జపాన్ కొత్త ప్రధాని కిషిదా
నిన్నటి దాకా జపాన్ ప్రధానమంత్రిగా ఉన్న యోషిహిడే ఇటీవలే ఆ పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారు. ఆ వార్త అటు స్వదేశంలోనూ, ఇటు విదేశాలలోనూ సంచలనం రేపింది. ఆయన స్థానంలో ఫ్యుమియో కిషిదా ప్రధాని కానున్నారు. అధికార లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ (ఎల్ డి పి ) నూతన నాయకుడుగా కిషిదా ఎంపికయ్యారు. పలువురు ఈ పదవికి పోటీపడినప్పటికీ, భారీ మద్దతు ఆయనకే లభించింది. ప్రధానమంత్రి పీఠంపై కూర్చోడం ఇక లాంఛనమే అని తెలుస్తోంది.
Also read: మోదీ అమెరికా పర్యటనలో మోదం
కాడి వదిలేసిన యోషీహిడే
యోషీహిడే తప్పుకున్న విధానం ఆలోచనాత్మకమే. ఆయన వయస్సు 72 ఏళ్ళు. వైద్య విధానం అత్యాధునిక రూపంతో ముందుకు వెళ్తున్న ఈ కాలంలో అది పెద్ద వయస్సు కాదు. ఆ వయస్సు దేశాధినేతలు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా కోవిడ్ విజృంభణను అడ్డుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందడం, వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగడం, అటువంటి క్లిష్ట సమయాల్లో ఒలింపిక్స్ నిర్వహించడం, మొత్తంగా ప్రజల్లో వ్యతిరేకత తీవ్రస్థాయిలో పెరగడం, పనితీరుపై జరిగిన తాజా సర్వేలో రేటింగ్ 30శాతం తగ్గిపోవడం మొదలైన కారణాలతో ప్రధానిగా కుర్చీలో కూర్చోడానికి ఆయన మనసు సమ్మతించలేదు. ఇటు ప్రజల్లోనూ, అటు పార్టీలోనూ గౌరవం తగ్గుముఖం పట్టిన వేళ యోషీహిడే కాడి వదిలేశారు. ఆయన ప్రధానమంత్రి పదవిని చేపట్టి పట్టుమని ఏడాది కూడా పూర్తవ్వలేదు.జపాన్ కు సుదీర్ఘ కాలంపాటు ప్రధానిగా పనిచేసిన షింజో అబే అనారోగ్య కారణాలతో గత ఏడాది ఆగస్టులో ప్రధాని బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో హిడే బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవిని చేపట్టిన కాలానికే జపాన్ పలు సవాళ్ళను ఎదుర్కుంటోంది. వెంటాడుతున్న ఆ సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కోలేక పోగా, మరింతగా విఫలమయ్యారు. ఇబ్బడి ముబ్బడిగా కరోనా కేసులు పెరుగుతున్న వేళ రోగులను చేర్చుకొనే పరిస్థితులు ఆస్పత్రులకు లేవు. చికిత్స పొందలేక వాళ్ళందరూ వెనక్కి వెళ్లిపోవాల్సి రావడం అత్యంత ఘోరమైన విషయం. కరోనా కోరల్లో చిక్కుకొని ప్రజలు విలపిస్తున్న తరుణంలో ఒలింపిక్స్ నిర్వహించడంపైన తీవ్ర వ్యతిరేకత రావడమే కాక, నిర్వహణలోనూ ప్రభుత్వం వైఫల్యం చెందిందనే విమర్శలు చుట్టుముట్టాయి.
