Thursday, November 7, 2024

కోలాహలంగా రామసేతు నిర్మాణం

రామాయణమ్ 178

సముద్ర తీరమునందు దర్భలు పరచుకొని సముద్రునకు నమస్కరించి  విశాలమైన బాహువులు తలగడగా చేసికొని రాముడు శయనించెను…మునుపు సీతమ్మకు తలగడగా ఏ బాహువు ఉండెనో ఆ బాహువే అది! అది సర్పశరీరమువలే యుండెను. ‌ఆ బాహువునకే పూర్వము రత్నకేయూరములు దండకడియాలు భుజకీర్తులు అలంకరింపబడియుండెను.

Also read: రావణుడి పనపున సుగ్రీవుడితో శుకుని రాయబారం విఫలం

నేను సముద్రమును దాటనైనా దాటవలెను లేదా మరణించవలెను అని దృఢముగా సంకల్పించుకొని యధాశాస్త్రముగా నియమము పాటించుచూ మౌనముగా సముద్రము దగ్గర రాముడు శయనించెను.

మూడు పగళ్ళు మూడు రాత్రులు గడచిపోయినవి. సముద్రుని అనుగ్రహము కలుగలేదు. నియమానుసారముగా రాముడు అర్చించినా సముద్రుని జాడలేదు.

రామునిలో సముద్రునిపై ఆగ్రహము కట్టలు తెంచుకున్నది…..‘‘లక్ష్మణా, ఈ లోకములో సామము చేత కీర్తికానీ, యశస్సుకానీ, విజయముకానీ పొందలేము. ఈ లోకము తీరే అంత! ఓర్పుగల నన్ను చూసి ఈ సముద్రుడు అసమర్ధుడు అనుకొనుచున్నాడు.

Also read: విభీషణుడిని లంకాధిపతిగా చేసిన రాముడు

ఇదే చూడు జగత్తును భస్మీపటలము చేయు అగ్నిహోత్రుని పుట్టించు నా బాణప్రయోగముతో ఈ జలధిని ఇంకింపచేసెదను. ఈ సముద్రములోని సకలజీవజాలమును, ప్రాణికోటిని నాశనము చేసెదను.

‘‘లక్ష్మణా నా విల్లందుకో. బాణములుతెమ్ము. ఈతని అంతు చూసెదను’’ అనుచూ క్రోధముతో కన్నుల విస్ఫులింగాలు రాలుచుండగా ప్రజ్వలించుచున్న ప్రళయకాలాగ్నివలే ఎవరికీ చూడశక్యము కాకుండ రామచంద్రుడు మహోగ్రరూపము దాల్చెను.

ధనుస్సు ఎక్కుపెట్టి నారిసారించి విడిచిన శ్రేష్ఠమైన బాణములు మహాతేజోపుంజములవలే పెద్దవేగముతో ప్రళయకాలపర్జన్యగర్జనలు చేయుచూ సముద్రమును చీల్చుకొంటూ వెళ్ళినవి. ఒక్కసారిగా కడలి కల్లోల తరంగములతో అల్లకల్లోలమాయెను. ధూమములు పైకెగసి, ప్రాణుల గుండెలవిసి ఏమిజరుగుతున్నదో అర్ధము కాని అయోమయములో సముద్రములో నివసించు సకల ప్రాణికోటి తల్లడిల్లిపోయెను.

Also read: తనను శరణు కోరినవారిని రక్షించి తీరెదనని పలికిన రఘుపతి

ఆ విలయమును వియత్తలమునుండి తిలకించు దేవతలు మునులు ‘వద్దు రాఘవా వద్దు’ అనుచూ ప్రాధేయపూర్వకముగా వినతులు సేసిననూ లక్ష్యపెట్టక దాశరధి మరియొక బాణమును సంధించి విడువబోగా లక్ష్మణుడు ధనుస్సును గట్టిగా పట్టుకొని ‘అన్నా వద్దు’ అనుచు వారించెను.

రామచంద్రుడది లక్ష్యపెట్టక ‘‘ఇదుగో బాణములతో వంతెన కట్టెదను. ఇదుగో బ్రహ్మాస్త్రము’’ అనుచూ సంధించి లాగుచుండగా భూమ్యాకాశములు బద్దలయిన శబ్దములు వచ్చి పర్వతములు తీవ్రముగా కంపించెను. లోకమంతా పెను చీకటులు కమ్మి వేసెను. గ్రహములు గతులు తప్పసాగినవి.

అప్పుడొక విచిత్రము జరిగినది…..

‘‘రఘురామా, శాంతం శాంతం’’ అంటూ సముద్రమధ్యం నుండి మేరు పర్వతము పైకి వచ్చినట్లుగా సాగరుడు బయటకు వచ్చెను.

