భగవద్గీత–98
మనసు రకరకాల ఆలోచనలతో చికాకుగా ఉన్నది. ఎన్నో ఆలోచనలు ఒకదానివెంట ఒకటి పరుగెడుతున్నాయి. ఆ సమయంలో మన మనస్సుకు ఎంత ఆహ్లాదకరమైన వాతావరణమైనా పట్టదు. ఎంత రుచికరమైన పదార్ధాన్ని నోట్లోపెట్టుకున్నా దాని రుచి తెలియదు. ఎదురుగా ఎంత ఇష్టమైన వారున్నా మనసుకు కష్టంగానే ఉంటుంది.
కాసేపు మనసులోని ఆలోచనలన్నీ మాయమైతే లేదా వాటిని ప్రక్కకుపెట్టి కాస్త మన పరిసరాలు పరికించితే…
Also read: అభ్యాసంద్వారా అంతరాల దర్శనం
ఒక్కసారి ఆకాశంకేసి చూస్తే కదిలే తెల్లటి మబ్బులు కనిపిస్తాయి. అవి ఎవరికోసం కదులుతున్నాయి? ఆ పని లేదా ‘‘కర్మ’’ ఎవరికోసం?
మన చుట్టూఉన్న చెట్లు, పుట్టలు, కొండ, కోన గమనించితే ఏవో శబ్దాలు ప్రకృతినుండి వచ్చేవి కలగలసి వినపడతాయి. పక్షుల కిలకిలలు, గాలివేసే ఈలలు అది చేసే సైగలు అన్నీ చెవులను, కళ్ళను తాకుతాయి. రణగొణధ్వనులు వినబడే నగరంలో ఉన్నాసరే అక్కడి ప్రకృతి పలకరింపులు మనకు వినబడతాయి.
ప్రకృతిలో మనం భాగమని తెలుసుకుంటూ ముందుకు వెళితే ఇవ్వన్నీ తెలుస్తాయి. ఇంకాస్త ముందుకు వెడదాం, మనసును పూర్తిగా ఖాళీచేద్దాం. అంటే మనసులో ఏమీలేని స్థితి అన్నమాట. ఈ స్థితిని, ఈ nothingnessని ZENలో ‘‘mushiryo’’ అని అంటారు. ఇక్కడితో కొన్ని సిద్ధాంతాలు ఆగిపోతాయి.
Also read: భోగలాలసత దుఃఖకారకం
పరమాత్మ ఇంకాస్త ముందుకు వెళ్ళమంటారు. మనసులో ఏ భావము లేకుండా ‘‘నన్నే’’ నిలిపి స్మరిస్తూ నిరంతరమూ నాయందే యున్న యోగికి ‘‘నేను’’ లభిస్తాను. ఈ ‘‘నేను’’ లభించడమంటే? ‘‘నేనే బ్రహ్మము’’ అనే స్థితిలోకి వెళ్ళిపోవడమన్నమాట.
అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః
తస్యాహం సులభః పార్ధ నిత్యయుక్తస్య యోగినః !
ఇది ఊరికే Intellectual Discussions వలన రాదు. అభ్యాసవైరాగ్యమువలన లభిస్తుంది.
Also read: మనలను ఆవరించిన మాయ