- ప్రీకాషనరీ, బూస్టర్ డోసులు తీసుకోవాలి
- మాస్కులు ధరించడం ప్రాథమక కర్తవ్యం
కరోనా వైరస్ వ్యాప్తి మళ్ళీ పెరుగుతోంది. జూన్ తొలివారం నుంచి మొదలైన ఈ ఉధృతి రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. దేశంలో తాజాగా కొత్తగా నమోదైన కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీస్ వరకూ కరోనాబారిన పడడం మళ్ళీ మొదలైంది. క్రికెటర్ విరాట్ కోహ్లీ, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే, గుజరాత్ ఆరోగ్య శాఖా మంత్రి రుషికేశ్ పటేల్ మొదలైనవారు అందులో ఉన్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జాగ్రత్తలు పాటించకుండా, నిబంధనలను గాలికొదిలేస్తే కరోనా చుట్టుముడుతోందని అర్థం చేసుకోవాలి. కరోనా వైరస్ కు అమీర్ -గరీబ్ వ్యత్యాసాలు ఎందుకుంటాయి? జాగ్రత్తలను పాటించడం, వ్యాక్సిన్లు వేసుకోవడం ఎంత ముఖ్యమో పరీక్షలు పెంచాల్సిన అవసరం కూడా ఉంది. పరీక్షలలో వచ్చే ఫలితాలలో వ్యత్యాసం ఉంటోంది. దీనిని అధిగమించాల్సి ఉంది. ఉదాహరణకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు ఉదయం చేసిన యాంటీజెన్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది, సాయంత్రం చేసిన ఆర్టీపీసీఆర్ పరీక్షలో నెగటివ్ వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రుల విషయంలోనే ఇలా ఉంటే, సామాన్యుల పరిస్థితి ఏంటి?
Also read: నాద యోగ దినోత్సవం
మహానగరాలలో వేగంగా వ్యాప్తి చెందుతున్న వైరస్
గత కొన్ని వారాలుగా దిల్లీ, ముంబయి, కోల్ కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ మొదలైన నగరాల్లో కొత్త కేసులు భారీగానే వెలుగుచూస్తున్నాయి. తెలంగాణలోనూ ఉధృతి పెరుగుతోంది. మంగళవారం ఒక్కరోజే 400కు పైగా కేసులు పెరిగాయి. వాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా, వినియోగంలో ప్రజలు అశ్రద్ధ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రీకాషస్, బూస్టర్ డోసులు తీసుకున్నవారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. వృద్ధులు, చిన్నపిల్లలకు సంబంధించి వ్యాక్సినేషన్ నిష్పత్తి ఇంకా పెరగాల్సి ఉంది. జనసమ్మర్దన ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో వ్యాప్తి పెరుగుతోంది. ముఖ్యంగా పెద్ద నగరాలు, మెట్రో నగరాల్లో వ్యాప్తి వేగం ఎక్కువగా ఉంటోంది. మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, జనసమూహాలకు దూరంగా ఉండడం, చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం మొదలైనవి కీలకమని పదే పదే చెబుతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరించడం అరాచకం.
Also read: ‘మహా’సంక్షోభం
జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి
కేసులు పెరుగుతున్న వేళ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. వీటితో పాటు రోగనిరోధకశక్తిని పెంచుకోవడం ఎంతో అవసరం. యోగ, ధ్యానం, శారీరక వ్యాయామం, నడక, పరుగు మొదలైన వాటిని క్రమంగా సాధన చేస్తూ పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. శరీరాన్ని, మెదడును శ్రమపెట్టడం ఎంత ముఖ్యమో, వాటికి తగినంత విశ్రాంతిని ఇవ్వడం అత్యంత ముఖ్యమని న్యూరాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పండ్లు, ఆకుకూరలు, మాంసకృత్తులు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. ఆహారంలో సమతుల్యతను పాటిస్తూ ఉండాలి. ఒత్తిడిని తగ్గించుకొనే మార్గాలను అవలంబించాలి. రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్లు కలిగిన ఆహారాన్ని తీసుకోవడంలో శ్రద్ద పెట్టాలి. ఇవ్వన్నీ పాటిస్తే కరోనా వైరస్ నుంచి రక్షణ పొండడమే కాక, మిగిలిన అనారోగ్య సమస్యలు దరిచేరవని వైద్యులు, శాస్త్రవేత్తలు చేసే సూచనలను గౌరవిద్దాం. వైరస్ ముప్పును తగ్గించుకోవాలంటే, తప్పించుకోవాలంటే నిపుణులు మాటలను పాటించడమే శిరోధార్యం.
Also read: ఇదేమి ఆగ్రహం?