Also read: విభీషణుడు స్వాగతించదగినవాడేనన్న రామచంద్రుడు

‘‘రామచంద్రా,  పంచభూతాలు వాటి స్వభావానికి అనుగుణంగా సంచరిస్తుంటాయి. ప్రకృతి నియమములు అనుల్లంఘనీయములు. నేను ఒకజలనిధిగా రూపు దిద్దుకొని అగాధమైన స్వభావము కలిగియున్నవాడను. అయినా నీకు, నీ సైన్యానికి బాసటగా నిలుస్తాను. నాలో జీవించే అపార ప్రాణ కోటికి అవరోధములు కలుగకుండా, వాటికి అపాయము కలుగకుండా మీరంతా నన్నుదాటే ఉపాయం చెపుతాను..

‘‘నీవు ఎక్కుపెట్టిన బ్రహ్మస్త్రాన్ని నా నీరు తాగి వేసి నన్ను ఇబ్బందిపెట్టే రాక్షసగణము ద్రుమకుల్యము అనే స్థలములోఉన్నారు. వారివైపు మరల్చు. నాకు సాంత్వన కలిగించు’’ అని ప్రార్ధించాడు….రాముడు అలాగే చేశాడు.

‘‘ఇక్ష్వాకుకులతిలకా, నీ సైన్యంలో నలుడు అనే వానరుడున్నాడు. ఆయన విశ్వకర్మ పుత్రుడు. ఆయనకు సేతు నిర్మాణసామర్ధ్యమున్నది. ఆయన నిర్మించిన సేతువును నేను ధరిస్తాను. మీకు శుభమగు గాక’’ అని చెప్పి అంతర్ధానమయ్యాడు.

సాగరుడి చేత గుర్తింపబడిన నలుడు రామునికి మొక్కి ‘‘స్వామీ, నా తండ్రి ఆశీస్సులవలన నాకు సేతునిర్మాణ విద్య తెలుసును.నేను నిర్మిస్తాను’’ అని ముందుకు వచ్చాడు.

‘‘సముద్రుడు అనుగ్రహించాడు కనుక, సేతువుకు వచ్చిన ప్రమాదమేదీ లేదు రామచంద్రా. “అడుగనిదే అహంకరించకూడదు” కదా, అందుకే నేను మౌనముగా యుంటిని’’ అని సవినయంగా రామునికి తెలిపినాడు సేతునిర్మాణకౌశలుడు నలుడు!

రాముని అనుజ్ఞ అయ్యింది. సేతువు మొదలయ్యింది.

Also read: విభీషణుడిని మిత్రుడిగా స్వీకరించమని రాముడికి హనుమ సూచన

ఎక్కడెక్కడి శిలలనూ వానరులు మోసుకు వస్తున్నారు. వాటిని అత్యంత నైపుణ్యంతో ఒకదానికొకటి అనుసంధానం చేస్తూ సముద్రతలము మీద పరుస్తున్నాడు నలుడు.

 అద్భుత రీతిలో నిర్మాణం సాగుతున్నది. శతయోజన విస్తీర్ణమున్న సముద్రానికి వడ్ఢాణములాగ తయారయ్యింది రామసేతువు.

విభీషణుడు వెనువెంటనే గదా పాణియై ఆకాశమార్గాన అవతలి తీరం చేరి సేతు రక్షణబాధ్యత చేపట్టాడు.

రామచంద్రమూర్తికి జయజయధ్వానాలు చేస్తూ కోలాహలంగా బయలుదేరింది రామదండు.

పైనుండి చూసేదేవతలకు ఆసైన్యం సముద్రుడికి అలంకరించిన కదిలే పూలదండలాగా కనిపిస్తున్నది.

 రంగురంగుల వానరభల్లూక సైన్యాలు సమరోత్సాహంతో రణన్నినాదాలు చేసుకుంటూ రామకార్యార్ధులై బయలుదేరారు.

NB

నలుడిని చూసి ఒకటి గమనించాలి. ” అడగనిదే అహంకరించకూడదు” అనే మాట మనము మరచిపోయి చాలాకాలమయ్యింది.

‘నేనంత, నేనింత’ అని performance appraisals వ్రాసుకునే రోజులివి..

నాయకుడు తన వద్ద ఉన్న వారిసామర్ధ్యాన్ని గుర్తించాలి. అసలు సామర్ధ్యాన్ని గుర్తించే నాయకుడెక్కడ ఈనాడు.

ఎవడికి వాడు గొప్పలు చెప్పుకునే వాడే.

Also read: మగువల విషయంలో శాపగ్రస్తుడు రావణుడు

వూటుకూరు జానకిరామారావు

V.J.Rama Rao
V.J.Rama Rao
వి. జానకి రామారావు ఆంధ్రా యూనివర్సిటి ఎమ్మెసీ. చిత్తూరులోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో చీఫ్ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. భగవద్గీత, రామాయణ, భారత, భాగవతాది గ్రంథాలపై వ్యాఖ్యాత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles