- ఇటుకలతో శాశ్వత నివాసాల నిర్మాణం
- మోదీ పదవీకాలం ముగిసేవరకు ఉద్యమం
- సాగు చట్టాలు రద్దుచేయాల్సిందేనంటున్న రైతు సంఘాలు
నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా దేశ రాజధాని దిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం సాగిస్తున్న రైతులు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. నాలుగు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఉద్యమాన్ని ఆయా రాష్ట్రాలకు విస్తరించాలని రైతు సంఘాల నేతలు యోచిస్తున్నారు. తద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
చట్టాల రద్దు తర్వాతే ఇళ్లకు వెళతాం:
సాగు చట్టాలపై కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే మోదీ ప్రభుత్వ పదవీకాలం ముగిసే వరకు పోరాటం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్న రైతు సంఘాలు నేతలు స్పష్టం చేస్తున్నారు. అందుకు తగిన ఏర్పాట్లు కూడా ముమ్మరంగా చేసుకుంటున్నారు. రాబోయే వేసవి, వర్షాకాలంలో ఇబ్బందులు పడకుండా ముందు జాగ్రత్తగా శాశ్వత నివాసాల నిర్మాణం చేపట్టినట్లు రైతులు తెలిపారు. ఇందులో భాగంగానే సరిహద్దుల్లో గుడారాలను తీసివేసి శాశ్వత నివాసాలు నిర్మించుకుంటున్నారు. దిల్లీ,హర్యానా మార్గంలోని టిక్రీ సరిహద్దు వద్ద ఇటుకలతో ఇళ్లు కట్టుకుంటున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో నిర్మాణాలు పూర్తయ్యాయి. రానున్న రోజుల్లో దాదాపు వెయ్యి నుంచి రెండు వేల ఇళ్లను నిర్మిస్తామని కిసాన్ సోషల్ ఆర్మీ నాయకుడు అనిల్ మాలిక్ స్పష్టం చేశారు. ఇళ్ల నిర్మాణంలో ఖర్చులు తగ్గించేందుకు రైతులే సొంతంగా నిర్మించుకుంటున్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి 20 వేల నుంచి 25 వేలు ఖర్చవుతున్నట్లు రైతులు తెలిపారు.
Also Read: ఢిల్లీలో గర్జించిన మహిళా రైతులు
సామాజిక మాధ్యమాలలో వైరల్ :
టిక్రీతో పాటు ఇతర ఢిల్లీ సరిహద్దుల్లోనూ శాశ్వత నిర్మాణాలను నిర్మిస్తామంటున్నారు. ఇటుకలు, సిమెంట్ కొనుగోలు చేసి రైతులే ఇళ్లను నిర్మించుకోవడం విశేషం. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. రైతు ఉద్యమానికి విపరీత ప్రచారం కూడా కల్పించాలని నిర్ణయించారు.
Also Read: అన్నదాత ఆగ్రహించి వందరోజులు
పురోగతిలేని చర్చలు:
సాగు చట్టాలపై కేంద్రం ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య ఇప్పటికే పలు దఫాలుగా జరిగిన చర్చల్లో ఎటువంటి పురోగతి లభించలేదు. చట్టాలను కొంతకాలం పాటు నిలిపివేస్తామని, వాటికి సవరణలు చేస్తామని చెబుతున్న కేంద్రం రైతుల డిమాండ్లను ఏమాత్రం పట్టించుకోవడంలేదు. అయితే సవరణలకు రైతులు ఏ మాత్రం అంగీకరించట్లేదు. సాగు చట్టాలను పూర్తిగా రద్దు చేయాలని, అప్పటిదాకా ఉద్యమం విరమించేది లేదని కరాఖండీగా చెబుతున్నారు. మార్చి 26 నాటికి ఆందోళన చేపట్టి నాలుగు నెలలు పూర్తవుతున్న సందర్భంగా ఆ రోజున భారత్ బంద్ చేపట్టాలని రైతు సంఘాలు ఇప్పటికే పిలుపునిచ్చాయి.