నాన్-స్ట్రయికర్ ఎండ్ లో ఉన్న బ్యాటర్ ను రనౌట్ చేయడంపై వివాదం
ఇంగ్లండ్ పై భారత మహిళల జట్టు 3-0 స్కోరుతో ఘనవిజయం
భారత మహిళా క్రికెటర్ ఆల్ రౌండర్ దీప్తి శర్మ ఇంగ్లండ్ కు చెందిన చార్లొట్ డీన్ ను రనౌట్ చేయడం పెద్ద వివాదంగా చెలరేగుతున్నది. క్రికెట్ ప్రపంచ ప్రముఖులు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. తాను బౌల్ చేయకముందే క్రీజు దాటి ముందుకు వెళ్ళిన బ్యాటర్ ను ఔట్ చేయడానికి వెకెట్టు పడగొట్టడం అన్నది నిబంధనల ప్రకారం సవ్యమైనదే. కానీ క్రికెట్ స్ఫూర్తి ప్రకారం అభినందనీయం కాదు.
ఈ విధంగా క్రీజు దాటి బయటకు వెళ్ళిన బ్యాటర్ ను వికెట్టు పడగొట్టి అవుట్ చేయడాన్ని మన్ కడ్ ట్రిక్ అంటారు. వినూ మన్ కడ్ అనే పాతతరం ఆల్ రౌండర్ బౌలు చేస్తున్నప్పుడు ఆస్ట్రేలియాకు చెందిన బిల్ బ్రౌన్ క్రీజు దాటి బయటకు వెళ్ళడంతో స్టంప్స్ ను బాలుతో కొట్టాడు. బౌల్ చేయకుండా స్టంప్స్ ను కొట్టడం వల్ల నిబంధన ప్రకారం బ్రౌన్ అవుటైనాడు. అప్పటి నుంచి ఆ విధంగా అవుట్ చేయడాన్ని వినూ మన్ కడ్ విధానంగా పిలుస్తున్నారు.
సాధారణంగా బౌలర్ బౌలు చేయడానికి సిద్ధమయ్యేటప్పటికి తన వైపున ఉన్న బ్యాట్స్ మన్ క్రీజు దాటి ఉంటే స్టంప్స్ ను కొడతానంటూ బెదిరించి చిరునవ్వుతో హెచ్చరించడం రివాజు. అంతే కానీ స్టంప్స్ ను కొట్టి అవుటు చేయడం సర్వసాధారణంగా జరగదు. కానీ ఆ విధంగా అవుటు చేయడంలో తప్పు లేదని ఈ వారంలో అంతర్జాతీయ క్రికెట్ కంట్రోల్ బోర్డు కూడా నిర్ణయించింది. నాన్ –స్ట్రైకర్ ని రనౌట్ చేయడం సరైన చర్యేనని నిర్దారించింది. అన్యాయమైన పద్ధతుల జాబితా నుంచి ఈ విన్యాసాన్ని రనౌట్ జాబితాలో చేర్చింది. వసీం జాఫర్, వీరేంద్ర సెహవాగ్, తాబ్రాయిజ్ షమ్సీ, మాంటే పనేసర్ వంటి సీనియర్ ఆటగాళ్లు దీప్తి శర్మ చేసిన పనిని సమర్థించారు. ఆ విధంగా అవుట్ చేయడం అన్యాయమంటూ కొంతమంది సీనియర్లు తప్పుపట్టారు. ‘ఇది క్రికెట్ కాదు. క్రికెట్ ఆడినవారు ఎవ్వరూ ఈ విధంగా అవుట్ చేయడాన్ని సమర్థించరు’ అంటూ బిల్లింగ్స్ విమర్శించారు.
భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన మూడు మ్యాచ్ ల సిరీస్ లో చివరి మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ బౌల్ చేయాలని నిర్ణయించుకున్నారు. 169 పరుగులు చేసిన ఇండియా ఒక మోస్తరు ఆట ప్రదర్శించింది. 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించవలసిన ఇంగ్లండ్ రేణుకాసింగ్ బౌలింగ్ ధాటికి కకావికలై ఒక స్థాయిలో ఏడు వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. రేణుక 29పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకున్నది. కానీ చివరలో ఇంగ్లండ్ కెప్టెన్ అమీ జోన్స్ (28), చార్లొట్ డీన్ (47) ధాటిగా ఆడుతూ గెలుపు బాటలో ఉన్నారు. ఆ దశలో డీన్స్ ని దీప్తి రనౌట్ చేసింది. దీనిని తొండి ఆట అని అంటున్నారు కొందరు. మొత్తం మీదికి భారత్ జట్టు నిబ్బరంగా ఆడి మూడో మ్యాచ్ కూడా గెలుచుకుంది. సీరీస్ ను భారత జట్టు 3-0 స్కోరుతో కైవసం చేసుకున్నది.