- సెంట్రల్ విస్టాకు మంజూరైన పర్యావరణ అనుమతులు
- 10 నెలల్లో పూర్తికానున్న రాజపథ్ ఆధునికీకరణ పనులు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కొత్త పార్లమెంటు భవన నిర్మాణ పనులు ఈ రోజు (జనవరి 15) ప్రారంభమయ్యాయి. మకర సంక్రాంతి ముగిసిన మరుసటి రోజు మంచిదని భావించి పనులు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. సెంట్రల్ విస్టా నిర్మాణ పనుల కాంట్రాక్ట్ ను టాటా ప్రాజెక్ట్ లిమిటెడ్ దక్కించుకుంది. కొత్త పార్లమెంటు భవన నిర్మాణానికి కేంద్ర ప్రజా పనుల విభాగం చేసిన ప్రతిపాదనకు పర్యావరణ మంత్రిత్వ శాఖ నిపుణుల కమిటీ ఆమోదం తెలిపింది. 14 మంది సభ్యుల హెరిటేజ్ కన్జర్వేటివ్ కమిటీ కొత్త పార్లమెంటు భవనానికి నిర్మాణానికి అనుమతులను మంజూరు చేసింది.
ఇది చదవండి: సెంట్రల్ విస్టాకు సుప్రీంకోర్టు పచ్చజెండా
సంస్కృతి సంప్రదాయాలకు నెలవుగా సెంట్రల్ విస్టా :
దేశానికి తలమానికంగా భావిస్తున్న సెంట్రల్ విస్టా భవనాన్ని త్రిభుజాకారంలో టాటా ప్రాజెక్ట్ లిమిటెడ్ నిర్మించనుంది. భవనం ప్రతి అణువు భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్మాణం సాగనుంది. ఒకేసారి 1272 మంది ఎంపీలు కూర్చోవడానికి అనుగుణంగా నిర్మాణం చేపడుతున్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని లోక్ సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది సభ్యులు కూర్చునేందుకు వీలుగా నిర్మిస్తున్నారు.
ఇది చదవండి: సరికొత్త పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్పూర్తికి నూతన భవనం ప్రతీక కావాలి
సెంట్రల్ విస్టా: 15 ఎకరాల్లో ప్రధాని నివాస భవనాలు:
రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకూ గల 3 కిలోమీటర్ల మేర రాజపథ్ ను అత్యంత ఆధునిక హంగులను కల్పించనున్నారు. కేంద్ర సచివాలయం, ప్రధాన మంత్రి నివాసం, కార్యాలయంతో పాటు ఉపరాష్ట్రపతి నివాస భవనాలను తొలిదశలో నిర్మాణం చేపట్టనున్నారు. ప్రధాన మంత్రి కొత్త నివాస భవన సముదాయం 15 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఇందులో 10 భవనాలు, నాలుగు అంతస్తుల్లో నిర్మిస్తారు. ఒక్కో భవనం 30, 351 చదరపు మీటర్ల మేర విస్తరించి ఉంటుంది. అలాగే ప్రత్యేక భద్రతా దళ భవనం రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉండనుంది. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ లోనే ఉపరాష్ట్రపతి ఎన్ క్లేవ్ కూడా ఉండనుంది. గరిష్టంగా 15 మీటర్ల ఎత్తుతో ఐదు అంతస్తులతో 32 భవన సముదాయాలు ఉంటాయి.
ముమ్మరంగా రాజపథ్ ఆధునికీకరణ పనులు:
రాజపథ్ ఆధునికీకరణ పనులు జనవరి 26న గణతంత్ర దినోత్సవాలు అనంతరం ప్రారంభింజనున్నారు. 10 నెలల్లో ఆధునికీకరణ పనులు పూర్తిచేసి వచ్చే సంవత్సరం రిపబ్లిక్ వేడుకల నాటికి రాజపథ్ ను సిద్ధం చేయనున్నారు. గత డిసెంబరు 10న ప్రధాని మోదీ పార్లమెంటు భవన నిర్మాణానాకి భూమి పూజ చేశారు. 971 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న కొత్త పార్లమెంటు భవనాన్ని 75వ స్వాతంత్ర దినోత్సవం నాటికి పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం టాటా ప్రాజెక్ట్ లిమిటెడ్ కు సూచించింది.
ఇది చదవండి: సెంట్రల్ విస్టా ఆధునిక వసతుల కలబోత