- బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం
- మందుబాబుల వీరంగంతో మహిళల ఇక్కట్లు
- అనుమతి లేని డ్రోన్, డీజే సౌండ్స్ పై చర్యలు
సాధారణ పౌరులు ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రామగుండం కమిషనరేట్ పరిధిలో మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం పై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను పొడిగిస్తున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి మహిళల పట్ల ఆగడాలకు పాల్పడుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం సేవించి రోడ్లపైన అసభ్య పదజాలంతో మాట్లాడటం, ప్రజలకు ఇబ్బందిగా పరిణమిoచిoదని, మద్యం ప్రియుల ఆగడాలకు కళ్లెం వేయడంలో పాటు ప్రజల భద్రత రక్షణ కోసం నిషేధాజ్ఞలు కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నిషేధాజ్ఞలు మార్చి 15 వరకు కొనసాగుతాయని తెలిపారు. ఐపీసీ సెక్షన్ 188, హైదరాబాద్ నగర పోలీసు చట్టం, ఫసలీ నిబంధనలను అనుసరించి నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు.
Also Read: సింగరేణిలో ఎంఎల్సీ ఎన్నికల లొల్లి
డీజే, డ్రోన్ లపై నిషేధాజ్ఞలు పొడిగింపు:
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో డీజే సౌండ్ ల వినియోగంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలు పొడిగించినట్లు సి పి తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశామని అన్నారు. చిన్నపిల్లలు వృద్ధులు రోగులు, విద్యార్థుల విద్యాభ్యాసానికి భంగం కలగకుండా, శబ్ద కాలుష్యం నుంచి కాపాడేందుకు భారీ సౌండ్ లతో కూడిన డిజె ల వినియోగం పై నిషేధాజ్ఞలు విధించారు. వివిధ కార్యక్రమాల సందర్బంగా ప్రజల సమీకరణ, ప్రదర్శనల కోసం డీజే లను వినియోగిస్తున్నారని అయితే వివిధ కార్యక్రమాల నిర్వహణకు మైక్ సెట్ వినియోగం తప్పనిసరి అని అనిపిస్తే సంబంధిత డివిజన్ ఏసిపి ల అనుమతి పొందాలని సూచించారు. ఏయే ప్రాంతాల్లో ఏ మేరకు ఏ స్థాయిలో మైక్ సెట్ లు వినియోగించాలో నిబంధనలు అనుసరించాలని అన్నారు. ఈ నిషేధాజ్ఞలు మార్చి 15 వరకు కొనసాగుతాయని తెలిపారు. నిబంధనలు ఉల్లఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు
Also Read: రెండు నెలల్లో గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిద్ధం