎక్కువ దుష్ప్రభావాలను చూపించింది.దానిని ఇప్పటికీ శక్తిమంతమైనదిగానే భావిస్తున్నారు.
Also read: దేశంలో నిరుద్యోగం పెరిగిపోతోంది!
చైనాలో కఠినంగా నిబంధనల అమలు
డెల్టా వేరియంట్ నుంచి మళ్ళీ ముప్పు పొంచి ఉందని వీరి మాటలు బట్టి అర్థమవుతోంది. చైనీయుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. లాక్ డౌన్ అమలు చేస్తున్న విధానం కూడా కఠోరంగా ఉంది. ఆ దృశ్యాలు హృదయవిదారకంగా ఉన్నాయి. కొన్ని లక్షల మంది ఇళ్లకే పరిమితమైపోయారు. కరోనా సోకినవారికి నగరబహిష్కరణ విధిస్తున్నట్లు కొన్ని అంతర్జాతీయ మీడియా వేదికల్లో కథనాలు వస్తున్నాయి. అక్కడ కేసులు పెరగడంతో పాటు మరణాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని సమాచారం. చైనాలో నిబంధనలను అత్యంత కఠినంగా అమలుచేస్తున్నప్పటికీ కరోనా అదుపులోకి రావడం లేదు. ఇటువంటి పరిస్థితులు ఎక్కడా రాకూడదని కోరుకుందాం. భారత్ లో బూస్టర్ / ప్రికాషస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత ఊపందుకోవాలి. నిబంధనలను పాటించడంలో స్వయంక్రమశిక్షణే రక్షణ కవచం.మానవ మేధకు పెద్ద సవాలుగా మిగులుతున్న కరోనా అధ్యాయం ముగిస్తేనే మానవాళికి ఊపిరి, ఊరట.
Also read: లంకలో అఖిలపక్ష ప్రభుత్వం