Wednesday, January 22, 2025

ఇష్టంలేకుండానే కొనసాగుడా…?

ఏదో మాటవరసకన్న మాటలు ఇంత దుమారానికి దారితీస్తాయని ఆయన ఊహించి ఉండరు. ఊహించినా ఆయన చెప్పదలచుకున్నది చెప్పకమానరు… అనదలచింది అనకా మానరు. ఆయన మాటలకు, వ్యాఖ్యలకూ ఇతరుల సంగతి ఎలా ఉన్నా ఆయనపై దాడికి కాచుకుకూర్చున్న ప్రతిపక్షాలు వాటిని ఆయుధాలుగా చేసుకొని ఎదురుదాడికి దిగాయి. సామాజిక మాధ్యమాలు, ప్రసార మాధ్యమాలు చర్చలతో హోరెత్తిత్తాయి.

తెలంగాణ ముఖ్యమంత్రి పదవి మార్పిడిపై వస్తున్న ప్రచారానికి చుక్క పెట్టే యత్నంలో భాగంగా తమ పార్టీ ప్రజాప్రతినిధులను, ఇతర నాయకుల ప్రకటనలు కట్టడి చేసే క్రమంలో ముఖ్యమంత్రి పదవి నా ఎడమ కాలి చెప్పుతో సమానం అన్నకల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) వ్యాఖ్యలు రకరకాల వ్యాఖ్యానాలకు దారితీశాయి. ఇలాంటివి కొత్తకాదు. ఆయనంతలా కాకపోయినా పలానా పదవి తృణప్రాయం, గడ్డిపోచతో సమానం లాంటి ప్రకటనలు చేసిన, చేస్తున్న వారూ ఉన్నారు. కానీ కేసీఆర్ మాటల్లో చెప్పు అభ్యంతరకరంగా తోచిందంటూ ప్రతిపక్షీయులు విమర్శలకు పదును పెట్టారు. ముఖ్యమంత్రి పదవిని ఎడమకాలి చెప్పుతో పోలుస్తూనే ఏడేళ్లుగా అందులో కొనసాగడం, మరో పదేళ్లు ఉంటానని చెప్పడం విడ్డూరంగా ఉందని అంటున్నారు. వాస్తవానికి కేసీఆర్ పదవులను తేలికగా తీసుకొని వివిధ సందర్భాలలో అలవోకగా రాజీనామా చేసిన సంగతి తెలియంది కాదు.

ఆ వ్యవస్థకే అవమానం

ముఖ్యమంత్రి పదవిని ఎడమకాలి చెప్పుతో పోలుస్తూ చేసిన వ్యాఖ్య ఆయన వ్యక్తిగతానికి సంబంధించినది కాదని, దేశంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రి పదవినే కించపరిచేలా ఉందని విమర్శలు వస్తున్నాయి. గ్రామ స్థాయి పదవులకోసం ఉవ్విళ్లూరుతున్న సమయంలో అంత ఉన్నతమైన పదవిని తేలికగా తీసుకోవడం ఆయన ఆత్మవిశ్వాసానికి నిదర్శనం కావచ్చు కానీ, ఆ పదవి కోసమే పడరాని పాట్లతో పాదయాత్రలు చేసిన వారిని తక్కువ చేసినట్లు కాదా? అనీ అంటున్నారు. కొందరు నాయకులు పాదయాత్రలు చేసిఆ పీఠం సాధించుకున్న సంగతి తెలిసిందే.

కేసీఆర్ ఉన్నతి ముందు ఆ పదవి అంత చిన్నదైనప్పుడు దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తామన్న మాటను ఎందుకు దాటేశారని ప్రశ్నలు వస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 1990 దశకంలో చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో స్థానం, పాలనావ్యవస్థలో సరైన ప్రాధాన్యం లభించలేదన్న కారణంతో రాజీనామా చేసి పార్టీ పెట్టిన వారికి సీఎం కుర్చీ ఇప్పుడు అలా కనిపిస్తోందా? అని విపక్షీయులు అంటున్నారు. ఆయన దృష్టిలో సీఎం పదవి వామపాద రక్ష కావచ్చు కానీ, ఆయనకు ఓటేసిన వారికి, వేయని వారికి కూడా ఆయన ముఖ్యమంత్రి అనే సంగతి మరచినట్లున్నారనీ, ఆ పదవిని గౌరవించినవారందరినీ అగౌర పరచడంలాంటిదేననీ అంటున్నారు.

Also Read: మేయర్ పీఠం…పావులు కదుపుతున్న టీఆర్ఎస్

అభద్రతాభావం?

