దిల్లీ : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి నియామకం తొందరలోనే జరగనున్నది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల పరిశీలకుడు మానిక్కం ఠాగూర్ సుమారు 160 మంది సీనియర్ కాంగ్రెస్ నేతలతో జరిపిన సమాలోచనల సారాంశాన్ని ఇప్పటికే ఏఐసీసీలో సీనియర్ నాయకులకు సమర్పించారు. గురువారంనాడు పార్టీ అధినేత సోనియాగాంధీ, పార్టీ పూర్వాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఠాగూర్ నివేదికను పరిశీలించే అవకాశం ఉంది. ఇది వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ వ్యవహారాలను పర్యవేక్షించిన దిగ్విజయ్ సింగ్, గులాంనబీ ఆజాద్ వంటి వారిని కూడా సంప్రదించే అవకాశం ఉంది. మొన్నటి వరకూ తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో కలసి పని చేసిన ఏఐసీసీ ప్రతినిధి కుంతియా అభిప్రాయాన్ని సైతం పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది.
అందరినీ సంప్రదించిన మీదట నాలుగు పేర్లు ప్రతిపాదనలో మిగిలినట్లు సమాచారం. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, భట్టి విక్రమార్క, డి.శ్రీధర్ బాబులు మొన్నటి వరకూ పోటీలో ఉన్నారు. ప్రస్తుతానికి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి పేర్లను పరిశీలిస్తున్నారని తెలుస్తున్నది. వీరిలో రేవంత్ రెడ్డికి ఎక్కువ మంది మద్దతు తెలిపారనీ అభిజ్ఞవర్గాల భోగట్టా.
పీసీసీ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించే సంప్రదాయానికి కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఎప్పుడో స్వస్తి చెప్పింది. అన్నీ నియామకాలే. నియమించే ముందు సుదీర్ఘంగా సమాలోచనలు జరపడం, సాధ్యమైనంత ఎక్కువమందిని సంప్రతించడం ఆనవాయితీ. అదే తంతు జరుగుతోంది. ఇంత కష్టపడి సమాలోచనలు జరిపి కొత్త అధ్యక్షుడిని నిర్ణయించినప్పటికీ మరుసటి రోజు నుంచే అసమ్మతి ప్రారంభం అవుతుంది. అసమ్మతినేతలకు దిల్లీలో ఎవరెవరో సమర్థకులు ఉంటారు. కొత్తనేతకు కంటిమీద కునుకు లేకుండా చేస్తారు. వైఎస్ రాజశేఖరరెడ్డి వంటి గట్టి నాయకులు లభిస్తే కానీ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో కానీ, ఆంధ్రప్రదేశ్ లో కానీ భవిష్యత్తు ఉండదు.
ఇదీ చదవండి: కాంగ్రెస్ బతికి బట్టకడుతుందా?
తెలంగాణలో ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ లో తమకు ఇబ్బందికరంగా ఉంటే బీజేపీలోకి దూకడానికి సీనియర్ నేతలు కూడా సిద్ధంగా ఉన్నారు. అందుకనే అందరినీ కలుపుకొని పోతున్నట్టు అభిప్రాయం కలిగించడానికీ, అందరి చేతా పార్టీకి సేవలు చేయించుకుంటామని హామీ ఇవ్వడానికీ, అందరికీ పార్టీలో భవిష్యత్తు ఉంటుందని నమ్మబలకడానికీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయాలు రెండు ఇక్కడి నాంపల్లిలోఒకే రోడ్డు పైన ఎదురెదురుగా ఉండటం విశేషం. మార్టీ మార్పిడికి నాయకులు ఎక్కువ దూరం పోనక్కరలేదు.
మాణిక్కం ఠాగూర్ సమర్పించిన నివేదికను అధ్యయనం చేసి ఒక నిర్ణయానికి రావడంతో సోనియాగాంధీకి రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్, ఇతర సీనియర్ కాంగ్రెస్ నేతలు సహకరిస్తారని సమాచారం. ఈ నిర్ణయం ఒకటి, రెండు రోజులలో తీసుకుంటారనీ, తగిన సమయం, సందర్భం చూసి పేరు ప్రకటిస్తారనీ అంటున్నారు.
ఇదీ చదవండి: రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు ?