వోలెటి దివాకర్
‘‘టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనంతరం మహిళలపైనా పోలీసులు కేసులు పెట్టారు. అయి నా మహిళలు వెనక్కి తగ్గలేదు. చంద్రబాబు అరెస్టు వల్ల 105 మంది మృతి చెందారు ఆ 105 మంది కుటుంబాలను నేను పలకరిస్తాను. వారికి ధైర్యం చెపుతాను. వారికి అండగా ఉంటాను..’’ అని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వెల్లడించారు. నిజం గెలవాలి అనేది తమ నినాదం అని, ప్రజలు అంతా కలిసి ముందుకు రావాలని అన్నారు. మన జీవితాల్లో వెలుగుల కోసం ప్రజలతో కలిసి పోరాడుతానని త్వరలో మీ ప్రజల వద్దకు వస్తాను అని చెప్పారు. నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ ‘సత్యమేవ జయతే’ పేరుతో నారా భువనేశ్వరి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరాహార దీక్ష చేపట్టారు. టీడీపీ మహిళా నేతలు, జనసేన మహిళా నేతలు, వివిధ ప్రాంతాలనుంచి తరలివచ్చిన పార్టీ శ్రేణులు దీక్షకు సంఘీభావం తెలిపారు.
చిన్న పిల్లల చేతుల మీదుగా నిమ్మరసం తీసుకుని సాయంత్రం 5.10 గంటలకు భువనేశ్వరి దీక్ష విరమించారు.
ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ ఇలా అన్నారు: ‘నేను ఈ రోజు దీక్ష లో పాల్గొంది చంద్రబాబు నాయుడు కోసం, మా కుటుంబం కోసం కాదు. ప్రజల కోసం. జరుగుతున్న అన్యాయం కోసం నేను దీక్ష చేశాను. ఇప్పుడు చెపుతున్నాను. చంద్రబాబు ప్రజల మనిషి…..ఆయన నా ఆయుష్షుకూడా పోసుకుని జీవించాలి. ప్రజలకు సేవ చేయాలి. ఎన్టీఆర్ నీతి నిజాయితీ కలిగిన మనిషి. ఆయన మాకు అలా బతకడమే నేర్పించారు. క్రమ శిక్షణతో పెంచారు.
‘‘నా తండ్రి ముఖ్యమంత్రి, నా భర్త ముఖ్యమంత్రి. మేము అధికారాన్ని ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదు. మా పని మేము చేసుకుంటూ వెళతాం….అధికారంతో మాకు పనిలేదు. చంద్రబాబును ప్రజలకు సేవచేయడానికి వదిలేశాం.
‘‘ఈ రోజున నలుగురు నాలుగు దిక్కులు అయ్యాం. చంద్రబాబు జైల్లో ఉన్నారు…నేనూ, బ్రాహ్మణీ ఇక్కడ ఉన్నాం. లోకేష్ డిల్లీలో ఉన్నారు. మా కుటుంబానికి ఇలాంటి పరిస్థితి వస్తుంది అని నేను ఎప్పుడూ అనుకోలేదు. మమ్మల్ని అందరినీ అరెస్టు చేసినా మా బిడ్డలైన కార్యకర్తలు తెలుగు దేశం పార్టీని నడిపిస్తారు.
‘‘చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ప్రజలు, అభివృద్ది ఎలా చేయాలి అనే ఆలోచించారు. చంద్రబాబు గారు 25 ఏళ్ల క్రితమే ఐటీ గురించి ఆలోచించి అభివృద్ది చేశారు. దాని వల్ల యువతకు ఉద్యోగాలు వచ్చాయి. బిల్ గేట్స్ , బిల్ క్లింటన్ వంటి వాళ్లు ఎందుకు హైదరాబాద్ వచ్చారు? చంద్రబాబుపై నమ్మకంతోనే వచ్చారు. చంద్రబాబు కష్టం వల్లనే సైబరాబాద్ ఏర్పాటు అయ్యింది. రోజుకు 18 గంటలకు పనిచేసిన నేత చంద్రబాబు. విభజన తరువాత అమరావతి, పోలవరం గురించే చంద్రబాబు ఆలోచించారు. అమరావతి సైబరాబాద్ కంటే పెద్ద నగరం అవ్వాలి అని కలలు కన్నారు. చంద్రబాబు 14 ఏళ్లు సిఎంగా పనిచేశారు. కానీ 2014 తరువాత ఆయన పడిన కష్టం నేను ఎప్పూడూ చూడలేదు. చంద్రబాబు లేచింది మొదలు పోలవరం, అమరావతి వంటి వాటిగురించే ఆలోచించేవారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రంలో ఏమీ లేదు. కానీ చంద్రబాబు తన శక్తితో రాష్ట్రాన్ని గాడిన పెట్టారు. అభివృద్ది చేశారు. డబ్బులు లేని రాష్ట్రాన్ని పైకి తీసుకురావాలి అంటే కనీసం 10 ఏళ్లు పడుతుంది. కానీ చంద్రబాబు ఏమీ చేయలేదు అని హేళన చేశారు. ప్రజలు చేసిన పొరపాటుకు రాష్ట్రం నష్టపోయింది. ప్రజలు ఆలోచించి మళ్లీ ఓటు వేసి చంద్రబాబును గెలిపించాలని కోరుతున్నాను. చంద్రబాబు నాయుడును అరెస్టు చేసిన తరువాత అన్ని రంగాల నుంచి పెద్ద ఎత్తున ఆయనకు సంఘీభావం వచ్చింది. ఆయన అరెస్టును అన్ని వర్గాలు ఖండించాయి. ఐటీలో ఆయన చేసిన అభివృద్ది కారణంగా ఎన్నో కుటుంబాలు నిలబడ్డాయి. ఆర్థికంగా లక్షల కుటుంబాలు నిలబడ్డాయి. మేం రాజకీయాలనుంచి ఏమీ ఆశించలేదు. హెరిటేజ్ తో మేం హ్యాపీగా ఉన్నారు. ప్రజల సొమ్ముపై మాకు ఎప్పూడూ ఆశలేదు.’’