- ఆధ్రప్రదేశ్ సర్కార్, ఎన్నికల కమిషన్ మధ్య హోరాహోరీ
- అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ
- తప్పులతో కూడిన పిటిషన్ తిరస్కరణ
- సోమవారంనాడు విచారణ
- ఇద్దరు కలెక్టర్ల, పలువురు అధికారులపై ఎన్నికల కమిషన్ వేటు
- అమలు చేయడానికి ప్రభుత్వం నిరాకరణ
శుక్రవారంనాడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సమావేశానికి పిలిచినా కూడా పంచాయతీరాజ్ అధికారులు గైర్హాజరైనారు. ఎన్నికలకు వాతావరణం అనుకూలంగా లేదంటూ రమేష్ కుమార్ కి శుక్రవారం రాత్రి ఎనిమిది గంటలకు ప్రభుత్వం నుంచి నోట్ అందింది.
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వానికీ, ఎన్నికల కమిషనర్ కూ మధ్య రగులుతున్న పంచాయతీ పతాకస్థాయికి చేరింది. దేశంలోనే మొట్టమొదటి సారి ఈ విధంగా రెండు రాజ్యాంగవ్యవస్థలపైన పోరు జరుగుతున్నది. రాష్ట్రప్రభుత్వం అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా కలెక్టర్లను బదిలీ చేయాలనీ, ఎన్నికలు నిర్వహించాలనీ ఎన్నికల కమిషనర్ ప్రయత్నిస్తుంటే, ఎన్నికలకు అనువైన వాతావరణం రాష్ట్రంలో లేదనీ, కలెక్టర్ల బదిలీని అమలు చేయరాదనీ, ఎన్నికల కమిషనర్ లో సహకరించరాదనీ రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలగా ఉన్నది.
ఇదీ చదవండి: ఏపీలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
ఎన్నికలు నిర్వహించలేమంటూ ఎన్నికల కమిషనర్ కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. ఇద్దరు కలెక్టర్లూ, ఏడుగురు ఉన్నతాధికారులపైన ఎన్నికల కమిషనర్ వేసిన వేటు అమలు జరిగే అవకాశం లేదని ప్రభుత్వం సంకేతం పంపింది. గురువారంనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఎన్నికల కమిషన్ కు అనుకూలంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి విదితమే. ఎన్నికలు నిర్వహించాలంటూ హైకోర్టు నిర్ణయించింది. ఎన్నికల ప్రక్రియకు ప్రభుత్వాలు అవరోధాలు సృష్టించరాదంటూ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులు స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికలు ఎప్పడు నిర్వహించాలనే నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ పూర్తిగా ఎన్నికల సంస్థదేననీ, ప్రభుత్వానికి ప్రమేయం లేదని లోగడ సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సంగతి గురువారంనాడు హైకోర్టు ధర్మాసనం గుర్తు చేసింది.
ఇదీ చదవండి: స్థానిక ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు
తిరస్కరణకు గురయిన ప్రభుత్వ పిటీషన్ :
తప్పులతో కూడిన పిటిషన్ దాఖలు చేయడంతో సుప్రీంకోర్టు స్వీకరించడానికి నిరాకరించి పిటిషన్ ను తిరస్కరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున తప్పులతో కూడిన పిటిషన్ ను సుప్రీంకోర్టులో దాఖలు కావడం ఇది అయిదో విడత. ఎక్కడ ఏ పొరబాటు జరుగుతున్నదో తెలియదు. అదే విధంగా ఈ వివాదంలో ఉద్యోగుల పాత్ర వింతగా ఉంది. వారి వాదన వితండంగా ఉంది. ఎన్నికల విధులలో పాల్గొనబోమంటూ ఉద్యోగ సంఘాలు ప్రకటించడం ఎట్లా సమంజసమో ఉద్యోగసంఘాల నాయకులే చెప్పాలి.
ఇదీ చదవండి: ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ సంచలన నిర్ణయం