నిత్యావసర వస్తువులు, వివిధ రంగాలకు సంబంధించి ధరలు పెరుగుదల, సుంకాల విధింపుతో వినియోగదారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆదాయ వ్యయాలకు లంగరు కుదరడంలేదు. పేదలు మజ్జిగలో నంజుకునే ఉల్లిపాయ నుంచి ఎగువ మధ్యతరగతిదారులు వాడే వాహనాల కు ఫాస్టాగ్ `జరిమాన` రుసుం దాకా భారంగా మారాయని ఆవేదన వ్యక్తమవుతోంది. సుంకాలు తగ్గించేంది లేదని ప్రభుత్వం స్పష్టం చేయడంతో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు దూసుకుపోతూ రవాణా ఖర్చు భారం వినియోగదారులకు బదిలీ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం, లీటర్ పెట్రోల్ ధర సుమారు రూ.93గా ఉంది. సుంకాలు అధికంగా ఉన్న రాజస్థాన్ లో లీటర్ పెట్రోలు ధర కొన్ని పైసల తేడాతో రూ.100కు చేరింది. .
గ్యాస్ `బండ`:
వంటగ్యాస్ ధర ఈ నెలలో రెండవసారి పెరిగింది. నిన్నటి (ఫిబ్రవరి 15) నుంచి పెరిగిన రూ. 50లతో సిలిండర్ ధర రూ. 821.50 కు చేరింది.కడచిన మూడు నెలల్లో సిలెండర్ ధర రూ. 200 పెరిగింది. డిసెంబర్ లో రెండు తడవులుగా రూ.100, గత నెలలో రూ.25, ఈ నెలలో రెండు విడతలుగా రూ. 75 పెరిగింది. ఒక వైపు పెట్రో ధరలు ఆకాశాన్ని దాటి దూసుకుపోతుండగా, తరచూ పెరుగుతున్న గ్యాస్ ధరలు సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా అంసంఘటితరంగ కార్మికులు, చిరుద్యోగులు, రోజువారీ కార్మికుల పరిస్థితి దయనీయంగా తయారవుతోంది. పెట్రో ధరల మాదిరిగానే గ్యాస్ ధరలను కూడా అంతర్జాతీయ మార్కెట్ ఆధారంగా సవరించే ప్రక్రియకు కసరత్తు జరుగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. అది అమలులోకి వస్తే పెట్రోలు, డిజిల్ ధరలు రోజువారీ పెరుతుగున్నట్లే గ్యాస్ `బండ` జనం నడ్డివిరుస్తుందని విశ్లేషకులు అంటున్నారు.
Also Read: ఇంధన ధరలతో కూర’గాయాలు’
వంటనూనెలు సలసల
ఇప్పటికే వంట నూనెల ధరలు పెరిగాయి. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నాడే నూనెలపై సుంకం పెరిగింది. ఉదాహరణకు, లీటర్ పామాయిల్ కు రూ. 4 పెరిగి నెల రోజుల్లోనే సుంకం రూ 14 కు చేరింది. ప్రత్యేకించి పామా యిల్,సన్ ఫ్లవర్ నూనెలపై అంతర్జాతీయ ధరల ప్రభావం పడుతోంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకోవలసి రావడమే ధరల పెరుగుదలకు కారణమని చెబుతున్నారు. ఇతర దేశాల నుంచి ఓడ రేవులకు వచ్చే నూనెలను విడిపించుకొని వచ్చే క్రమంలో పెరిగే రవాణా ఖర్చులు వినియోగదారులపై పడుతున్నాయి. దీని ప్రభావం చిల్లర ధరలపై పడింది. గృహ వినియోగదారుల నుంచి హోటళ్లు,ఇతర తినుబండారాల వ్యాపారులు పామాయిల్ ఎక్కువగా వాడుతుంటారు.
ఫాస్టాగ్ లేకుంటే ప్రయాణం భారం :
జాతీయ రహదారుల ప్రయాణాన్ని నగదు రహితంగా మార్చే క్రమంలో చేపట్టిన సంస్కరణలు వాహనదారులకు టోల్ ఫ్లాజా సుంకం పెనుభారంగా మారే ఆస్కారం ఉంది. జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాలు ఫాస్టాగ్ విధిగా కలిగి ఉండాలనే నింబంధన గత (ఫిబ్రవరి 15) అర్థరాత్రి నుంచి అమలులోకి వచ్చింది. ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి, ఇంధన ఆదాకు అన్ని రకాల ప్రయాణికుల, వస్తువాహనాలకు డిజిటల్ చెల్లింపును వర్తింప చేస్తూ ఈ చర్యలు తీసుకున్నట్లు కేంద్ర జాతీయ రహదారుల శాఖ ప్రకటించింది. ఫాస్టాగ్ లేని, ఉన్నా పనిచేయని వాహనాలకు టోల్ సుంకం రెండు రెట్లు వసూలు చేస్తామని తెలిపింది. అయితే, ఫాస్టాగ్ కొనుగోలు, వాటిలో ఎప్పటికప్పుడు డబ్బు వేసుకోవడం లాంటి వాటిపై చాలా మందికి సరైన అవగాహన లేకపోవడం కూడా అవి పనిచేయకపోవచ్చని, రవాణా విభాగాలు దీనిపై అవగాహన కలిగించేందుకు చొరవ చూపాలని వినతులు అందుతున్నాయి.
Also Read: బడ్జెట్ ఎఫెక్ట్ : గ్యాస్ సిలిండర్ పై సబ్సిడీ ఎత్తివేయనున్న కేంద్రం ?
ప్రయాణికుల పాట్లు :
కరోనా బెడద తగ్గుముఖం పడుతున్నప్పటికీ రవాణా సదుపాయం తగినంత స్థాయిలో కూడా పునరుద్ధరణ కాకపోవడం పట్ల ప్రయాణికులు ఆవేదన చెందుతున్నారు. బస్సులు పూర్తి స్థాయిలో నడడడంలేదు. జంట నగరాలతో పాటు దేశవ్యాప్తంగా అనేకచోట్ల ఎం.ఎం.టీ.సీ.లు పట్టాలకెక్కలేదు. రైల్వే శాఖ కొద్ది నెలలుగా వేగవంతం,రిజర్వేషన్లు గల రైళ్లను మాత్రమే నడుపుతూ సాధారణ ప్రయాణికులను పట్టించుకోవడం లేదని ఫలితంగా అధిక రుసుంతో బస్సుల్లో ప్రయాణించవలసి వస్తోందని వాపోతున్నారు. ఆ బస్సులు కూడా పరిమితంగానే ఉంటున్నాయని అంటున్నారు. ప్యాసింజర్ రైళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని చిరువ్యాపారులు, కూరగాయలు, పాలు, పెరుగు అమ్మకందారులు అంటున్నారు.
Also Read: అద్వితీయ ముఖ్యమంత్రి