తన పార్టీ అధ్యక్ష పదవిని అలా పోల్చగలరా?అని ప్రతిపక్షాలు నిలదీస్తున్నాయి. రాష్ట్రంలో ఎన్నో రాజకీయ పక్షాలు ఉంటాయి. వాటికి అధిపతులు ఉంటారు. కానీ వాటికంటే రాజ్యాంగ పదవి ఉన్నతమైనదని ప్రత్యేకించి చెప్పనవసరంలేదు. అది ఆయనకూ తెలియనిది కాదు. అయినా అలా వ్యాఖ్యానించారంటే ఆయనను ఏదో అసహనం, అసంతృప్తి వేధిస్తోంది. అభద్రత వెంటాడుతోంది`అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

రాష్ట్రం ఆగమై పోతుందా!

తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టడంలో వ్యక్తిగత స్వార్థం కంటే రాష్ట్ర ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయని చంద్రశేఖరరావు తరచూ చెబుతుంటారు. ఇటీవలి పార్టీ కార్యవర్గ సమావేశంలోనూ అదే చెప్పారు.కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఆగమై పోతుందనే భయంతోనే ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాను అని చెప్పుకొచ్చారు. అనుభవరహితుల చేతిలో కొత్త రాష్ట్రం ఆగమై పోతుందన్న మాట నిజమే అనుకుంటే, రాష్ట్ర ఉద్యమం, ఎన్నికల ప్రచారం సమయంలో దళితుడిని ముఖ్య మంత్రిని చేస్తా అనే ప్రకటన చేసేటప్పుడు ఈ విషయం గుర్తుకు రాలేదా? అంటున్నారు.

ఎక్కడైనా కానీ…..

రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకే తాను సీఎంగా కొనసాగుతున్నట్లు కేసీఆర్ చెబుతున్న మాటలకు ప్రజాప్రతినిధుల నుంచి కానీ, పార్టీ శ్రేణుల నుంచి కానీ అభ్యంతరం వ్యక్తం కాలేదంటే తమలో అంతటి సమర్థవంతులు లేరని పరోక్షంగా అంగీకరించినట్లయిందని విశ్లేషకులు అంటున్నారు.అందుకే కేసీఆర్ అంతటి దక్షత గల ఆయన తనయుడు తారక రామారావును తరువాతి ముఖ్యమంత్రిగా ప్రతిపాదించిన వారిపైనా కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారట. తన ఆరోగ్యం సలక్షణంగా ఉన్నాఇలాంటి ప్రతిపాదనలు, ప్రచారాలు ఎందుకు తెస్తున్నారని కూడా నిలదీశారట. మరో పదేళ్ల దాకా తనను కదిపేవారు లేరని స్పష్టం చేశారు. చివరికి కన్నకుమారుడికైనా పదవీ త్యాగం చేసే ప్రసక్తి లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. అయితే కేటీఆర్ కు సీఎం పదవి ప్రచారాలు,ప్రతిపాదనల వెనుక వ్యూహం ఉందని, జననాడిని తెలుసుకునేందుకు కేసీఆర్ ఇలా చేయించి ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read: ముఖ్యమంత్రి పదవిపై స్పష్టత, కేసీఆర్ రాజకీయ విజ్ఞతకు నిదర్శనం

అభ్యర్థులు నామమాత్రం

ఎన్నికలలో అభ్యర్థులను బట్టి కాకుండా తమను చూసి ఓట్లు వేసి గెలిపించారని ధీమా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖరరావు వరకూ ఉంది. కొన్ని సందర్భాలలో అలాంటి వ్యాఖ్యలు చేశారు కూడా. అందుకేనేమో వారిని తక్కువ చేసి మాట్లాడినా, కర్రుకాల్చి వాత పెడతామన్నా మౌనం వీడరు. ఒక ముఖ్యమంత్రికి అవమానం ఎదురైతే అది రాష్ట్ర ప్రజలందరికీ వర్తించినట్లే, ఎన్నికైన ప్రజాప్రతినిధుల అవమానం ఆయా నియోజకవర్గాల ప్రజలు…ముఖ్యంగా ఓటర్లకు సంబంధించినది కాదా అన్నది ప్రశ్న.

ప్రధాని నరేంద్రమోదీ ఇటీవలి కాలంలో గడ్డంతో కనిపిస్తుండడంతో తర్వాతి ప్రధాని ఎవరు అనుకుంటున్నప్పుడు తప్పుపట్టని వారు సీఎంగా కేటీఆర్ ప్రతిపాదన పట్ల విపక్షాలు ఎందుకు రాద్దాంతం చేస్తున్నాయని అధికారపక్షం నాయకులు ప్రశ్నించడం కొసమెరుపు.

Dr. Aravalli Jagannadha Swamy
Dr. Aravalli Jagannadha Swamy
సీనియర్ జర్నలిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles