- ఒలింపిక్స్ రద్దు ఆలోచనలో జపాన్ ప్రభుత్వం
- రద్దుకాలేదంటున్న జపాన్ ఒలింపిక్ సంఘం
జపాన్ రాజధాని టోక్యో వేదికగా 2020 ఒలింపిక్స్ నిర్వహించాలని ఏముహూర్తాన అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం నిర్ణయించిందో కానీ..కరోనా అరిష్టం ఇంకా వెంటాడూతూనే ఉంది.
వాస్తవానికి 2020 జులై 24న ప్రారంభంకావాల్సిన ఈ క్రీడాసంరంభాన్ని కరోనా దెబ్బతో ఏడాదిపాటు వాయిదా వేశారు. 2021 జులై నుంచి నిర్వహిస్తామంటూ జపాన్ ఒలింపిక్ సంఘం అధికారికంగా ప్రకటించింది. అయితే…కరోనా సంవత్సరం పోయి…కొత్త ఏడాది వచ్చినా పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడలేదు. పైగా జపాన్ వ్యాప్తంగా కరోనా మూడవ వేవ్ ప్రారంభమై అక్కడి పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.
3,45000 కరోనా కేసులు
ప్రజారోగ్యానికి, క్రమశిక్షణకు మరో పేరుగా నిలిచే జపాన్ ను గత ఏడాదికాలంగా కరోనా వైరస్ కృంగదీసింది. అక్కడి ప్రజలకు, ప్రభుత్వానికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.
Also Read : ఖాళీ స్టేడియంలోనే చెన్నై వేదికగా టెస్టులు
తాజాలెక్కల ప్రకరం జపాన్ లో మొత్తం 3 లక్షల 45వేల మందికి కరోనా సోకింది. ఇప్పటికే 4వేల 700 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. పైగా జపాన్ వ్యాప్తంగా కరోనా మూడో వేవ్ ప్రారంభమయ్యింది. దేశవ్యాప్తంగా కరోనా నిరోధక వ్యాక్సిన్ ఇచ్చే పనిలో జపాన్ ప్రభుత్వం తలమునకలై వుంది. ఇదే సమయంలో ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ నిర్వహణ తలకుమంచిన భారంగా, అనవసరపు తలనొప్పిగా మారింది.
2021 జులై 24 న ప్రారంభంకావాల్సిన ఒలింపిక్స్ ను రద్దు చేసి…2032 ఒలింపిక్స్ కు ఆతిథ్యమివ్వాలని జపాన్ ప్రభుత్వం భావిస్తున్నట్లు వార్తలు బయటకు వచ్చాయి. 2020 ఒలింపిక్స్ ను రద్దు చేసినట్లు కూడా ప్రచారం ప్రారంభమయ్యింది.
ఒలింపిక్స్ రద్దు నిజమేనా?
కరోనా మహమ్మారి కారణంగా ఒలింపిక్స్ ను రద్దు చేయాలని జపాన్ ప్రభుత్వం నిర్ణయించినట్లు వార్తలు జోరందుకొన్నాయి. జపాన్ సంకీర్ణ ప్రభుత్వంలోని ఓ సీనియర్ సభ్యుడే ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించినట్లు ద టైమ్స్ వెల్లడించింది. 2032లో మరోసారి గేమ్స్ నిర్వహణ హక్కులు సొంతం చేసుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నట్లు ఆ పత్రిక తెలిపింది. అయితే ఈ వార్తలపై ఒలింపిక్ గేమ్స్ నిర్వాహక సంఘం మాత్రం పెదవి విప్పడం లేదు. మరోవైపు.. ఈ ఏడాది జులై 24న గేమ్స్ ప్రారంభం కావాల్సి ఉంది. గతేడాదే జరగాల్సిన గేమ్స్ ను కరోనా కారణంగా ఈ ఏడాదికి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే గేమ్స్ జరుగుతాయా లేదా అన్న అంశంతో ఏమాత్రం సంబంధం లేకుండా తాము మాత్రం సన్నాహకాలు కొనసాగిస్తామని ఆస్ట్రేలియా, అమెరికా ఒలింపిక్ కమిటీలు ప్రకటించాయి.
Also Read : కొహ్లీకి టెస్ట్ కెప్టెన్సీ అవసరమా?
దీనిపై అధికారిక సమాచారం ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ, టోక్యో ఆర్గనైజింగ్ కమిటీ, జపాన్ ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంటుందని అమెరికా ఒలింపిక్ కమిటీ స్పష్టం చేసింది.
గేమ్స్ వద్దే వద్దంటున్న జపాన్ ప్రజలు
నిజానికి ప్రపంచంలోని ఇతర సంపన్న దేశాలతో పోలిస్తే జపాన్‌లో కరోనా కేసులు తక్కువగా నమోదైనా.. ఈ మధ్య మళ్లీ కేసులు పెరగడంతో తన సరిహద్దులను మూసివేసింది. టోక్యోతోపాటు ఇతర ప్రధాన నగరాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఇక జపాన్‌లోని 80 శాతం మంది గేమ్స్ జరపొద్దనే అభిప్రాయపడటం విశేషం. విదేశాల నుంచి వచ్చే అథ్లెట్లు వైరస్‌ను మోసుకొస్తారని జపాన్ ప్రజలు భయపడుతున్నారు. అయితే గేమ్స్ ను ఇప్పుడు రద్దు చేసినా.. మళ్లీ వాటిని నిర్వహించే అవకాశం దక్కించుకునేలా వ్యూహాత్మకంగా ఈ రద్దు నిర్ణయాన్ని ప్రకటించాలని జపాన్ ప్రభుత్వం భావిస్తున్నట్లు టైమ్స్ రిపోర్ట్ వెల్లడించింది.
అందరికీ వాక్సిన్ తర్వాతే గేమ్స్
జపాన్ జనాభా 127 మిలియన్లమందికీ (12.7 కోట్లు) కరోనా నిరోధక వాక్సిన్ ఇచ్చిన తర్వాతే క్రీడల నిర్వహణ గురించి ఆలోచించాలని, అయితే రానున్న ఆరుమాసాల కాలంలో ప్రజలందరికీ వ్యాక్సినేషన్ ఇవ్వడం సాధ్యమేనా? అనే అంశం కూడా జపాన్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మొత్తం 14 బిలియన్ డాలర్ల బడ్జెట్ తో దేశవ్యాప్త వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ఫిబ్రవరి నుంచి చేపట్టనుంది.
12 బిలియన్ డాలర్ల వ్యయంతో టోక్యో ఒలింపిక్స్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఒకవేళ క్రీడలు రద్దు చేయాల్సి వస్తే జపాన్ ప్రభుత్వం, ఒలింపిక్స్ సంఘం,స్పాన్సర్లు భారీగా నష్టపోక తప్పదు.
Also Read : భారత్ కు ఇంగ్లండ్ పేస్ సవాల్
కరోనా వైరస్ తో ఉక్కిరిబిక్కిరవుతున్న జపాన్ ప్రజలకంటే క్రీడలు ఏమాత్రం ముఖ్యం కాదని, క్రీడల రద్దుతో వందలకోట్ల రూపాయలు నష్టమైనా తప్పదని నిపుణులు అంటున్నారు.
ఏదిఏమైనా…జపాన్ జనాభాలో ఎక్కువమంది అభిప్రాయానికి అనుగుణంగానే ఒలింపిక్స్ నిర్వహణ భవితవ్యం ఆధారపడి ఉంది. అయితే …జపాన్ జనాభాలో 80 శాతం మంది క్రీడల రద్దుకే మొగ్గుచూపడం ఇక్కడి కొసమెరుపు.