మనిషి జీవితమొక సవాల్
అడుగడుగునా ఎదురయ్యే సమస్యలు ఎదుర్కొంటూ
అలుపెరుగని పోరాటం చేస్తూ
ఎప్పటికప్పుడు విజేతగా నిలుస్తూ
జీవితం సాగిస్తున్నాం అవిశ్రాంతంగా.
ఆదిమనాటి మానవుడి ఆహార సంపాదన మొదలు
చంద్రుడిమీద నివాసం ఏర్పరచుకునే ప్రయత్నం వరకు
ప్రతీదీ పరిసరాల మీద పట్టు సాధించే ప్రయత్నం
అభీష్టసిద్ధికి అడవులు, కొండలు మింగేస్తున్నాం
ఉప్పెనలు, బాంబులు మనల్ని భయపెట్టే రోజులు పోయాయ్.
కంటికి కనిపించని సూక్ష్మక్రిమి కరోనా
తేలికగా తీసుకునే తుమ్ము, దగ్గు రూపంలో
చైనాలోని ఒక నగరం నుండి బయలుదేరి
విశ్వవ్యాపియై విశ్వరూపంతో జనాన్ని వణికిస్తూ
నిరాఘాటంగా జైత్రయాత్ర సాగిస్తూంది
మందులేని వ్యాధిగా వైద్యశాస్త్రానికి సవాలుగా నిలిచింది.
వేలాదిగా విగత జీవులవుతున్న మానవ జాతి
తరుణోపాయంకోసం ఒక్కటైంది
వ్యాధి లక్షణాల్ని, కారకాల్ని, నివారణ మార్గాల్ని
అన్వేషించడంలో ఒక్క త్రాటిపై నిలిచింది
ఒక్కరికోసం అందరు, అందిరోసం ఒక్కరనే భావన
ఆచరణలోకి తెచ్చింది మానవ సమాజం
ఆహారవిహారాల్లో నియమం పాటించక
సృష్టిమొత్తం తనకోసమే ఉన్నట్లు భావిస్తూ
సాటి జీవుల ప్రాణాలు హరిస్తూ
వికృతంగా ప్రకృతిని, సృష్టిని అతలాకుతలం చేస్తున్న మనిషి
మర్చిపోలేని దెబ్బకొట్టింది కరోనా.
తన పరిధిలో లక్ష్మణ రేఖ దాటకుండా బ్రతకాలని
ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే వినాశం తప్పదని
గుండెమీద పాదం పెట్టి గర్జించింది కరోనా
స్ఫూర్తిమంతమైన ప్రజా నాయకత్వం
అంకిత భావంతో పని చేసే సేవకులు
విధికి ఎదురీది జాతిని నిలుపగలరని నిరూపించింది కరోనా
ఒకవైపు మనిషి అల్పత్వాన్ని ఎండగడుతూ
మరోవైపు మనిషి ఔన్నత్యాన్ని ప్రస్ఫుటం చేసింది కరోనా
మానవజాతి సమస్తం విభేదాలన్నీ వదిలి
ఒకటిగా బ్రతకాల్సిన గుణపాఠాన్ని నేర్పింది కరోనా.
Also read: సంతోషం
Also read: శాంతి
Also read: మార్గదర్శి
Also readd: రాముడు
Also read: పురుషోత్తముడు