Also read: మహాయశస్వి ఎస్పీ
ప్రజావ్యతిరేకత ముమ్మరం
ఇంత తక్కువ సమయంలో అంత ప్రజావ్యతిరేకతను మూటకట్టుకున్న నాయకుడుగా యోషీహిడే సుగా ముద్ర వేయించుకోవడం దురదృష్టకరం. కరోనా కాటుకు ప్రధాని పదవిని పోగొట్టుకున్న నేతగా చరిత్రలో నిలిచి పోయారు. జపాన్ కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోయే ఫ్యుమియో కిషిదా 64సంవత్సరాల వయస్సులో ఉన్నారు. గతంలో విదేశాంగ మంత్రిగా పనిచేశారు.ఎల్ డి పి నేతగా తను ఎంపికైన విధానాన్ని చూస్తే, ఆ పార్టీలో అతనికి మంచిబలమే ఉన్నట్లు కనిపిస్తోంది. రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచే వచ్చారు. న్యాయశాస్త్రాన్ని అధ్యయనం చేశారు. సుమారు మూడు దశాబ్దాల నుంచి రాజకీయ క్షేత్రంలో ఉన్నారు.విదేశాంగ మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన పేరు కూడా ఉంది. అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను చరిత్రాత్మక హీరోషిమాకు రప్పించడంలో కీలక పాత్ర పోషించారు. తోషిహీరోను పార్టీ ప్రధానకార్యదర్శిగా ఎంపిక చేయడాన్ని వ్యతిరేకిస్తూ మంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. పాలసీ రీసర్చ్ కౌన్సిల్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నారు. పార్టీ అధినాయకత్వాన్ని చేపట్టడానికి ఈ పదవి గొప్ప మెట్టుగా ఉపయోగపడుతుందని భావించారు. అతను ఆశించినట్లే, ఈరోజు అధినాయకత్వాన్ని అందుకున్నారు. అత్యున్నతమైన ప్రధానమంత్రి పదవి కూడా ఎదురుగానే ఉంది. పార్టీలో వర్గపోరు కూడా ఉంది.” కిషీదా ఆన్నీ బాగుండే ప్రశాంత సమయాల్లో పనిచేయగలడు కానీ, క్లిష్ట పరిస్థితుల్లో కాదు” అని ఉప ప్రధాని తారా అశో గతంలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు దేశం అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఫ్యుమియో కిషిదా ప్రధానమంత్రి పదవిని చేపట్టబోతున్నారు. తారా చేసిన వ్యాఖ్యలను రుజువు చేస్తారా? సవాళ్ళను అధిగమిస్తారా? కొద్దికాలంలోనే తేలిపోతుంది. 2020లో యోషీహిడే ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్న సమయంలో కిషీదాకు మంత్రి పదవిని కేటాయించకుండా పక్కన కూర్చోపెట్టారు. కాలం అనుకూలించి, కిషీదా ఏకంగా ప్రధానమంత్రి పదవికే నేడు ఎంపికయ్యారు.
Also read: ఉత్తరకుమారుల విన్యాసం, ఉత్తరాంధ్ర విషాదం
ముళ్ళ కిరీటం
పార్టీలో యోషీహిడే – కిషీదా రెండు వర్గాలు ఉన్నాయని అర్ధమైపోతోంది. ఈ వర్గపోరు భవిష్యత్తులో ఎటుతీసుకెళ్తుందో చూడాలి. జపాన్ -యు ఎస్ బంధాలను మరింతగా బలోపేతం చేసుకోవడం కూడా అవసరం. రక్షణ రంగంలో స్వయంశక్తిని సాధించడం కూడా కీలకం. చైనా కదలికలను,వ్యూహ ప్రతివ్యూహాలను దృష్టిలో పెట్టుకొని ఇండో -పసిఫిక్ అంశంలో చురుకుగా వ్యవహారించాల్సి ఉంటుంది. తైవాన్ అంశంలోనూ ప్రగతి సాధించాల్సి వుంది. తైవాన్, హాంగ్ కాంగ్ పై చైనా ప్రభావం బలీయంగానే ఉంది. ‘క్వాడ్’లో జపాన్ కూడా సభ్యత్వ దేశం. అభివృద్ధి చెందిన దేశంగా జి 8, జి 4 మొదలైన కూటములలోనూ సభ్యురాలుగా ఉంది. ఆర్ధికంగా ప్రపంచంలో చాలా ప్రముఖ స్థానం కలిగి ఉంది. సాంకేతిక, మెషినరీ రంగాల్లో అగ్రగామిగా ఉంది. ఇరుగుపొరుగు దేశాలైన రష్యా, దక్షిణ కొరియా, చైనా, తైవాన్ లతో భూభాగ విభేదాలు ఉన్నాయి. భారతదేశంతో సత్ సంబంధాలే ఉన్నాయి. ఈ ద్వీప దేశానికి కొత్తగా ప్రధాని కాబోతున్న ఫ్యుమియో కిషిదాకు పాలన నల్లేరుపై బండి నడక కాదు. దేశంలోని అంతర్గత సమస్యలను పరిష్కరించుకోవడం,పార్టీలోనివర్గపోరును ఎదుర్కోవడం, విదేశాంగ విధానంలో కొత్త పుంతలు తొక్కడం మొదలైనవన్నీ ఆయన ఎదురుగా ఉన్న బాధ్యతలు. షింజే అబే వలె దేశాన్ని సుదీర్ఘకాలం పాలిస్తారని ఆశిద్దాం. భారత్ బంధాలను ద్విగుణీకృతం చేస్తారని ఆకాంక్షిద్దాం. జపాన్ గౌరవాన్ని కాపాడుతారని విశ్వసిద్దాం. గత పాలకుల వైఫల్యాల నుంచి గుణపాఠాలు నేర్చుకొని సుపరిపాలన అందించాలని అభినందనలు అందిద్దాం.
Also read: అమరశిల్పి అక్కినేని